Tillu Square Review: టిల్లు స్క్వేర్ రివ్యూ! {2.75/5}

Tillu Square Review: ఇలా ‘డిజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ ల తర్వాత ‘టిల్లు క్యూబ్’ అని గనుక తీస్తే, కాస్త కథ ఆధారిత క్యారక్టరైజేషన్ తో తీస్తే, విధేయులైన టిల్లు ఫ్యాన్స్ కి మేలు చేసిన వాళ్ళవుతారు.

Advertisement
Update:2024-03-29 14:57 IST

చిత్రం: టిల్లు స్క్వేర్

దర్శకత్వం : మల్లిక్ రామ్

తారాగణం : సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్, నేహా శెట్టి, మురళీ శర్మ, మురళీధర్ గౌడ్, ప్రిన్స్, బ్రహ్మాజీ తదితరులు

సంగీతం : రామ్ మిరియాల, అచ్చు రాజమణి, భీమ్స్ సిసిరోలియో; ఛాయాగ్రహణం : సాయి ప్రకాష్

బ్యానర్ : సితార ఎంటర్ టైమెంట్స్

నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య

విడుదల : మార్చి 29, 2024

రేటింగ్: 2.75/5

‘డీజే టిల్లు’ (2022) తో సిద్దూ జొన్నలగడ్డగా గాక క్యారక్టర్ గా గుర్తుండిపోయిన సిద్దూ జొన్నలగడ్డ, మళ్ళీ అదే క్యారక్టర్ తో ‘టిల్లు స్క్వేర్’ గా తిరిగొచ్చాడు. తనకి పేరు తెచ్చిపెట్టిన అదే వింత క్యారక్టర్ తో మరోసారి అలా ఎంటర్ టైన్ చేయడమే ధ్యేయంగా పెట్టుకుని, దర్శకుడ్ని మార్చి, చాలావరకూ తానే దర్శకత్వం వహించి, తనకోసం తన సినిమా అనుకుని తీసుకున్నాడు. సాధారణంగా సీక్వెల్స్ ఆకట్టుకోవు. మరి తను దీంతో సాహసించి సీక్వెల్ సిండ్రోమ్ ని దాటాడా? దీన్ని అంతే హిట్ గా ‘డీజీ టిల్లు’ సరసన నిలబెట్టాడా? ఏం చేశాడు? ఇది తెలుసుకుందాం...

కథ

‘డిజే టిల్లు’ లో రాధిక (నేహాశెట్టి) విషయంలో దెబ్బతిన్న బాలగంగాధర్ తిలక్ అలియాస్ టిల్లు (సిద్ధూ జొన్నలగడ్డ), ఇప్పుడు ఈవెంట్స్ మేనేజిమెంట్స్ చేస్తూంటాడు. అలా ఓ పార్టీలో లిల్లీ జోసెఫ్ (అనుపమా పరమేశ్వరన్) పరిచయమవుతుంది. కలిసి తిరుగుతారు, ఒకటవుతారు. ఆ తర్వాత చూస్తే ఆమె వుండదు, లెటర్ పెట్టేసి పోతుంది. ఆమెని వెతకడం మొదలుపెడతాడు. నెల తర్వాత కనిపించి ప్రెగ్నెంట్ నయ్యానని చెబుతుంది. పెళ్ళి చేసుకుంటానంటాడు. సరీగ్గా టిల్లు బర్త్ డే రోజు తన ఇంటికి పిలుస్తుంది. అక్కడికి వెళితే అది రాధిక ఫ్లాట్. ‘డీజే టిల్లు’ లో సరీగ్గా టిల్లు బర్త్ డే రోజు రోహిత్ (కిరీటి దామరాజు) ఎక్కడైతే చనిపోయాడో అదే ఫ్లాట్. రోహిత్ లిల్లీకి అన్న. వాడి శవాన్ని తనే పాతిపెట్టాడు టిల్లు.

ఇప్పుడు తన అన్న సంవత్సరం నుంచి కనిపించడం లేదని, అతడిని వెతకడంలో సాయం చేయమనీ కోరుతుంది లిల్లీ. రోహిత్ మర్డర్ విషయంలో ఒకసారి రాధికతో దెబ్బతిన్న టిల్లు ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు? టిల్లూ లిల్లీల మధ్యకి పేరు మోసిన డాన్ షేక్ మహెబూబ్ (మురళీ శర్మ) ఎందుకొచ్చాడు? ఇప్పుడేమైంది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది ‘డీజే టిల్లు’ కి కొనసాగింపు కథ. ‘డీజే టిల్లు’ లో హత్యకి గురైన రోహిత్ చెల్లెలు లిల్లీతో టిల్లూ అనుభవాల కథ. మళ్ళీ ఇది కూడా కథ కంటే కొన్ని కామెడీ ఎపిసోడ్స్ తో నడిచే టిల్లు ఒన్ మాన్ షో. ‘డీజీ టిల్లు’ ఏ క్యారక్టరజేషన్ తో, ఏ టైపు డైలాగ్ డెలివరీతో హిట్టయ్యిందో దాన్నే ప్రధానంగా చేసి, కథ మీద దృష్టి పెట్టకుండా నడిపిన కాలక్షేప బఠానీ. కాబట్టి క్యారక్టర్ ని ఎంజాయ్ చేయడానికే చూడాలి తప్ప కథ కోసం వెళ్ళకూడదు.

