Manamey Movie Review: మనమే- మూవీ రివ్యూ! {2/5}

Manamey Movie Review: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ గత ఏడు సినిమాలతో హిట్లు లేక ఒక హిట్ కోసం గట్టి ప్రయత్నం చేస్తూ ‘మనమే’ అనే ఫ్యామిలీ డ్రామాతో వచ్చాడు.

Advertisement
Update:2024-06-07 15:35 IST

చిత్రం: మనమే

రచన- దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య

తారాగణం : శర్వానంద్, కృతీశెట్టి, సీరత్ కపూర్, మాస్టర్ విక్రమ్ ఆదిత్య, రాహుల్ రవీంద్రన్, శివ కందూరి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు

సంగీతం : హెషమ్ అబ్దుల్ వహాబ్, ఛాయాగ్రహణం : విష్ణుశర్మ, జ్ఞానశేఖర్

బ్యానర్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ

నిర్మాతలు : టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల

విడుదల : జూన్ 7, 2024

రేటింగ్: 2/5

ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ గత ఏడు సినిమాలతో హిట్లు లేక ఒక హిట్ కోసం గట్టి ప్రయత్నం చేస్తూ ‘మనమే’ అనే ఫ్యామిలీ డ్రామాతో వచ్చాడు. ‘ఉప్పెన’ తో తెలుగులో పాపులరైన హీరోయిన్ కృతీ శెట్టి ఆ తర్వాత ‘శ్యామ్ సింఘరాయ్’ తప్ప తెలుగులో నటించిన అయిదు సినిమాలూ హిట్ కాక ఒక్క తెలుగు హిట్ కోసం తిరిగి అడుగుపెట్టింది. మొదటి సినిమా ‘భలే మంచి రోజు’ తర్వాత మూడు సినిమాలూ హిట్ కాక ఒక హిట్ కోసం స్ట్రగుల్ చేస్తూ తిరిగి వచ్చాడు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఇలా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఈ ముగ్గురూ ‘మనమే’ అంటూ తెలుగు ప్రేక్షకుల ఆశీర్వాదం కోసం వచ్చారు. ఇది కూడా హిట్ కాకపోతే కారణం మనమే అని చెప్పుకోవడానికి వీలుగా అన్నట్టు టైటిల్ పెట్టారు. మరి ఈ ముగ్గురి రిపోర్టు కార్డు ఎలా వుంది? చూద్దాం...

కథ

విక్రమ్(శర్వానంద్) లండన్ లో అమ్మాయిల్ని అల్లరి పెడుతూ ప్లే బాయ్ లా గడిపేస్తూంటాడు. అతడికో ఫ్రెండ్ అనురాగ్ (త్రిగుణ్) వుంటాడు. అనురాగ్ అతడి భార్య శాంతి త (మౌనిక) ఇండియాకి వెళ్ళి ఓ యాక్సిడెంట్ లో చనిపోవడంతో వాళ్ళ కొడుకు ఖుషీ (విక్రమ్ ఆదిత్య) అనాథ అవుతాడు. శాంతి లవ్ మ్యారేజీ చేసుకుందని దూరం పెట్టిన ఆమె పేరెంట్స్ ఖుషీని పెంచుకోవడానికి నిరాకరిస్తారు. దీంతో శాంతి ఫ్రెండ్ సుభద్ర (కృతీ శెట్టి) ఖుషీని పెంచుకోడానికి ముందుకొస్తుంది. అయితే ఇంగ్లాండ్ లో పుట్టిన ఖుషీకి అక్కడి చట్టాలు వరిస్తాయి. చట్ట ప్రకారం కనీసం నాలుగు నెలలు ఎవరైనా కేర్ టేకర్స్ ఖుషీని పేరెంట్స్ లా చూసుకోవాలి, లేదా ఇంగ్లాండ్ ప్రభుత్వం అనాధాశ్రమానికి అప్పజెప్తుంది.

