Saripodhaa Sanivaaram Movie Review: సరిపోదా శనివారం మూవీ రివ్యూ {2.75/5}

Saripodhaa Sanivaaram Movie Review: నాని మరోసారి యాక్షన్ జానర్ టచ్ చేశాడు. 'సరిపోదా శనివారం' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

Advertisement
Update: 2024-08-29 14:57 GMT

చిత్రం: సరిపోదా శనివారం

తారాగణం: నాని, ప్రియాంక అరుళ్ మోహన్, ఎస్. జె. సూర్య, సాయికుమార్, శుభలేఖ సుధాకర్, మురళిశర్మ, అభిరామి, అదితి బాలన్, అజయ్ తదితరులు

సంగీతం: జేక్స్ బిజోయ్

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

నిర్మాత: డి వి వి దానయ్య

దర్శకత్వం: వివేక్ ఆత్రేయ

విడుదల తేదీ: 29 ఆగస్టు 2024

రేటింగ్: 2.75/5

నాని మరోసారి యాక్షన్ జానర్ టచ్ చేశాడు. 'సరిపోదా శనివారం' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. పైగా వివేక్ ఆత్రేయకు మరోసారి ఛాన్స్ ఇచ్చాడు. మరి ఈసారి నాని సినిమా ఫలితం ఏంటి?

ఇన్‌స్పెక్టర్ దయా (ఎస్ జే సూర్య) సోకులపాలెంలో ఒక పోలీసు అధికారి. అతడికి ముక్కు మీద కోపం. ఎవరిపైనైనా ముందు కోపం చూపిస్తాడు, ఆ తర్వాత మాట్లాడతాడు. అతడి సోదరుడు రాజకీయ సోదరుడు కూర్మానంద్ (మురళీ శర్మ)కు దయాకు పడదు. మరోవైపు దయా ఉండే పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా జాయిన్ అవుతుంది చారులత (ప్రియాంక మోహన్).

ఓవైపు ఈ లైన్ ఇలా నడుస్తుండగా.. మరోవైపు సూర్య (నాని) పాలసీ ఏజెంట్ గా కనిపిస్తాడు. తండ్రి సాయికుమార్ తో కలిసి ఉంటాడు. ఇతడికి కూడా చాలా కోపం. ప్రతి రోజూ ఎవరితో ఒకరితో గొడవపడతాడు. అయితే చనిపోయిన తల్లికి (అభిరామి) సూర్య మాటిస్తాడు. కేవలం శనివారం మాత్రమే కోపాన్ని బయటపెడతాడు.

వారానికి ఒక్క రోజు మాత్రమే కోపం ప్రదర్శించే సూర్య ఓవైపు.. ప్రతి రోజూ కోపంతో రగిలిపోయే దయా మరోవైపు.. వీళ్లిద్దరూ ఎలా కలుస్తారు. దయాను సూర్య ఎందుకు ఎదిరించాల్సి వస్తుంది.. మధ్యలో సోకులపాలెం ప్రజలు ఎలా నలిగిపోయారు అనేది ఈ సినిమా స్టోరీ.

చూడ్డానికి ఇదేదో డిఫరెంట్ స్టోరీ అనుకుంటే పొరపాటే. హీరోవిలన్ మధ్య యాక్షన్ తో నడిచే పక్కా కమర్షియల్ సినిమా. కాకపోతే హీరోకు కేవలం శనివారం మాత్రమే కోపం వస్తుందనేది కాస్త కొత్త పాయింట్. ఈ పాయింట్ చుట్టూ దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు రాసుకున్నాడు. అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఇదొక పక్కా కమర్షియల్ సినిమా కావడంతో, కథలో డెప్త్ లోపించింది. హీరోకు కోపం తీసుకొచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకోవు.

మరీ ముఖ్యంగా హీరోకు వారానికి ఒకరోజు మాత్రమే కోపాన్ని ప్రదర్శించే లక్షణం పెట్టడంతో హీరోయిజం తగ్గిపోయింది. నాని పాత్ర ఎక్కడికక్కడ డౌన్ అవుతుంది. అదే టైమ్ లో దయా పాత్ర రెచ్చిపోతుంది. దీంతో ఒక టైమ్ లో నాని కంటే ఎస్ జే సూర్య డామినేషనే సినిమాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఫీలింగ్ సెకెండాఫ్ లో మరీ ఎక్కువగా అనిపిస్తుంది.

