Rathnam Movie Review: రత్నం - మూవీ రివ్యూ! {1.75/5}

Rathnam Movie Review: పురచ్చి దళపతి (విప్లవ దళపతి) విశాల్ 2017 లో ‘తుప్పరివాలన్’ (తెలుగులో ‘డిటెక్టివ్’) హిట్టయిన తర్వాత, వరుసగా 9 ఫ్లాపులిచ్చి, చిట్టచివరికి 2023 లో ‘మార్క్ ఆంథోనీ’ తో ఏకంగా రూ. 100 కోట్ల బ్లాక్ బస్టర్ ఇచ్చేసి సర్ప్రైజ్ చేశాడు.

Advertisement
Update:2024-04-27 17:31 IST

చిత్రం: రత్నం

రచన-దర్శకత్వం: హరి

తారాగణం : విశాల్, ప్రియా భవానీ శంకర్, తులసి, సముద్రకని, మురళీ శర్మ, యోగి బాబు, విజయ్ కుమార్, జయప్రకాష్ తదితరులు

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : సుకుమారన్

నిర్మాత : కార్తికేయన్ సంతానం, అలంకార్ పాండియన్

విడుదల :ఏప్రిల్ 26, 2024

రేటింగ్: 1.75/5

పురచ్చి దళపతి (విప్లవ దళపతి) విశాల్ 2017 లో ‘తుప్పరివాలన్’ (తెలుగులో ‘డిటెక్టివ్’) హిట్టయిన తర్వాత, వరుసగా 9 ఫ్లాపులిచ్చి, చిట్టచివరికి 2023 లో ‘మార్క్ ఆంథోనీ’ తో ఏకంగా రూ. 100 కోట్ల బ్లాక్ బస్టర్ ఇచ్చేసి సర్ప్రైజ్ చేశాడు. ఈ మాస్ యాక్షన్ మూవీకి కి సైన్స్ ఫిక్షన్ జోడించి విప్లవాత్మకంగా ఒక కొత్త వెరైటీని సృష్టించాడు. ఇకపైన విశాల్ ఇలాగే అప్డేట్ అవుతూ బ్లాక్ బస్టర్స్ ఇస్తాడనుకునేలా నమ్మకం కల్గించాడు. తమిళంలో సూర్యతో ‘సింగం’ సిరీస్ పోలీస్ సినిమాలతో రికార్డులు బ్రేక్ చేసిన దర్శకుడు హరి కూడా తన ఒకే రకమైన పాత మూస మాస్ సినిమాలనుంచి అప్డేట్ అయినట్టూ కనిపించాడు. కానీ మళ్ళీ అదే పాత మూస బాట పట్టి మరో మూడు అట్టర్ ఫ్లాపులిచ్చాడు. ఇలా అప్డేట్ అయిన విశాల్, అప్డేట్ అయీ పాత వాసనలు వెదజల్లడానికే సిద్ధపడిన హరి తో చేతులు కలిపితే ఏం జరిగింది? చేతులు కాలాయా, కరతాళల ధ్వనులు అందుకున్నాయా? ఏం జరిగిందో తెలుసుకుందాం...

కథ

చిత్తూరులో పళని స్వామి (సముద్రకని) అనే ఎమ్మెల్యేకి రత్నం (విశాల్) నమ్మిన బంటుగా వుంటూ పనులు చక్కబెడుతూంటాడు. పోలీసులు చేసే సగం పనులు తనే చేసి శాంతి భద్రతలకి గ్యారంటీగా వుంటాడు. చిన్నతనంలో తల్లిని కోల్పోయిన బాధ వెంటాడుతూంటుంది. ఇలా వుండగా, ఓ రోజు మల్లిక (ప్రియా భవానీ శంకర్) నీట్ పరీక్ష రాయడానికి చిత్తూరు వస్తే ఆమెని చంపడానికి ఓ గ్యాంగ్ ప్రయత్నిస్తుంది. రత్నం ఆ దాడిని తిప్పికొట్టి ఆమెని కాపాడతాడు. ఆమెని ప్రేమిస్తాడు. అయితే ఆమె తన తల్లి పోలికలతో వుండడంతో క్షోభ అనుభవిస్తాడు. ఆమెని చంపడానికి గ్యాంగ్ చేసే ప్రయత్నాలు ఆగవు.

