Maharaja Movie Review: మహారాజా - మూవీ రివ్యూ {3/5}
Maharaja Movie Review: విజయ్ సేతుపతి 50వ సినిమా అనగానే ఆసక్తి, మార్కెట్ లో కదలిక, సోషల్ మీడియాలో హల్చల్ ఏర్పడ్డాయి.
చిత్రం: మహారాజా
రచన- దర్శకత్వం : నిథిలన్ స్వామినాథన్
తారాగణం : విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్. మమతా మోహన్ దాస్, భారతీ రాజా, అభిరామి, నటరాజ్ తదితరులు
సంగీతం : ఆజనీష్ లోకనాథ్, ఛాయాగ్రహణం : దినేష్ పురుషోత్తమన్
బ్యానర్స్ : ఎన్‌వీఆర్ సినిమా, ప్యాషన్ స్టూడియోస్
నిర్మాతలు : సుదర్శన్ సుందరం, జగదీష్ ఫళని స్వామి
విడుదల : జూన్ 14, 2024
రేటింగ్: 3/5
విజయ్ సేతుపతి 50వ సినిమా అనగానే ఆసక్తి, మార్కెట్ లో కదలిక, సోషల్ మీడియాలో హల్చల్ ఏర్పడ్డాయి. 50 వ సినిమాగా అతనేం ప్రత్యేకత చూపించబోతున్నాడ న్న కుతూహలమొకటి. దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తో, కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తో కలిపి ఆ ప్రత్యేకత ఎలా వుండబోతోంది? కమర్షియల్ సినిమాని ఏ భిన్న కోణంలో చూపించాడు? ఇందులో తన పాత్ర ఎలాటిది? ముసురుకుంటున్న ఇన్నిప్రశ్నలతో ఈ తమిళ సినిమా కథ కూడా సంధిస్తున్న ప్రశ్నలేమిటి? ఇవి తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం...
కథ
మహారాజా (విజయ్ సేతుపతి) చిన్న సెలూన్ పెట్టుకుని జీవిస్తూంటాడు. ఒక ప్రమాదంలో భార్య చనిపోతే కూతురే లోకంగా బ్రతుకుతూంటాడు. ఓ రాత్రి ఇంట్లో దొంగలు పడతారు. దొంగలు ఇంట్లోంచి లక్ష్మిని ఎత్తుకు పోతారు. మహారాజా పోలీస్ స్టేషన్ కెళ్ళి లక్ష్మిని వెతికి పెట్టమని కంప్లెయింట్ ఇస్తాడు. లక్ష్మి అనేది అతను చెత్తడబ్బాకి పెట్టుకున్న పేరు. చెత్తడబ్బా వెతకడమేమిటని పోలీసులు నవ్వి అవమానించి వెళ్ళగొడతారు. మహారాజా ఏడు లక్షలు లంచమిస్తానంటే ఒప్పుకుని చెత్త డబ్బా వెతకడం మొదలెడతారు.
ఏమిటీ చెత్తడబ్బా? అది ఎంతుకంత ముఖ్యమయింది మహారాజాకి? కూతురితో ఆ చెత్తడబ్బా కున్న సంబంధమేమిటి? పోలీసులు ఆ చెత్తడబ్బాని వెతికి పట్టుకోగలిగారా? అప్పుడేం జరిగింది? అప్పుడు బయటపడ్డ భయంకర రహస్యాలేమిటి? ఇందులో క్రిమినల్ సెల్వన్ (అనురాగ్ కశ్యప్) పాత్రేమిటి? ఇతడికి మహారాజా విధించిన శిక్షేమిటి? ఈ ప్రశ్నలకి సమాధానాలు మిగతా కథ చూసి తెలుసుకోవాలి.
ఎలావుంది కథ
ఇది ప్రతీకారంతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ కథ. అయితే ప్రతీకార కథ అనేది చివరి వరకూ సస్పెన్స్ లో వుంటుంది. కథ మాత్రం లీనియర్ నేరేషన్ లో వుండదు. ముందుకీ వెనక్కీ నడుస్తూ నాన్ లీనియర్ గా వుంటుంది. చివర్లో ఈ నాన్ లీనియర్ దృశ్యాలన్నీ ఏది ఎప్పుడు ఎందుకు జరిగాయనే ప్రశ్నలన్నిటికీ సమాధానమిస్తూ కొలిక్కి వస్తాయి. అయితే ఈ దృశ్యాల్ని క్రమపద్ధతిలో పేర్చుకుని కథని అర్ధం చేసుకోవడానికి మాత్రం మెదడుకి శ్రమ కల్గించాల్సిందే.