ఈసారి యాక్షన్ సినిమాకు ఎమోషన్ జోడించాలని దర్శకుడు భావించాడు. సినిమాలో ఓ 30శాతం యాక్షన్ ఉంటే, మిగతా భాగాన్ని ఎమోషనల్ గా నడిపించాలనుకున్నాడు. అది కూడా అక్కడక్కడ తేడా కొట్టింది. రొటీన్ కథకు తనదైన టచ్ ఇవ్వాలని దర్శకుడు భావించినప్పటికీ ప్రతి చోటా అది మెరవలేదు. స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల వావ్ అనిపిస్తే, మరికొన్ని చోట్ల ఊహించినట్టే సాగుతుంది.

దీనికితోడు సినిమా నిడివి మరో మైనస్. ఫక్తు కమర్షియల్ సినిమాను ఎంత షార్ప్ గా చెబితే అంత మంచిది. కానీ వివేక్ ఆత్రేయ ఎమోషనల్ డ్రామా కూడా యాడ్ చేయడంతో ఈ సినిమా నిడివి దాదాపు 3 గంటలకు చేరుకుంది. అయినప్పటికీ అక్కడక్కడ ట్రిమ్ చేయొచ్చు. కానీ ఎడిటర్ కు హీరో-దర్శకుడు ఆ అవకాశం ఇచ్చినట్టు లేదు. క్లయిమాక్స్ పూర్తవ్వడానికి ముందే సినిమా అయిపోయింది, ఇక ఇంటికెళ్లిపోవచ్చనే ఫీలింగ్ కు ప్రేక్షకుడు వచ్చేస్తాడు. మొదటి రోజే ఓ సినిమాకు ఇలాంటి ఫీలింగ్ రావడం మంచిది కాదు.

ఇవన్నీ పక్కనపెడితే.. సినిమాను వివేక్ ఆత్రేయ చక్కగా మొదలుపెట్టాడు. ఇంటర్వెల్ టైమ్ కు ఎక్కడ ల్యాండ్ చేయాలో అలానే చేశాడు. ప్రీ-క్లయిమాక్స్ ను చక్కగా సెట్ చేశాడు. ఇలాంటి సినిమాలకు క్లయిమాక్స్ ఊహించిందే కాబట్టి అక్కడ దర్శకుడి మార్క్ కనిపించదు. కాస్త లెంగ్త్ తగ్గించి ఉంటే సినిమా మరింత ఎంగేజింగ్ గా ఉండేది.

నటీనటుల పరంగా చూసుకుంటే ముందుగా విలన్ ఎస్ జే సూర్య గురించే మాట్లాడుకోవాలి. తన పాత్రను ఆద్యంతం రక్తికట్టించాడు ఎస్ జే సూర్య. దయా పాత్రలో ఒదిగిపోయాడు. అతడి లుక్, మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ, ప్రీ-క్లయిమాక్స్ లో చూపించిన హావభావాలు అద్భుతం. నాని ఫ్యాన్స్ హర్ట్ అవుతారేమో కానీ, ఎస్ జే సూర్య కోసం ఈ సినిమాను కచ్చితంగా ఓసారి చూడొచ్చు.

ఇక నాని ఎప్పట్లానే సెటిల్ గా పెర్ఫార్మ్ చేశాడు. అతడి కోపాన్ని ఒక్క రోజుకే పరిమితం చేయడంతో, అతడి నటన కూడా పరిమితంగానే సాగింది. హీరోయిన్ ప్రియాంక మోహన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. అభిరామి, శుభలేఖ సుధాకర్, మురళీశర్మ, శివాజీ రాజా తమ పాత్రలకు న్యాయం చేశారు.

జేక్స్ బిజాయ్ అందించిన పాటలు బాగా లేవు. నేపథ్య సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ బాగున్నాయి. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

యాక్షన్ జానర్ లోనే ఇదొక డిఫరెంట్ ప్రయత్నమని ప్రచారంలో చెబుతూనే ఉన్నాడు నాని. కానీ ప్రేక్షకుడు మాత్రం ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఆశించాడు. ఆ విషయంలో సరిపోదా శనివారం సినిమా ప్రేక్షకుడికి సరిపోదు. పోనీ.. ఎమోషనల్ జర్నీ ఉంటుందా అంటే అది కూడా అక్కడక్కడ ఆగిపోతుంది. ఓవరాల్ గా నిడివి పట్టించుకోకుండా, ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా ఈ సినిమా చూస్తే నచ్చుతుంది. ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఎస్ జే సూర్య కోసం కచ్చితంగా ఈ సినిమాను చూడాలి.

బాటమ్ లైన్ - అంతగా సరిపోలేదు

Tags:    
Advertisement

Similar News