మల్లిక కుటుంబానికి కొంత స్థలముంది. ఆ స్థలం తమిళనాడు నుంచి తిరుపతి విడిపోయినప్పుడు తమిళనాడులోకి వెళ్ళిపోయింది. ఆ స్థలంలో పూర్వీకుల సమాధులున్నాయి. సంవత్సరానికోసారి వెళ్ళి పూజలు చేసి వస్తూంటారు. ఈ సంవత్సరం వెళ్ళినప్పుడు చూస్తే, ఆ స్థలంలో ఓ మెడికల్ కాలేజీ కట్టేస్తున్నారు. మల్లిక తండ్రి (జయప్రకాష్) ల్యాండ్ మాఫియా లింగం (మురళీ శర్మా) మీద పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాడు. పోలీసులు తండ్రి సంతకంతో వున్న అగ్రిమెంట్ చూపించి దబాయించారు.

మల్లిక చదువుకోసం ఆమె తండ్రి వేరే చోట కొంత అప్పుతీసుకుని, ఖాళీ కాగితం మీద సంతకం పెట్టి ఇచ్చాడు. ఆ కాగితాన్ని సొంతం చేసుకున్న లింగం, దాని మీద స్థలం అమ్మకం తాలూకు అగ్రిమెంట్ రాసుకుని వెళ్ళగొట్టాడు. అయితే అగ్రిమెంట్ మీద తన సంతకం చెల్లదని తండ్రి అసలు విషయం బైట పెట్టాడు. ఆ స్థలాన్ని ఆరవ తరానికి చెందిన మొదటి వారసులే అమ్మగలరనీ, ఆ ప్రకారం ఆరవ తరం మొదటి వారసురాలిగా తన కూతురు మల్లికకి మాత్రమే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టే అధికారముందనీ స్పష్టం చేసేశాడు.

దీంతో లింగం, ఈ కూతురు మల్లికని గనుక లేపేస్తే అయిదవ తరం వారసుడు తండ్రి చేసిన సంతకంతో అగ్రిమెంట్ చెల్లుతుందని మల్లికని లేపేసే కార్యక్రమానికి తెర లేపాడు.

ఇప్పుడేం జరిగింది? రత్నం మల్లికని కాపాడి స్థలం ఆమె కుటుంబానికి దక్కేలా లింగం అంతు చూశాడా? తల్లి పోలికలతో వున్న మల్లికని ప్రేమించలేని క్షోభ నుంచి ఎలా బయట

పడ్డాడు? తల్లి మరణంతో లింగం కున్న సంబంధం తెలుసుకుని ఏం చేశాడు? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగతా కథ.

ఎలావుంది కథ

హరి చేతిలో హరీమన్న పాత రొడ్డ కొట్టుడు కథ. హరితో చేతులు కలిపి విశాల్ తిరిగి ‘మార్క్ ఆంథోనీ’ పూర్వపు ఫ్లాప్ మసాలా కాలాని కెళ్ళిపోయిన కథ. ప్రమాదంలో హీరోయిన్, ఆ హీరోయిన్ ని కాపాడే హీరోల సినిమాలు తెలుగులో, తమిళంలో వచ్చీ వచ్చీ చచ్చిపోయాయి. దీన్ని బతికించడానికి ఇప్పుడు నానా పాట్లు పడ్డారు. స్థూలంగా ఒక ల్యాండ్ సెటిల్మెంట్ కథని సాగదీసి సాగదీసి, చెప్పడానికి కథ లేదన్నట్టు అడుగడుగునా ఫైట్లతో నింపేశారు.

తమిళనాడు నుంచి తిరుపతి విడిపోయినప్పుడు తమిళనాడులోకి స్థలం వెళ్ళిపోవడమనే అంశం, 2017 లో విద్యాబాలన్ నటించిన ‘బేగం జాన్’ ని గుర్తు చేస్తుంది. ఇందులో 1947 లో దేశ విభజనప్పుడు అటు బెంగాల్లో, ఇటు పంజాబ్ లో రెండు గీతలు గీసేసి దేశాన్ని విభజించేస్తాడు రాడ్ క్లిఫ్. అటు తూర్పు పాకిస్తాన్, ఇటు పశ్చిమ పాకిస్తాన్, మధ్యలో ఇండియా పొమ్మంటాడు. దీని ప్రకారం కంచె వేసుకుంటూ వస్తూంటే, సరీగ్గా రాడ్ క్లిఫ్ రేఖ మీద బేగం జాన్ వేశ్యా గృహం తగుల్తుంది. ఖాళీ చేయాల్సిందిగా ఆమెకి నోటీసులిస్తే చించి పారేస్తుంది- ‘మీరు సాని కొంప అంటున్న ఈ ఇల్లు నా ఇల్లు, నా దేశం. మమ్మల్ని ఇక్కడ్నించి కదిలించాలని చూశారో, మీ కాళ్ళూ చేతులూ తీసేసి “దేహ విభజన” చేస్తాం’ అని వార్నింగ్ ఇస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ ఎమోషనల్ స్టోరీ.

