No Sequel | ఈ 2 సినిమాల సీక్వెల్స్ ఇక రానట్టే..!
No Sequels - తాజాగా విడుదలైన 2 సినిమాలకు సీక్వెల్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడీ సీక్వెల్స్ వచ్చేలా కనిపించడం లేదు. కారణం ఏంటి?
సినిమా హిట్టయిన తర్వాత సీక్వెల్ ప్రకటించడం వేరు. సినిమా సక్సెస్ కాకముందే సీక్వెల్ ప్రకటించడం వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. సినిమా హిట్టయితే, ఆటోమేటిగ్గా సీక్వెల్ వస్తుంది. కథ దానంతట అదే పుట్టుకొస్తుంది. మరి హిట్ అవుతుందో అవ్వదో కూడా తెలియకుండా సీక్వెల్ ప్రకటిస్తే ఏమౌతుంది? ప్రస్తుతం 2 సినిమాలు ఇదే సమస్యతో బాధపడుతున్నాయి
స్కంద సినిమా చూసినవాళ్లకు ఎవరికైనా, సినిమా చివర్లో పార్ట్-2 హింట్ అర్థమౌతుంది. ఈ సినిమాలో ఇద్దరు రామ్ లు ఉన్నారు. ఒక రామ్ తో కథ మొత్తం నడిచింది. ఇక రెండో రామ్ కథతో పార్ట్-2 ఉండబోతోందనేది స్కందలో చెప్పారు. అయితే స్కంద మొదటి భాగమే ఫ్లాప్ అయింది. మరి ఇలాంటి సినిమాకు సీక్వెల్ తీస్తారా?
రామ్-బోయపాటి కాంబోలో వచ్చింది స్కంద సినిమా. పక్కా యాక్షన్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. సరైన కథ, స్క్రీన్ ప్లే రాసుకోకుండా, కేవలం ఫైట్స్ పై దృష్టి పెట్టి సినిమాను తీశారు. పైగా సెకెండాఫ్ లో బోయపాటి చాలా కన్ఫ్యూజ్ చేశాడు. దీనికి తోడు సాంగ్స్ క్లిక్ అవ్వలేదు. ఫలితంగా స్కంద సినిమా ఆడలేదు. ఇలాంటి సినిమాకు సీక్వెల్ ప్రకటించి ఉపయోగం లేదు. కానీ మేకర్స్ ఆల్రెడీ ప్రకటించేశారు. ఇప్పుడీ సీక్వెల్ సెట్స్ పైకి వచ్చే అవకాశం లేదు.
ఇలాంటిదే మరో సినిమా పెదకాపు-1. ఈ సినిమాను ప్రకటించినప్పుడే సీక్వెల్ ఉంటుందని చెప్పేశారు. కథ చాలా పెద్దదని, 2 భాగాలుగా చెప్పాలని తెలిపాడు శ్రీకాంత్ అడ్డాల. అందుకే తొలి భాగానికి పెదకాపు-1 అనే టైటిల్ పెట్టినట్టు వెల్లడించాడు. కానీ పార్ట్-1 ఆడలేదు. విరాట్ కర్ణ కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. అటు విరాట్ కర్ణ బావ మిర్యాల రవీందర్ రెడ్డి పెట్టిన డబ్బులు కూడా వెనక్కి రాలేదు. దీంతో ఈ సినిమాకు పార్ట్-2 రావడం అసంభవం అని తేలిపోయింది.
విడుదలకు ముందే సీక్వెల్స్ ప్రకటిస్తే ఇదే సమస్య. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే, ఇక ఆ ప్రాజెక్టును అక్కడితో ఆపేయాల్సిందే. కథపై ప్రేమతో దర్శకుడు కాస్త చొరవ చూపించినా, ఫ్లాప్ సినిమా సీక్వెల్ లో నటించడానికి ఏ హీరో ముందుకురాడు. అలాంటి ప్రాజెక్టుపై డబ్బులు పెట్టడానికి నిర్మాత అస్సలు ధైర్యం చేయడు.