రెండో రోజుకే 60శాతం డ్రాప్.. రంగరంగ దారుణంగా..!
వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం రంగ రంగ వైభవంగా. రెండో రోజుకే ఈ సినిమా దారుణంగా పడిపోయింది. వైష్ణవ్ కెరీర్ లో మరో ఫ్లాప్ దిశగా దూసుకుపోతోంది.
వైష్ణవ్ తేజ్ నటించిన మూడో సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఉప్పెన క్రేజ్ తో ఈ హీరోకు వరుసపెట్టి అవకాశాలు వస్తున్నాయి. కానీ అలా వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు వైష్ణవ్. సరైన కథలు, క్యారెక్టర్లు ఎంచుకోలేక తడబడుతున్నాడు. ఈ క్రమంలోనే కొండపొలం, రంగరంగ వైభవంగా రూపంలో వరుసగా రెండు ఫ్లాపులిచ్చాడు.
ఈ మెగా హీరో తాజా చిత్రం రంగరంగ వైభవంగా. విడుదలకు ముందు ఓ మోస్తరు అంచనాలున్నాయి. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో వైష్ణవ్ అన్న సాయితేజ్ ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ తో మూవీపై బజ్ బాగా పెరిగింది. కానీ ఆ అంచనాల్ని సినిమా అందుకోలేకపోయింది. అలా విడుదలైన మొదటి రోజే ఫ్లాప్ టాక్ వచ్చేసింది. ఆ టాక్ ఏ రేంజ్ లో వచ్చిందంటే, రెండో రోజుకే ఆక్యుపెన్సీలో 60శాతం కోత పడింది.
ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన సినిమా ఇలా రెండో రోజుకే పడిపోవడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. కంటెంట్ బాగాలేకపోతే, ఏ సినిమానైనా రెండో రోజుకే తిరుగుటపా కట్టేయడం ఖాయమనే విషయం రంగరంగ వైభవంగా సినిమాతో తేలిపోయింది.
రెండో రోజు ప్రభావంతో, ఇక ఈ సినిమా కోలుకోవడం కష్టమనే విషయం తేలిపోయింది. ఈ సినిమాపై హీరోతో పాటు దర్శకుడు గిరీశాయ, హీరోయిన్ కేతిక శర్మ చాలా హోప్స్ పెట్టుకున్నారు. వాళ్ల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఈ సినిమా ఫెయిల్యూర్ కు ప్రధాన కారణం గిరీశాయ అంటున్నారు విమర్శకులు. రొటీన్ కథ, స్క్రీన్ ప్లేతో సెకెండాఫ్ బోర్ కొట్టించాడంటూ రివ్యూస్ వచ్చాయి.