‘డీజీ టిల్లు’ లో కూడా కథ మీద దృష్టి లేదు. ఈసారి అదే ఫార్ములా ఫాలో కావడం వల్ల అనాలోచితంగా వాడిన ట్విస్టులు, ఇల్లాజికల్ సీన్లూ- ఇవే కాకుండా రిపీటయ్యే సీన్లు, చీటికీ మాటికీ ‘డీజే టిల్లు’ నుంచి రిఫరెన్సులూ- వీటితో నింపేశారు. ఈ కథ కూడా మొదటి కథ లాగే అమ్మాయి వలలో చిక్కుకుని దెబ్బ తినే అమాయక టిల్లు కథే. అయితే ఈ సారి లిల్లీ అనే అమ్మాయితో కుదరలేదు. దీంతో ఏం జరుగుతుందన్న సస్పెన్స్, థ్రిల్స్ కరువయ్యాయి. అలాగే క్లయిమాక్స్ కూడా తేలిపోయింది. నిడివి రెండు గంటలే అయినా చివరి అరగంట నుంచీ సహన పరీక్షగా మారుతుంది.

ఈ సినిమా చాలా భాగం రీ షూట్ ఇందుకే చేసినట్టున్నారు. రీ షూట్ వల్ల బాగు పడింది లేదు. కథ వదిలేసి కేవలం టిల్లు క్యారక్టరైజేషన్ తో, అతడి వన్ లైనర్స్ తో, కామెడీ టైమింగ్ తో ఒన్ మాన్ షోగా నడిపేశారు. కథ మీద పెట్టని దృష్టి అతడి వన్ లైనర్ డైలాగుల మీద పెట్టి క్యారక్టర్ ని మాత్రం ఎంజాయ్ చేసేలా చేశారు.

ఫస్టాఫ్ అతడి కుటుంబం గురించి, వృత్తి గురించి, లిల్లీతో రోమాన్స్ గురించీ ఫన్నీగా నడిపేశాక, ఒక బలహీన ఇంటర్వెల్ సీనుతో ముగించారు. ఇక సెకండాఫ్ మాఫియా డాన్ ని పట్టుకునే యాక్షన్ కథగా చేసి, కామెడీ తగ్గించి, డైలాగులతో నవ్వించడం చేశారు. డాన్ ని పట్టుకునే విషయంలో లాజిక్ నీ, సాధ్యాసాధ్యాల్నీ పట్టించుకోకుండా కథ ముగించారు. ‘డిజేటిల్లు’ ప్రేక్షకులకి కొత్త కాబట్టి ఆ ఫార్మూలాతో క్యారక్టర్ని ఎంజాయ్ చేసి హిట్ చేశారు. మళ్ళీ అదే ఫార్ములాతో అలాగే ఎంజాయ్ చేసేందుకు ఇది తెలిసిన క్యారక్టరే. దీనికి వున్న కథనే సరైన విధంగా చెప్పివుంటే క్యారక్టర్ ఇంకా రాణించేది.

నటనలు –సాంకేతికాలు

సిద్ధూ జొన్నలగడ్డ కిది కొత్త సినిమానే అయినా క్యారక్టర్ అదే. ఆ నటననే రిపీట్ చేయడం సమస్య కాదు. సినిమా సాంతం గ్యాప్ లేకుండా వన్ లైనర్లు విసరడం, తను నవ్వకుండా నవ్వించడం, ఆ విచిత్ర మేకప్, కాస్ట్యూమ్స్, మ్యానరిజమ్స్, ఎక్స్ ప్రెషన్స్, వీటికి తోడు మ్యూజిక్, డాన్సులు, కెమెరావర్క్, ఇంకోవైపు హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ గ్లామ్ షో, ఇవన్నీ అతడ్ని యూత్ ఆరాధించగల షో మాన్ గా చేశాయి.

ఈ సినిమాకి పాపులర్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ని తీసుకోవడం అదనపు ఆకర్షణగా మారింది. పాత్ర కన్విన్సింగ్ గా వుండదు. కేవలం గ్లామ్ షోకీ, లిప్ లాక్స్ కీ, కావలసినంత యూత్ అప్పీల్ కీ పనికొచ్చింది.

సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చే నేహా శెట్టికి మంచి రెస్పాన్సే. అయితే ఆమెది అతిధి పాత్రే. ఆమె వరకు ఎపిసోడ్ ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక డాన్ గా మురళీ శర్మ, టిల్లు తండ్రిగా మురళీధర్ గౌడ్ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రిన్స్ నటించిన పాత్ర కంగాళీగా వుంటుంది.

రామ్ మిరియాల, అచ్చు రాజమణి, భీమ్స్ సిసిరోలియోల సంగీతం, మూడు పాటలు , వాటి చిత్రీకరణ హైలైట్ గా వుంటాయి. సాయి ప్రకాష్ ఛాయాగ్రహణం, సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మాణ విలువలు బలంగా వున్నాయి.

ఇలా ‘డిజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ ల తర్వాత ‘టిల్లు క్యూబ్’ అని గనుక తీస్తే, కాస్త కథ ఆధారిత క్యారక్టరైజేషన్ తో తీస్తే, విధేయులైన టిల్లు ఫ్యాన్స్ కి మేలు చేసిన వాళ్ళవుతారు.

Tags:    
Advertisement

Similar News