సింపుల్ గా చెప్పాలంటే ఇది విజయ్ సేతుపతి పాత్ర చెత్తడబ్బాని అడ్డు పెట్టుకుని తనకి జరిగిన అన్యాయానికి కారణమైన క్రిమినల్ ముఠాని ట్రాప్ చేసేందుకు పన్నిన పథకం. పోలీసుల సాయంతో ట్రాప్ చేసి పట్టుకున్నాక, అసలేం జరిగిందనేది అప్పుడు పొరలు పొరలుగా వీడిపోయే కథ. అంటే ఎండ్ సస్పెన్స్ అని నేరుగా తెలియకుండా ఎండ్ సస్పెన్స్ కథ నడపడం. ‘టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ (1955) అనే హాలీవుడ్ మూవీ ఈ తరహా కథా సంవిధానానికి బాట వేసింది. అయితే చివర్లో విప్పాల్సిన ప్రశ్నలు ఎక్కువ వుండకూడదు. వుంటే తికమక, వాటితో మెదడుకి శ్రమా పెరిగిపోతాయి.
అయితే ప్రతీ వారం సస్పెన్స్ థ్రిల్లర్స్ పేరిట సినిమాలు వచ్చేసి క్రాఫ్ట్ తెలియక అపహాస్యమవుతున్న వేళ ‘మహారాజా’ ఒక మెచ్చదగ్గ ప్రయత్నమే. దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ మేధో పరంగా స్క్రిప్టు మీద చాలా వర్క్ చేశాడు.
ఫస్టాఫ్ విజయ్ సేతుపతి పాత్ర పరిచయం, చెత్తబుట్ట కోసం పోలీసుల దర్యాప్తు, పోలీస్ స్టేషన్ లో సేతుపతి పడే అవమానాలు, మరో రెండు వేరే పాత్రలతో వేరే సంఘటనలు, తర్వాత ఈ సంఘటనల్లో సేతుపతి పాత్ర కూడా వున్నట్టు ఫ్లాష్ బ్యాక్ లో రివీలవడం, ఆ పాత్రలతో యాక్షన్ సీను వగైరా వుంటాయి.
సెకండాఫ్ లో అనురాగ్ కశ్యప్ క్రిమినల్ పాత్ర కార్యకలాపాలతో కథలో కొత్త సంఘటనలు ప్రారంభమవుతాయి. చెత్తడబ్బా కోసం పోలీసుల వేట సాగుతూనే వుంటుంది. అనురాగ్ కశ్యప్ క్రిమినల్ అని తెలియని సేతుపతితో దృశ్యాలు వస్తాయి. చివరికి పోలీసులు నకిలీ చెత్తడబ్బా తయారు చేసి, దాని దొంగగా ఒకడ్ని చూపించేసరికి వాడితో సేతుపతి కూతురికి ముడిపెట్టి భయంకర రహస్యాలు వెల్లడవడం మొదలవుతాయి... ఇవి షాకింగ్ గా వుంటాయి. ఇంతా చేసి ఇది రెండుంపావు గంటల్లో ముగిసిపోయే కథ.
నటనలు- సాంకేతికాలు
తన 50వ సినిమాగా గుర్తుండిపోయే పాత్ర నటించాడు విజయ్ సేతుపతి. గిరి గీసుకోకుండా ఎలాటి పాత్రనైనా నటించే సేతుపతి కమల్ హాసన్ బాటలో నడుస్తున్నట్టు అని పిస్తాడు. ఈ సినిమాలో ప్రతీ సీనూ అతడికి సవాలే. ఫస్టాఫ్ లో పోలీసులు తనతో ఎలా ప్రవర్తించినా, కొట్టినా బానిసలా పడుండే నటనని అత్యున్నతంగా కనబరుస్తాడు. అతడి విజృంభణ అంతా క్లయిమాక్సులోనే. రాక్షసుడవుతాడు. అంతర్లీనంగా కూతురి సెంటిమెంటుతో భావోద్వేగాల్ని రగిలిస్తూ.
సమాజంలో కుటుంబం వున్న మంచివాడిగా కనిపిస్తూ ఘోర నేరాలు చేసే పాత్రలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా గుర్తుండే పాత్ర నటించాడు. చివరికి అతడి ఖాతాలో పడే శిక్ష ఘోరంగా వుంటుంది. మిగతా పోలీసుల పాత్రలు, దొంగల పాత్రలు నటించిన నటీనటులందరూ మంచి పనితనం కనబర్చారు. సాంకేతికంగా రియలిస్టికి మూవీ పోకడలతో వుంది. సంగీతం, ఛాయాగ్రహణం, యాక్షన్ సీన్లు, లొకేషన్లు, కాస్ట్యూమ్స్ వగైరా అన్నీ సహజంగా వుంటాయి.
ఇంతా చేసి దీన్ని కేవలం సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉద్రేకపర్చి వదిలేయలేదు. చెప్పకుండానే కర్మ సిద్ధాంతం చెప్పే కథతో వుంటుంది- నువ్వు యితరులకేం చేస్తావో అదే నీకూ తిరిగొస్తుందని!