దీంతో విక్రమ్, సుభద్రతో కలిసి లండన్ లో ఖుషీని చూసుకోడానికి సిద్ధమవుతాడు. ఇటు సుభద్రకి కార్తీక్ తో(శివ కందుకూరి) నిశ్చితార్థం జరిగి వుంటుంది. ఈ నేపథ్యంలో విక్రమ్, సుభద్ర ఖుషీని ఎలా చూసుకున్నారు? ఈ క్రమంలో తలెత్తిన సమస్యలేమిటి? ఖుషీ వల్ల విక్రమ్ జీవితంలో ఎలాటి మార్పు వచ్చింది? సుభద్ర విక్రమ్ తో వుండడానికి కార్తీక్ ఒప్పుకున్నాడా? చనిపోయిన విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్ బిజినెస్ పార్ట్నర్ తో వచ్చిన కష్టాలేమిటి? విక్రమ్, సుభద్రల మధ్య ప్రేమ ఎలా పుట్టింది, పుడితే ఆ ప్రేమ ఏమయ్యింది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఈ కథ మార్పు చేర్పులతో హాలీవుడ్ ‘లైఫ్ యాజ్ వి నో ఇట్’ (2010) కథలా వుంది. అయితే హాలీవుడ్ కథ పెళ్ళికాని ఇద్దరు యువతీ యువకుల మధ్య పెంపకానికి ఆడపిల్ల (తెలుగులో పిల్లాడు) వస్తే ఏం జరుగుతుందనే పాయింటుతో వుంటుంది. ఈ పాయింటుని డ్రైవ్ చేస్తూ దాని పరిణామాల్ని, పర్యవసానాల్నీ చిత్రించే సన్నివేశాలతో కూడుకుని ఒక ట్రాకులో రెండు గంటల కామెడీ కథ వుంటుంది. కానీ తెలుగులో రెండున్నర గంటలు సాగదీసినా ఏ పాయింటుతో కథ నడుస్తోందో చెప్పలేకపోయాడు దర్శకుడు. సెకండాఫ్ వచ్చేసరికి ఎందుకిలా కన్ఫ్యూజై పోతారు దర్శకులు? ఇది హిట్టవ్వాలంటే మనమే అని ఫ్లాపుల్లో వున్న హీరోయిన్లు, దర్శకుడు ఇప్పుడైనా కలిసి కూర్చుని పద్ధతిగా ఆలోచించలేదా? లండన్లో శర్వానంద్ పాత్ర ఎలా అవారాగా వుందో అలా అవారాగా, అనాధగా మారిపోయింది కథ!

పాయింటు మీద నిలబడితే ఈ పాయింటు లోంచి పుడుతూ వుండే భావోద్వేగాలతో కథకి బలం వస్తుంది. పాయింటునే గుర్తించకపోవడంతో భావోద్వేగాలే లేకుండా చప్పగా మారింది కథ. దర్శకుడు చేసిన ఇంకో పొరపాటు ఏమిటంటే, మొదటి ఇరవై నిమిషాల్లో పిల్లాడిని చేపట్టాల్సిన పాయింటుకి వచ్చేయడం. ఇంత త్వరగా పాయింటుని ఏర్పాటు చేసిన సినిమాల్ని రెండున్నర గంటల కథ చేయలేక చేతులెత్తేసిన సినిమాలు చాలా వున్నాయి. అందుకని 45 నిమిషాలకో, లేదా ఇంటర్వెల్లోనో పాయింటుని ఎస్టాబ్లిష్ చేసి, కథ చెప్పే సమయాన్ని తగ్గించుకుని సేఫ్ అవుతున్నారు కొంత మంది.

దర్శకుడు ఇది కూడా గుర్తించకుండా హాలీవుడ్ స్ట్రక్చర్ ప్రకారం మొదటి అరగంట లోపు పాయింటుని ఎస్టాబ్లిష్ చేయడంతో, అసలా ఎస్టాబ్లిష్ చేసిన పాయింటుతోనే కథ నడపాలని గుర్తించకపోవడంతో, ఆ తర్వాత పావుగంటకే ఫస్టాఫ్ లో కథ కుప్పకూలడం ప్రారంభమైంది.

