Vidya Vasula Aham Review: విద్య- వాసుల అహం –ఓటీటీ రివ్యూ! {2/5}

Vidya Vasula Aham Movie Review: ఆహా నుంచి ఓటీటీలో పెళ్ళి కథతో మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా నటించింది. రాహుల్ విజయ్ హీరో. మణికాంత్ దర్శకుడు. తెలంగాణాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతబడిన సమయంలో ఇంట్లో చూసుకోవడానికి ఈ పెళ్ళి కథ ఎలా వుందో చూద్దాం..

Advertisement
Update:2024-05-18 12:15 IST

చిత్రం: విద్య- వాసుల అహం

రచన -దర్శకత్వం : మణికాంత్ గెల్లి

తారాగణం : రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్ తదితరులు

సంగీతం : కళ్యాణీ మాలిక్, ఛాయాగ్రహణం : ఆఖిల్ వల్లూరి

నిర్మాతలు : నవ్య, రంజిత్ కుమార్, చందన

విడుదల : మే 17, 2024 (ఆహా ఓటీటీ)

రేటింగ్: 2/5

ఆహా నుంచి ఓటీటీలో పెళ్ళి కథతో మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా నటించింది. రాహుల్ విజయ్ హీరో. మణికాంత్ దర్శకుడు. తెలంగాణాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతబడిన సమయంలో ఇంట్లో చూసుకోవడానికి ఈ పెళ్ళి కథ ఎలా వుందో చూద్దాం...

కథ

సాఫ్ట్ వేర్ లో పనిచేసే విద్య (శివానీ రాజశేఖర్) ఇంట్లో పెళ్ళి వొత్తిడిని దాట వేస్తూ వుంటుంది. నచ్చిన వాడు దొరకడం కష్టమని చెబుతుంది. మెకానికల్ ఇంజనీరుగా చిన్న ఉద్యోగం చేసే వాసు (రాహుల్ విజయ్) కూడా ఇదే అభిప్రాయంతో పెళ్ళిని వాయిదా వేస్తూ వుంటాడు. ఇద్దరూ అపరిచితులుగా ఒక చోట ఓ ప్రవచనం విన్నప్పుడు పెళ్ళికి అంగీకారం తెలుపుతారు. అయితే విద్య ఒక షరతు పెడుతుంది. సంబంధాల కోసం చూస్తున్న అబ్బాయిలకి ఒక ప్రశ్నా పత్రం పంపి అందులో కరెక్టుగా సమాధానాలిచ్చిన వాడితో పెళ్ళి చూపులకి ఒప్పుకుంటానంటుంది.

అలా వాసుకి ఒక ప్రశ్నాపత్రం చేరుతుంది. అతనిచ్చిన సమాధానాలు నచ్చి పెళ్ళి చూపులకి ఒప్పుకుంటుంది. పెళ్ళిచూపుల్లో ప్రత్యక్షంగా మాట్లాడుకున్నాక పెళ్ళికి ఒప్పుకుంటుంది. పెళ్ళి చేసుకున్నాక మరొక లిస్టు ఇచ్చి వాటికి ఒప్పుకోవాలంటుంది. ఒప్పుకున్న తర్వాత గతంలో తనని ఏక పక్షంగా ప్రేమించిన వాడి గురించి చెబుతుంది. దీంతో అతడి ఇగో దెబ్బ తింటుంది, దాంతో ఆమె ఇగో కూడా దెబ్బ తింటుంది. ఒకే ఇంట్లో ఇద్దరూ ఎడమొహం పెడ మొహంగా వుంటారు. ఇప్పుడు వీళ్ళ ఇగోల సమస్య ఎలా తీరింది? ఎలా తిరిగి దగ్గరయ్యారు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

సమకాలీన సమస్యతో డైనమిక్ కథ కాదు. ఏ నాటిదో పాత పెళ్ళి కథ. కథలోసరైన సంఘర్షణ కూడా లేదు. సంఘర్షణ కాని సంఘర్షణగా చూపించిన పాయింటుకి చెప్పిన కారణం ఆమెని కన్నింగ్ క్యారక్టర్ గా తయారు చేసింది. ఒకసారి పెళ్ళి చూపులకి ముందే ప్రశ్నాపత్రంతో పరీక్షపెట్టి ఒప్పుకున్నప్పుడు, మొదటి రాత్రి ఇంకో ప్రశ్నాపత్రం తీయడమేమిటి? అతను ఆమెని నాలుగు దులుపుళ్ళు దులపక సంతకం పెట్టి ఇవ్వడమేమిటి? ఆమె తనని ఏక పక్షంగా ప్రేమించిన వాడి గురించి పెళ్ళి చూపులప్పుడే చెప్పేయక, మొదటి రాత్రి చెప్పడమేమిటి? ఆమె క్రిమినల్ మెంటాలిటీకి అతను గుడ్ బై కొట్టేయక ఇంకా ఆ ఇంట్లో వుండడమేమిటి? అతడి జాబ్ పోయాక ఆమె మీద ఆధారపడి బ్రతకడమేమిటి? చివరికి అతను స్టార్ట్ అప్ బిజినెస్ పెట్టుకునే ఆలోచనతో వున్నాడని తెలుసుకుని, అందుకు ఆమె చెక్కు ఇస్తే తీసుకుని ఈ కథకి ముగింపు పలకడమేమిటి? ఆ చెక్కు ఆమె పాత ప్రేమ నుంచి అతడి దృష్టి మళ్ళించడానికి తాయిలంలా ఇస్తున్నట్టు అన్పించలేదా? ఇన్నిసార్లు తనతో ఆడుకుంటూ వుంటే బకరాలా అతను బిహేవ్ చేయడమేమిటి? కథకి, పాత్రలకి ఏమైనా అర్ధం పర్ధం వున్నాయా?

