'లైగర్' రివ్యూ!

రెండేళ్లుగా దేశమంతటా ప్రేక్షకులెంతగానో ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ 'లైగర్' మొత్తానికి ఈ రోజు విడుదలైంది. గత కొంత కాలంగా ప్రేక్షకుల్లో 'లైగర్' గురించే చర్చ. 'అర్జున్ రెడ్డి' తో సూపర్ ఫేమస్ అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు లైగర్ తో కొత్త జోన్ లోకి ప్రవేశించాడు.

Advertisement
Update:2022-08-25 15:17 IST

రచన - దర్శకత్వం : పూరీ జగన్నాధ్

తారాగణం : విజయ్ దేవరకొండ, అనన్యా పాండే, రమ్య కృష్ణ, అలీ, రోణీత్ రాయ్, విషు రెడ్డి, మార్కండ్ దేశ్ పాండే, మైక్ టైసన్

సంగీతం : సునీల్ కశ్యప్, తనీష్ బాగ్చీ, ఛాయాగ్రహణం : విష్ణు శర్మ

బ్యానర్స్ : ధర్మా ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్, ఏఏ ఫిల్మ్స్

నిర్మాతలు : కరణ్ జోహార్, పూరీ జగన్నాధ్, ఛార్మీ కౌర్, అపూర్వా మెహతా

విడుదల : 25 ఆగస్టు, 2022

రేటింగ్ : 2/5


రెండేళ్లుగా దేశమంతటా ప్రేక్షకులెంతగానో ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ 'లైగర్' మొత్తానికి ఈ రోజు విడుదలైంది. గత కొంత కాలంగా ప్రేక్షకుల్లో 'లైగర్' గురించే చర్చ. 'అర్జున్ రెడ్డి' తో సూపర్ ఫేమస్ అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు లైగర్ తో కొత్త జోన్ లోకి ప్రవేశించాడు. పానిండియా జోన్. ప్రమోషన్స్ లోనే నార్త్ లో అసంఖ్యాక ఫ్యాన్స్ ని సంపాదించుకుని బాలీవుడ్ నే ఆశ్చర్య పర్చాడు. ఇలాంటి విజయ్ పూర్తిగా గల్లీ మాస్ క్యారక్టర్ తో పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో బిగ్ బ్యాంగ్ ఇచ్చేందుకు కిక్ బాక్సర్ గా విచ్చేశాడు హీరోయిన్ అనన్యా పాండేతో కలిసి. ప్రేక్షకులకి బోనస్ గా వరల్డ్ ఛాంపియన్ మైక్ టైసన్ ని కూడా తారాగణంలో భాగంగా ఇచ్చారు. తెలుగులో తొలి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మూవీగా నమోదు చేశారు. అయితే ఇంతా చేసి ఇది ఫ్లాప్ అయితే ఏమిటి పరిస్థితి అని కూడా పూరీ సహా నిర్మాతలే అనుకోవడం కొసమెరుపు. ఈ అనుమానం ఎందుకొచ్చినట్టు? మూవీని అంత తేడాగా తీశారా? తీస్తే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పానిండియా కలలేమవుతాయి? భవిష్యత్తు ఏమవుతుంది? ముందుగా కథలోకి వెళ్ళి చూద్దాం...

కథ

సింహానికీ, పులికీ పుట్టిన క్రాస్ బ్రీడ్ గా చెప్పుకునే కరీంనగర్ కి చెందిన లైగర్ (విజయ్ దేవరకొండ) ముంబాయిలో చాయ్ అమ్ముకునే త‌న తల్లి బాలామణి (రమ్యకృష్ణ) తో వుంటాడు. తనకి నత్తి వుండడం వల్ల అవమానాలు పడుతుంటాడు. బాలామణి భర్త ఫైటర్ గా ఛాంపియన్ కావాలన్న కలలు నెరవేరక ముందే చనిపోయాడు. అందుకని కొడుకుని మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) వరల్డ్ ఛాంపియన్ గా తీర్చిదిద్దాలని తీసుకుని ముంబాయి వచ్చింది. ఇక్కడొక ట్రైనర్ (రోణీత్ రాయ్) దగ్గర ట్రైనింగ్ కి చేర్పించింది. అయితే లక్ష్యం నెరవేరేవరకూ అమ్మాయిల జోలికి పోవద్దని షరతు పెట్టింది. కానీ తాన్యా (అనన్యా పాండే) అనే అమ్మాయి లైగర్ ఫైటింగ్ స్కిల్స్ ని చూసి వెంటపడి ప్రేమిస్తుంది. తనూ ప్రేమిస్తాడు. ఒకానొక ఘట్టంలో అతడికి నత్తి వుందని వదిలేస్తుంది. దీంతో ప్రేమలో దెబ్బతిన్న లైగర్ లక్ష్యం కూడా చిక్కుల్లో పడుతుంది.