పిల్లాడి పెంపకం గురించి శర్వానంద్ ఎన్ని కామెడీలు చేసినా అది పైపైనే వుండిపోయింది తప్ప, ఎక్కడా ఒక ఫీల్ గుడ్ మూవీలా హృదయపూర్వకంగా నవ్వించలేదు. సినిమా దారి సినిమాదే, ప్రేక్షకుల దారి ప్రేక్షకులదే. ఎక్కడా కనెక్షన్ లేదు, విలన్ పాత్రలో రాహుల్ రవీంద్రన్ కామెడీలు సహా. కృతీశెట్టికి వేరే నిశ్చితార్ధం పెట్టడం వల్ల కూడా ఉపయోగమేమీ లేదు. చివరికి శర్వానంద్, కృతీ ఒకటవుతారని వూహించేదే. పై హాలీవుడ్ సినిమా మూస ఫార్ములా కథే. అయితే అందులో పాయింటు చుట్టూ కథ వుంటుంది. చివరికి ముగింపుకూడా 2010 దానికి ముందు వచ్చిన సినిమాల్లో లాంటి మూస ముగింపే. ఈ ముగింపైనా తెలుగులో మార్చలేదు. ఇంకా ఇదే వర్కౌట్ అవుతుందనుకున్నారు.

సెకండాఫ్ పూర్తిగా దారి తప్పింది. ఏవో సన్నివేశాలు వస్తూంటాయి, పోతూంటాయి. ఏం జరుగుతోందో అర్ధంగాక సహన పరీక్షగా మారుతుంది. మధ్యమధ్యలో వెన్నెల కిషోర్ వచ్చి నవ్వించి పోవడమే బావుంది. రెండున్నర గంటలు చక్కర్లు కొట్టిన కథ చివరికి పిల్లాడి విషయంలో శర్వానంద్, కృతీ తీసుకునే నిర్ణయంతో ఓ ఫార్ములా మలుపు తీసుకుని ముగుస్తుంది.

నటనలు- సాంకేతికాలు

శర్వానంద్ యాక్టివ్ నటన, జోకులు, పాత్ర తీరు, కాస్ట్యూమ్స్ ఇవిమాత్రం బాగా వర్కౌటయ్యాయి. అయితే వీటితో ఎంతసేపు రంజింప జేయగలడు. కృతీ శెట్టి పాత్ర, నటన, శర్వానంద్ తో రోమాన్స్ ఈసారి బాగా కుదిరాయి. కానీ సెకండ్ హీరోయిన్ గా సీరత్ కపూర్ పాత్ర వృధా. అలాగే రాహుల్ రవీంద్రన్ విలన్ పాత్రలో, నటనలో బలం లేదు. వెన్నెల కిషోర్, రామకృష్ణలు కామెడీ పాత్రల్లో నవ్వించే పని మాత్రం లోటులేకుండా చూసుకున్నారు.

సందర్భానుసారం వచ్చిపోయే పాటలు 16 వున్నాయి. సినిమాలో విషయం లేనప్పుడు ఇన్ని పాటలెందుకో. హేషమ్ సంగీతంలో రెండు పాటలు మాత్రం బావున్నాయి. విష్ణుశర్మ, జ్ఞానశేఖర్ ల ఛాయాగ్రహణం విదేశీ లొకేషన్స్ వల్ల రిచ్ గా వుంది. విజువాల్స్ కోసం భారీగా ఖర్చు పెట్టారు. ఈ భారీ తనంతో సినిమాలో విషయం కూడా తూగి వుండాల్సింది. మొత్తానికి ముగ్గురూ మనమే అంటూ ఇలా చేశారు.


Full View


Tags:    
Advertisement

Similar News