Virupaksha Movie Review: విరూపాక్ష మూవీ రివ్యూ {2.75/5}

Virupaksha Movie Review: సాయి తేజ్ నటించిన చిత్రం విరూపాక్ష. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా రిజల్ట్ ఏంటి?

Advertisement
Update:2023-04-21 16:51 IST

Virupaksha Movie Review: విరూపాక్ష మూవీ రివ్యూ {2.75/5}

చిత్రం: విరూపాక్ష

నటీనటులు : సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీన‌న్‌ , సాయి చంద్ , అజయ్ , సునీల్ , రాజీవ్ కనకాల , బ్రహ్మజీ , సోనియా సింగ్ , కమల్ కామరాజు తదితరులు

సినిమాటోగ్ర‌ఫీ: శ్యామ్ ద‌త్ సైనుద్దీన్‌

సంగీతం: బి.అజ‌నీష్ లోక్‌నాథ్‌

ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి

స్క్రీన్ ప్లే: సుకుమార్‌

నిర్మాణం : శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్

నిర్మాత‌: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌

స్టోరీ -డైరెక్షన్ : కార్తీక్ వర్మ దండు

రేటింగ్: 2.75/5


కథలు మాత్రమే కాదు, జానర్లు కూడా కొత్తగా పుట్టుకురావు. ఉన్న జానర్ల నుంచే మంచి కథల్ని ఎంచుకొని, మళ్లీ మళ్లీ సినిమాలు తీయడమే. ఈ తీతలో ఎంత కొత్తదనం చూపించామనేది ముఖ్యం. ఈరోజు రిలీజైన విరూపాక్ష కథ కూడా ఇదే. చంద్రముఖి కంటే కొత్త కథేం కాదిది. అరుంధతి కంటే గొప్ప సినిమా కూడా కాదు. ఇఁకా చెప్పాలంటే ఈ జానర్ లో వచ్చిన ఎన్నో సినిమా కథల్లాంటిదే విరూపాక్ష కూడా. కానీ ఈ సినిమా బాగుంది. దీనికి కారణం కథను కొత్తగా చెప్పడం, అద్భుతమైన 2 ట్విస్టులు పెట్టడం, మరో చేత్తో సాంకేతికతను వాడుకోవడం. 


అన్ని థ్రిల్లర్ సినిమాల్లానే విరూపాక్షలో కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే కొన్ని వెబ్ సిరీస్, హాలీవుడ్ సినిమాల్లో చూసినంత సీట్-ఎడ్జ్ థ్రిల్ మాత్రం ఇది అందించదు. ఉన్నంతలో డీసెంట్ థ్రిల్స్ ఉన్నాయి, మరీ ముఖ్యంగా 2 మెయిన్ ట్విస్టులు ఈ సినిమాను నిలబెట్టాయి. కాకపోతే సాయిధరమ్ తేజ్ లాంటి స్టార్ నటించడం ఈ సినిమాకు ప్లస్ అయింది. దీనికి తోడు శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ, సుకుమార్ స్క్రీన్ ప్లే, అజనీష్ లోకనాధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.


మంత్రాలు-తంత్రాల కథలు టాలీవుడ్ కు కొత్త కాదు. చేతబడి ఆధారంగా సినిమాలు, క్షుద్రశక్తిపై దైవశక్తి గెలుపు లాంటి స్టోరీలు 1980-90ల్లో చాలానే చూశాం. ఈమధ్య ఇలాంటి కథలు తగ్గిపోయాయి. ఈ గ్యాప్ విరూపాక్షకు బాగా కలిసొచ్చింది. ఈ తరహా సినిమాలు చూసి చాన్నాళ్లు అవ్వడంతో అంతా ఫ్రెష్ గా ఫీల్ అయ్యారు. ఈ టైపు సినిమాలొచ్చి చాలా రోజులవ్వడంతో, ఆడియన్స్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ సినిమా చూడొచ్చు.


ఇదొక మిస్టిక్ థ్రిల్లర్ కాబట్టి, కథ గురించి డీటెయిల్ గా చెప్పుకోకూడదు. బ్రీఫ్ గా చెప్పాలంటే, రుద్రవనం అనే ఊరిలో 1991లో జరిగే కథ ఇది. అంతకు 12 ఏళ్ల కిందట, అంటే, 1979లో ఓ భార్యభర్తను ఊరి ప్రజలు సజీవ దహనం చేస్తారు. ఊరిలో చేతబడి చేస్తున్నారనే అనుమానంతో భార్యాభర్తల్ని చెట్టుకు కట్టి తగలబెట్టేస్తారు. సరిగ్గా పుష్కరానికి ఊరు వల్లకాడు అవుతుందని శపించి ఆ జంట చనిపోతుంది. చెప్పినట్టుగానే ఊరిలో అనుమానాస్పద మరణాలు మొదలవుతాయి. సరిగ్గా అప్పుడే హీరో సాయిధరమ్ తేజ్ ఊరిలో అడుగుపెడతాడు. హీరోయిన్ సంయుక్త మీనన్ ను చూసి ఇష్టపడతాడు. ఓవైపు ఇలా లవ్ ట్రాక్ నడుస్తుండగానే మరోవైపు, ఊరిలోకి క్షుద్రశక్తులు ప్రవేశిస్తాయి. అవి ఏకంగా హీరోయిన్ నే చుట్టుముడతాయి. వాటి నుంచి తన లవర్ ను, ఊరిని హీరో ఎలా కాపాడుకున్నాడనేది స్టోరీ. 