ఇప్పుడేం చేశాడు లైగర్. తల్లికిచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? విఫల ప్రేమలోంచి కోలుకుని వరల్డ్ ఛాంపియన్ అయ్యాడా? తాన్యా ప్రేమని గెల్చుకున్నాడా? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

లైగర్ తన కథ చెప్పుకోవడం ప్రారంభిస్తూ, 'నాకు కథ చెప్పడం రాదు, ట్రై చేస్తాను' అంటాడు. అన్నట్టే అతడికి కథ చెప్పడం రాలేదు. ఏం కథ చెప్పాడో తెలీదు. కథ ఎందుకు బాగాలేదో చెప్పేందుకు పూరీ ఇలా లైగర్ మీదికి తోసేస్తున్నట్టుంది. మాటలే సరిగా పలకలేని నత్తిగల వాడు కథ ఎలా చెప్తాడు? విచిత్రం కదూ? నత్తి పాత్రతో కథ చెప్పించడం? అడుగడుగునా ఇలాగే వుంటుంది పూరీ సమయస్ఫూర్తి.

ఇది పూరీ తీసిన అనేక సినిమాల్లోలాగా అదే పురాతన కథ. ఆయన కథల్ని మార్చడు, స్టార్స్ ని మారుస్తాడు. అవే టెంప్లెట్ కథలు, అవే టెంప్లెట్ పాత్రలు. పైగా స్పోర్ట్స్ డ్రామా అంటేనే అరిగిపోయిన, అందరికీ తెలిసిన కథే అయిపోయింది. ఒక సగటు హీరో స్పోర్ట్స్ లో మెడల్ కొట్టాలని ట్రైనింగు పొందడం, ట్రైనర్ చేతిలో టార్చర్ పడడం, మధ్యలో ప్రేమ గురించో, ఇంకా దేని గురించో దెబ్బ తినడం, అందులోంచి కోలుకుని స్ట్రగుల్ చేసి మెడల్ కొట్టడం. ఇదే టెంప్లెట్ లో స్పోర్ట్స్ జానర్ సినిమా కథలుంటున్నాయి. లైగర్ కూడా ఇంతే. అయితే ఈ మాత్రం కథ కూడా అర్ధవంతంగా చెప్పలేకపోయారు. ప్రేమ కథ లో గానీ, స్ప్పోర్ట్స్ ట్రాకులోగానీ ఏమాత్రం ఎమోషన్స్ లేకుండా చప్పగా సాగడం ఒకటి, ఆకస్మికంగా ముగియడం ఒకటి.

పానిండియా సినిమా అన్నప్పుడు, పూరీ తన దగ్గర నిల్వ వుండే మూస తెలుగు కథ వర్కౌట్ అవుతుందని ఎలా అనుకున్నారో మరి. ముందుగా అనుమానించినట్టే అట్టర్ ఫ్లాపయ్యింది!

నటనలు - సాంకేతికాలు

విజయ్ లేకపోతే ఈ సినిమా లేదు. విజయ్ కోసం చూడాలనుకుంటే చూడాలి తప్ప, కథ కోసం కాదు. అయితే విజయ్ పాత్రకి నత్తి చాలా అడ్డంకి అయింది. ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని హుషారుగా ఎంటర్ టైన్ చేయాల్సిన తను- నత్తి వల్ల డైలాగులు కూడా ఎంజాయ్ చేయలేని పరిస్థితి తెచ్చాడు. కాబట్టి పవర్‌ఫుల్ మాస్ డైలాగులు, పంచ్ డైలాగులూ ఆశించకూడదు.

ఫైటర్ గా మాత్రం పూర్తి మేకోవర్ తో- సిక్స్ ప్యాక్ తో నిజంగా పులిలాగే వుంటాడు. ఎంఎంఏ రింగ్ లో ప్రత్యర్డుల్ని విరగ్గొట్టే సీన్లు టాప్. సినిమా కోసం తన ఎనర్జీ ఎంత పెట్టి చేయాలో అంతా చేశాడు. దేశమంతా తిరుగుతూ ప్రమోషన్స్ కి కూడా అంతే కష్టపడ్డాడు. కానీ ఇందులో పదో వంతు కూడా కథ విషయంలో, పాత్ర విషయంలో పూరీ కష్ట పడలేదు. ఇదీ సమస్య.

హీరోయిన్ అనన్యది పాత మూస ఫార్ములా పాత్ర, ప్రేమ. అయితే ఆమె హావభావాలు బాగా ఒలికించగలదు. ఈ సినిమాతోనైనా తను గాడిలో పడుతుందేమో చూడాలి. ఇక తల్లిగా రమ్యకృష్ణ మాస్ పాత్ర కొంచెం ఓవర్ గానే వుంటుంది అరుపులతో, కొడుకుని కంట్రోల్ చేయాలన్న పెద్ద‌రికంతో. అలీ ఫస్టాఫ్ లో ఒక సీన్లో కామెడీగా క‌నిపించి సెకండాఫ్ లో హీరోకి హెల్ప్ చేయడానికొస్తాడు. చంకీ పాండే లాస్ వెగాస్ లో హీరోయిన్ తండ్రిగా వుంటాడు. ట్రైనర్ గా రోణీత్ రాయ్ ఒక్కడే అర్ధవంతంగా కనిపిస్తాడు.

ఇక ఎంతో ప్రచారం చేసిన వరల్డ్ ఛాంపియన్ మైక్ టైసన్ అతిథి పాత్ర... ముగింపులో వచ్చి కథనే ఆకస్మికంగా ముగించేస్తాడు. టైసన్ తో విజయ్ ఫైట్ సీను టైసన్ అభిమానులకి బాధ కలిగిస్తుందేమో తెలియదు. చాలా ప్రయత్నం చేసిన మీదట టైసన్ నటించడానికి ఒప్పుకున్నట్టు సమాచారం.

పాటల గురించి చెప్పుకోవడానికి లేదు. పాటలు హిట్ కాలేదు. ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి. కెమెరా, ఎడిటింగ్, కోరియోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ, లొకేషన్స్ అన్నీ హైక్లాస్ గా వున్నాయి - ఒక్క పూరీ చేతిలో స్క్రిప్టు తప్ప!

చివరికేమిటి

ఫస్టాఫ్ విజయ్ ట్రైనింగు, హీరోయిన్ తో ప్రేమ, మదర్ తో ఫ్యామిలీ సీన్లూ ఇవే వుంటాయి ఓ మూడు పాటలతో. మధ్య‌ మధ్య వీధి పోరాటాలతో. ఇంటర్వెల్లో విజయ్ కి నత్తి అని తెలిసి హీరోయిన్ దూరమవుతుంది. ప్రేమ కథే బలహీనమంటే, ఈ ఇంటర్వెల్ మలుపు మరీ వీక్. ఇక్కడే ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి చెందారు. ఇక సెకండాఫ్ మరీ దారుణం. నేషనల్ ఛాంపియన్ గెలవడం, ఆపైన వరల్డ్ ఛాంపియన్ కెళ్లడం తగిన విషయం, స్ట్రగుల్, ఎమోషన్స్ లేకుండా ఫ్లాట్ గా సాగిపోతాయి. ఇక పూరీ సినిమాల్లో అలవాటుగా వుండే హీరోయిన్ కిడ్నాప్ ఒకటి. పోనూ పోనూ దిగజారి పోతూ వుంటుంది ఈ పానిండియా ప్రయత్నం. ఇంకేం లేక సడెన్ గా శుభం పడుతుంది.

కనీసం కథకి కావాల్సిన ఒక విలన్, ఒక కాన్‌ఫ్లిక్ట్ లేకపోవడం, ప్రేమ కూడా లవర్స్ నడుపుకునే రొమాంటిక్ కామెడీ గాక, పెద్దల చేతిలో నడిచే రొమాంటిక్ డ్రామా కావడం బాక్సాఫీసు అప్పీల్ కి గండి కొట్టాయి. రెండు దశాబ్దాల అనుభవంతో పూరీ జగన్నాథ్ ఇంత బలహీన సినిమా ఎలా తీస్తారో అర్ధంగాని విషయం!

Tags:    
Advertisement

Similar News