దర్శకుడు ఆమె పాత్రకి అలాటి యాంగిల్స్ ఉద్దేశించి వుండక పోవచ్చు. కానీ ఆలోచన లేకుండా కథ రాసి పడేస్తే అలాగే కన్నింగ్ క్యారక్టర్ గానే తేలింది ఆమె పాత్ర. చెవిలో పువ్వులు పెట్టినట్టుగానే తయారైంది అతడి పాత్ర. విద్యకి అహం లేదు, వాసుకీ అహం లేదు- వున్నదల్లా వాసుతో విద్య ఆడుకున్న క్రిమినల్ గేమే ఈ కథ!

ఈ కథతో దర్శకత్వం కూడా సినిమా తీసినట్టుగా లేదు. టీవీ సీరియల్ కంటే దిగదుడుపుగా వుంది. నిలబడి, కూర్చుని పాత్రలు మాట్లాడుకోవడమే వుంది. మాటలతోనే కథ సాగుతూంటుంది, సంఘటనలతో కాదు. దృశ్యాల్లో చలనం వుండదు. కాబట్టి ఈ సినిమా విజువల్స్ మూసేసి ఆడియో వింటే రేడియో నాటికలా చక్కగా అర్ధమైపోతుంది.

ఇక హీరోహీరోయిన్ల పేరెంట్స్ పాత్రలు కథకి అనవసర బరువు. చేసేదేమీ వుండదు. కొత్త కాపురం చూడడానికి నల్గురూ వచ్చేస్తారు. వచ్చేసి ఎప్పుడు చూసినా సోఫాల్లో కూర్చునే వుంటారు. కొత్త కాపురంలో పరిస్థితిని గ్రహించరు. ఎక్కడైనా వియ్యాపురాళ్ళు ఇద్దరూ ఇలా వస్తే ఇంట్లో ఎమున్నాయీ ఏం లేవూ తరచి చూసి సలహాలిస్తారు. కొత్త కాపురం మరింత ఎలివేట్ అవడానికి సూత్రాలు చెప్తారు. లేదా ఒకావిడ ఎన్టీఆర్- భానుమతిల ‘వివాహబంధం’ లో సూర్యకాంతంలా వుంటే, కూతురి కాపురంలో ఇన్వాల్వ్ అయి నిప్పుల కుంపటి పెడుతుంది. ఇలా వుంటాయి జీవితాలు. దర్శకుడు ఈ జీవితాల్ని, డ్రామానీ చూపించే ప్రయత్నమే చేయలేదు. పొడిపొడిగా పైపైనా ఏదో చూపించేసి సరిపెట్టాడు. చివరికా పేరెంట్స్ కి కొత్త కాపురంలో ఇగోల సమస్య తెలియకుండానే ముగిసిపోతుంది కథ. అందుకే ఇవి అనవసర పాత్రలు.

నటనలు –సాంకేతికాలు

శివానీ రాజశేఖర్ నటన ఒక్కటే ఈ సినిమాకి ఆకర్షణ. పాత్ర ఎలా వున్నా నటనలో ఈసారి ఇంప్రూవ్ అయింది. కథలో సంఘర్షణ, కోపతాపాలు వంటివి లేకపోవడంతో సన్నివేశాల్ని సున్నితంగా, అనుభవశాలిలా నటించి ఓకే అన్పించుకుంది. కానీ హీరో రాహుల్ విజయ్ మొహంలో భావాలు పలికే ప్రశ్నే లేదు. తను వున్న సన్నివేశాలకి ప్రాణం పోసే నటనే లేదు.

సాంకేతికంగా చెప్పుకోదగ్గదిగా లేదు. 90 శాతం ఇండోర్స్ దృశ్యాలే వున్నాయి. ఇవీ చలనం లేకుండా స్తబ్దుగా ,వుండే దృశ్యాలు. ఎక్కడా లేచి పరుగెట్టవు. పడుకునే వుంటాయి. కళ్యాణీ మాలిక్ సంగీతం కూడా ఇంతే బలహీనం.

సమకాలీన సమస్యలతో పెళ్ళికథ తీయకుండా, పాత బడిన ఫార్ములా కథనే, పాత్రల్ని ఇలా తయారు చేసి చాదస్తంగా తీస్తే, యూత్ కెలా కనెక్ట్ అవుతుందన్నది ప్రశ్న!


Full View


Tags:    
Advertisement

Similar News