ఇదొకటైతే, ‘రత్నం’ లో హీరో తల్లికి వేశ్యాగృహంలో మగ్గే కథ ఫ్లాష్ బ్యాకుగా వేశారు. ఇలా ప్రాంత విభజనతో స్థలం స్థానభ్రంశం చెందడం, వేశ్యాగృహమూ అనే ఈ రెండు అంశాలూ ‘బేగం జాన్’ నుంచి ఎత్తేస్తే వచ్చిన ఫలితమే, ‘రత్నం’ అనే రొడ్డ కొట్టుడు అని అనుమానించాల్సిన పరిస్థితి.

ఫస్టాఫ్ న్యాయం పేరుతో హత్యలుచేసే హీరో, ప్రమాదంలో హీరోయిన్, ఆమెతో ప్రేమ, తర్వాత ఆమె అసలు కథ అనే టెంప్లెట్ లో సాగినా, అగ్రిమెంట్ కాగితమనే వివాదం దగ్గర కొత్త మలుపు తీసుకున్నా, సెకండాఫ్ కొచ్చేసరికి ‘గుంటూరు కారం’ లో తాత అగ్రిమెంట్ పై మహెష్ బాబు సంతకం పెట్టాల్సిన అర్ధంపర్ధం లేని కథలా మారిపోయింది. పైగా ఈ కథ వదిలేసి హీరో తల్లి చావుకి కారకుడయ్యాడని అదే విలన్ మీద పగదీర్చుకునే హీరో రివెంజీ స్టోరీగా మారిపోయింది! అట్టర్ ఫ్లాపులతో అన్నేళ్ళ అనుభవంతో విశాల్ కథల్ని ఎలా జడ్జి చేస్తాడో అర్ధంగాని పదార్ధంగా మారిపోయింది...

నటనలు- సాంకేతికాలు

వీటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కళ తప్పిన మొహంతో హీరోయిన్, కండలు తిరిగిన శరీరంతో విశాల్, దట్టంగా పౌడరు పూసుకునే పిచ్చితో విలన్-అంతా ఆటవికంగా వుంటుంది. దర్శకుడు హరి రిటైర్ అవడానికిక పరాకాష్ట. అవసరం లేకపోయినా ఫైట్లు. అవీ సాగదీసిన ఫైట్లు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతమైతే చెప్పక్కర్లేదు- శరీరం కుంచించుకుపోయే స్వరాలు. బ్యాక్ గ్రౌండ్ విషాద గీతం, దాని సాహిత్యం అద్భుతం. విశాల్ తెలుగు డబ్బింగ్ అయితే ఎవరో జూనియర్ ఆర్టిస్టుకి చెప్పినట్టుంది. డబ్బింగ్ ఆర్టిస్టు విశాల్ ని జ్యూనియర్ ఆర్టిస్టు అనుకున్నాడేమో తెలీదు.

ఇంకో ముఖ్య విషయమేమిటంటే- ‘బేగం జాన్’ లో వేశ్యా గృహాన్ని తొలగింఛడానికి దాన్నే కేంద్రంగా జేసుకుని ఎన్నిసార్లు పోలీసు దాడులు జరుగుతాయో- అదే తరహాలో- సెకండాఫ్ లో హీరోయిన్ ని చంపడానికి హీరోయిన్ కుటుంబం వున్న ఇంటి మీదే విలన్ రకరకాలుగా దాడులు చేస్తూంటాడు. ఈ రకంగా ‘రత్నం’ ‘బేగం జాన్’ విసిరేయగా దొరికిన కొన్ని కథా సౌందర్యపు రత్నాల్ని ఏరి తెచ్చుకుని, రత్న కిరీటం తయారు చేసుకుంది.


Full View


Tags:    
Advertisement

Similar News