అవును.. వాళ్లిద్దరూ మళ్లీ కలిశారు
సంతోష్ శోభన్, మేర్లపాక గాంధీ మరోసారి కలిశారు. సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది. ఫస్ట్ లుక్ రిలీజైంది.
సంతోష్ శోభన్, మేర్లపాక గాంధీ.. వీళ్లిద్దరి కాంబినేషన్ చెప్పగానే ఏక్ మినీ కథ అనే చిన్న సినిమా గుర్తొస్తుంది. ఓటీటీలో సంచలనం సృష్టించింది ఆ సినిమా. మళ్లీ ఇన్నాళ్లకు ఈ కాంబో సెట్ అయింది.
సంతోష్ హీరోగా నటించిన సూపర్ హిట్' ఏక్ మినీ కథ' కు మేర్లపాక గాంధీ కథ, స్క్రీన్ ప్లే అందించాడు. టెక్నికల్ కారణాల వల్ల మరో వ్యక్తి దర్శకత్వం వహించాడు. అయితే ఈసారి మాత్రం నేరుగా గాంధీనే దర్శకత్వం వహిస్తున్నాడు. అందుకే ఇది క్రేజీ ప్రాజెక్ట్ అయింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు, ఈ సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రానికి లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ అనే క్రేజీ టైటిల్ పెట్టారు. ఇవి యూట్యూబ్ లో వీడియో కంటెంట్‌ను ప్రచారం చేయడానికి ఉపయోగించే సాధారణ పదాలు. ప్రతి పదాన్ని సూచించే చిహ్నాలతో టైటిల్ లోగో చాలా ఆసక్తికరంగా ఉంది.
యూనిక్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ వినోదాత్మక చిత్రంలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్, ఆముక్త క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు.