సినీ పరిశ్రమను తరిమేస్తరా?
ఉద్దేశపూర్వకంగానే ఆ సెక్షన్ పై దాడి కొనసాగిస్తున్నరా!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పరిశ్రమలు రావడం.. పెట్టుబడులు పెట్టడం మాట దేవుడెరుగు! ఉన్న పరిశ్రమలే తట్టాబుట్టా సర్దేసుకునే ప్రయత్నంలో ఉన్నాయి. కొన్ని రోజులుగా జరుగుతోన్న పరిణామాలను గమనిస్తే సినీ పరిశ్రమను హైదరాబాద్ నుంచి తరిమేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే అనుమానాలు బల పడుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేసుకోవడం.. సమంత, అక్కినేని కుటుంబంతో పాటు హీరోయిన్లను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు.. ఈ పరిణామాలన్నీ సినీ పరిశ్రమను తరిమేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారనే అనుమానాలకు బలాన్నిస్తున్నాయి. సినీ రాజకీయ కుటుంబాలకే చెందిన అమరరాజ బ్యాటరీస్ తెలంగాణ నుంచి దాదాపుగా ఎగ్జిట్ అయ్యేంత సీన్ క్రియేట్ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రభుత్వం తీరుపై అమరరాజ బ్యాటరీస్ ఎండీ గల్లా జయదేవ్ బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఐటీ, ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు స్పందించి జయదేవ్ తో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఒక్కొక్కటిగా చూసినప్పుడు ఈ పరిణామాలు దేనికవే కనిపిస్తున్నాయి.. కానీ దీని వెనుక పెద్ద స్కెచ్ ఉందని పరిశ్రమవర్గాలు అనుమానిస్తున్నాయి.
చెరువును ఆక్రమించి నిర్మించారని అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన ఎన్ కన్వెన్షన్ బుల్డోజర్లతో కూల్చేశారు. నాగార్జున కోర్టుకు వెళ్లి తనకు అనుకూలంగా ఆర్డర్ తెచ్చుకునే లోపలే కూల్చివేతలు పూర్తి చేశారు. అదే రోజు తెలుగు సినీ ప్రముఖలంతా సమావేశమై ప్రభుత్వ చర్యలపై చర్చించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సినీ రంగానికి చెందిన ప్రముఖలంతా వెళ్లి సీఎం రేవంత్ రెడ్డితో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. సినీ పరిశ్రమకు తోడ్పాటునందించాలని విజ్ఞప్తి చేశారు. నాగార్జున కూడా తన సతీమణి అమలతో కలిసి వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారు. తెరవెనుక ఏదేదో జరిగిందనే ప్రచారం మామూలే.. వాస్తవమేమిటో నాగార్జున, సీఎం రేవంత్ రెడ్డికే తెలియాలి. నందమూరి యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైటెక్స్ లో ఏర్పాటు చేసుకున్నారు. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అదే రోజు అక్కడే కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నారు. సీఎం సహా వీవీఐపీలంతా అక్కడే ఉండటం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ లెక్కకు మించి రావడంతో సెక్యూరిటీ విషయంలో చేతులెత్తేశారు. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. తారక్ ను దెబ్బతీయడానికి ఏదైనా కుట్ర జరిగిందా అనే అనుమానాలు కూడా వచ్చినా.. జూనియర్ అలాంటి ప్రచారంపై ఎక్కడా రియక్ట్ అవ్వలేదు.
రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేసే క్రమంలో బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవాళ్లు జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ ఇందుకు తాము మినహాయింపు అనుకుంటున్నారా అనిపిస్తుంది. ప్రత్యర్థులపై విరుచుపడే క్రమంలో వీరిద్దరు సంయమనం కోల్పోతున్నారు. రేవంత్ రెడ్డి తాను సీఎం అన్న విషయం మరిచిపోయి అవతలి వాళ్లను పలుచన చేసేలా మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన తరహాలోనే కొండా సురేఖ.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో హీరోయిన్ సమంత, అక్కినేని కుటుంబాన్ని రొంపిలోకి లాగింది. నాగచైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ కారణమని ఆరోపించింది. నాగార్జున క్యారెక్టర్ ను దెబ్బతీసేలా కామెంట్స్ చేసింది. కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ మొత్తం ఒక్కతాటిపైకి రావడంతో కాంగ్రెస్ పార్టీ దిక్కు తోచని స్థితిలో పడిపోయింది. సురేఖను సమర్థిస్తే సినీ పరిశ్రమ తమకు దూరమవుతుందనే ఆందోళనతో పీసీసీ చీఫ్ ఒక వీడియో సందేశం రిలీజ్ చేశారు. మంత్రి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు కాబట్టి వివాదాన్ని ఇంతటితో ముగించాలని ఇండస్ట్రీ పెద్దలకు ఉచిత సలహా ఇచ్చారు. ఇక్కడ పీసీసీ అధ్యక్షుడి ప్రయత్నం మంచిదే కావొచ్చు.. కానీ రెండు వైపులా మహిళలే బాధితులు అని చెప్పడం వెనుక కూడా పొలిటికల్ ఎజెండా దాగి ఉంది. పీసీసీ అధ్యక్షుడు చెప్పే వరకు తన వ్యాఖ్యలపై కొండా సురేఖ విచారం వ్యక్తం చేయలేదు. సమంతపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్టే అక్కినేని నాగార్జున, ఆయన కుటుంబం సహా ఇతర హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలకు మీడియా ముందుకు వచ్చి విచారం వ్యక్తం చేసి ఉంటే బాగుండేది. ఇండస్ట్రీ పెద్దలు కూడా అదే కోరుకుంటున్నారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి అలాంటి ప్రయత్నమేది జరగడం లేదు. ఉంటే ఉండండి.. లేకపోతే దిక్కున్న చోటుకు పోండి అన్న తెగింపు ధోరణే ప్రభుత్వ పెద్దల్లో కనిపిస్తుంది. సినీ పరిశ్రమ హైదరాబాద్ ను వీడితే నగర బ్రాండ్ ఇమేజ్ మసకబారడమే కాదు.. పెట్టుబడులపైనా ప్రభావం చూపిస్తుంది. వేలాది మంది ఉపాధి దెబ్బతింటుంది. ప్రభుత్వాన్ని నడిపించే వాళ్లకు పట్టువిడుపులు ఉండాలి.. పంతాలకు పోతే వాళ్లకు వచ్చే నష్టమేమి ఉండకపోవచ్చు.. కానీ రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందనే వాస్తవాన్ని గుర్తించాలి. అది ఈ ప్రభుత్వానికి తెలిసి వస్తుందో చూడాలి!!