ఇలా చెప్పుకుంటే కథ సింపుల్ గానే అనిపించొచ్చు, కానీ ఇందులో భయంకరమైన ట్విస్ట్ ఉంది. అది క్లయిమాక్స్ లో తెలుస్తుంది. ఈ సినిమాని నిలబెట్టింది, మనం చెప్పుకున్న సింపుల్ కథకు కొత్తదనం తీసుకొచ్చింది ఆ ట్విస్టే. అది ఇక్కడ చెప్పడం కంటే థియేటర్లలో ఎక్స్ పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. 


డైరక్ట్ గా కథలోకి వెళ్లిపోయాడు దర్శకుడు. ఎలాంటి డీవియేషన్స్ లేకుండా పూర్తిగా కథపైనే దృష్టి పెట్టాడు. ప్రతి డీటెయిలింగ్ కు క్లయిమాక్స్ లో లింక్ ఇచ్చాడు. చివరికి ఫస్టాఫ్ లో కాస్త బోర్ అనిపించిన రొమాంటిక్ ట్రాక్ కూడా ఎందుకు పెట్టాడో, క్లయిమాక్స్ లో తెలుస్తుంది. తొలిసగం ఇలా సోసోగా సాగినప్పటికీ, అద్భుతమైన ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ వేశాడు దర్శకుడు. 


ఇక సెకెండాఫ్ నుంచి సినిమా పరుగులుపెడుతుంది. ఎక్కడా ఆగదు. ప్రీ-క్లయిమాక్స్ అదిరిపోయింది. క్లయిమాక్స్ మళ్లీ వీక్ అనిపించింది. అలాంటి క్లయిమాక్స్ ను తెలుగు ఆడియన్స్ ఊహించడు, జీర్ణించుకోడు. అది ఎలాంటి ఫలితాన్నిస్తుందనేది రోజులు గడిచేకొద్దీ తేలుతుంది. 


అయితే ఇందులో కూడా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. సునీల్ పాత్రను రాసుకున్న విధానం, అతడి క్యారెక్టర్ ఆర్క్ బాగాలేదు. హీరోయిన్ కు, ఆమె తండ్రికి మధ్య అనుబంధాన్ని చూపించలేదు. ఇక హీరోయిన్ కు, అతడి సోదరుడికి మధ్య అనుబంధాన్ని కూడా పూర్తిస్థాయిలో ఎస్టాబ్లిష్ చేయలేదు. వీటికి కూడా చోటిచ్చి ఉంటే సినిమా నెక్ట్స్ లెవెల్లో ఉండేది. 


యాక్సిడెంట్ తర్వాత సాయితేజ్ నటించిన సినిమా ఇది. యాక్సిడెంట్ వల్ల అతడు శారీరకంగా ఎంత ఇబ్బంది పడ్డాడో ఈ సినిమా చూస్తే తెలుస్తోంది. ఓ 2 చోట్లు పరుగెత్తే సీన్లు ఉన్నాయి, వాటిని సాయితేజ్ సరిగ్గా చేయలేకపోయాడు. అతడి స్టాండింగ్ పొజిషన్ లో కూడా తేడా ఉంది. ఇక డైలాగ్ డెలివరీ సరిగ్గా లేదనే విషయం అందరికీ తెలిసిందే. వచ్చే సినిమా నాటికి ఈ లోపాల్ని అతడు అధిగమిస్తాడని ఆశిద్దాం. హీరోయిన్ సంయుక్త మీనన్ చాలా బాగా చేసింది. రాజీవ్ కనకాల, సాయిచంద్, సునీల్, కమల్ కామరాజు, అజయ్, సోనియా తమ పాత్రలకు న్యాయం చేశారు. 


టెక్నికల్ గా సినిమా ఉన్నతంగా ఉంది. సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైనింగ్, ఆర్ట్ వర్క్ బాగున్నాయి. ఈ సినిమా క్లిక్ అవ్వడంలో మేజర్ క్రెడిట్ ఈ 3 విభాగాలకే ఇవ్వాలి. దర్శకుడిగా కార్తీక్ దండు తన పనితనం చూపించాడు. అతడు కథను రాసుకున్న విధానం బాగుంది. ఎంత బాగా రాసుకున్నాడో, అంతే బాగా తీశాడు కూడా. 


ఓవరాల్ గా విరూపాక్ష సినిమా అనుకున్న లక్ష్యాన్ని ఛేదించింది. ఆడియన్స్ కు థ్రిల్ అందించడంలో సక్సెస్ అయింది.

Tags:    
Advertisement

Similar News