Premalu Movie Review: ప్రేమలు- మూవీ రివ్యూ {2.75/5}
Premalu Movie Review: మలయాళంలో పెద్ద హిట్టయిన ‘ప్రేమలు’ తెలుగులో విడుదలైంది. తెలుగు వారికి పూర్తిగా కొత్త అయిన నటీనటులు ఇందులో నటించారు.
చిత్రం: ప్రేమలు
రచన- దర్శకత్వం: గిరీష్ ఎ. డి.
తారాగణం : నస్లెన్ గఫూర్, మమితా బైజు, మాథ్యూ థామస్, శ్యామ్ మోహన్, సంగీత్ ప్రతాప్ తదితరులు
సంగీతం : విష్ణు విజయ్, ఛాయాగ్రహణం : అజ్మల్ సాబు
బ్యానర్ : భావనా స్టూడియోస్, ఫార్స్ ఫిల్మ్ కో
నిర్మాతలు : ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్
రేటింగ్: 2.75/5
మలయాళంలో పెద్ద హిట్టయిన ‘ప్రేమలు’ తెలుగులో విడుదలైంది. తెలుగు వారికి పూర్తిగా కొత్త అయిన నటీనటులు ఇందులో నటించారు. మలయాళం సినిమాలు తెలుగులో థియేటర్స్ లో విడుదల అవడం చాలా అరుదు. రీమేకులే ఎక్కువ. అలాటిది నేరుగా మలయాళం డబ్బింగ్ తెలుగు బయ్యర్స్ ని ఆకర్షించడానికి - ఇది యూత్ రోమాంటిక్ కామెడీ కావడం, సినిమా కేవలం 3 కోట్ల బడ్జెట్ కి మలయాళంలో 100 కోట్లు వసూలు చేయడం, హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకోవడం మొదలైనవి ప్రధాన కారణాలు. ఇవెలా పని చేశాయో తెలుసుకుందాం...
కథ
సచిన్ (నెస్లన్ గఫూర్) కేరళలో గ్రాడ్యుయేషన్ చేస్తూ ఒకమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆ ఫ్రేమని వెల్లడించలేక పోతాడు. గ్రాడ్యుయేషన్ చివరి రోజుల్లో వెల్లడించేసరికి తను ఒకరికి కమిట్ అయ్యానని చెప్పేస్తుంది. దీంతో దెబ్బతిని హయ్యర్ స్టడీస్ కి యూకే వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తాడు. కానీ వీసా రిజెక్ట్ అవుతుంది. ఆరు నెలల తర్వాత అప్లై చేసుకోవడానికి ఇంకో అవకాశం లభిస్తుంది. దీంతో ఫ్రెండ్ అమూల్ (సంగీత్ ప్రతాప్) సలహా మేరకు ఈ ఆరునెలల్లో గేట్ కోచింగ్ తీసుకోవడానికి అతడితో పాటు హైదరాబాద్ వస్తాడు.
కోచింగ్ సెంటర్ అతడి పెళ్ళికి ఒక వూరికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన రీనూ (మమితా బైజూ) ని చూసి ఫ్రేమలో పడతాడు. రీనూ హైదరాబాద్ లో ఐటీ జాబ్ చేస్తూంటుంది. ఆది (శ్యామ్ మోహన్) అనే సీనియర్ ఆమెని ప్రేమిస్తూంటాడు. హైదరాబాద్ తిరిగి వచ్చాక సచిన్, అమూల్ సాయంతో రీనూ ఫ్రెండ్ ని కదిపి చూస్తాడు. రీనూ రేపటి గురించి లక్ష్యం లేని నిన్ను చేసుకోదని, యూకే వెళ్తానని గేట్ చేస్తున్నావని, ఆ గేట్ కూడా మానేసి ఫుడ్ కోర్ట్ లో పని చేస్తున్నావనీ, ఆమె ఇలా కాదు – రాబోయే 30 ఏళ్ళకి ఇప్పుడే ప్లాన్ చేసుకుందని, ఆమెకి తగిన ఆదిని ప్రేమిస్తోందనీ, నీలాటి మెచ్యూరిటీ లేని వాడ్ని కాదనీ - మొహం మీద చెప్పేస్తుంది ఫ్రెండ్. ఇప్పుడు రెండో సారి దెబ్బతిన్న సచిన్ ఏ నిర్ణయం తీసుకున్నాడనేది మిగతా కథ, ఇంతే.
ఎలావుంది కథ
తెలుగు ప్రేక్షకులు తెలుగులో బాగా చూసి చూసి -ఇక ఇలాటి సినిమాలు రావడం కూడా మానేసిన పాత మూస కథ. అప్పట్లో లైటర్ వీన్ రోమాంటిక్ కామెడీలని వచ్చేవి. ఆ జాతికి చెందిన కథ. అబ్బాయి అమ్మాయిని ప్రేమించడం, ఆమె ఇంకొకర్ని ప్రేమించడం, ఈ లవ్ ట్రయాంగిల్ లో స్వల్ప సమస్య ఎలా సాల్వ్ అయిందనే పాయింటుతో యూత్ సినిమా. పెద్దగా కథ లేకపోయినా, ఇందులో వున్న ఆకర్షణ ఏమిటంటే, టీనేజీ ఇన్నోసెన్స్. టీనేజి పాత్రలకి ఆ ఏజీ గ్రూపులో లేతగా కన్పించే అమ్మాయిలూ అబ్బాయిలే కలర్ఫుల్ గా, కొత్తగా కనిపించడం. విజువల్ అప్పీల్ ని కల్పించడం. ఇలాటి మన తెలుగు సినిమాల్లోనైతే మీసాలు గడ్డాలతో పాతికేళ్ళకి తగ్గని ముదురు ఫేసులతో, అసహజ పాత్రలూ నటనలతో, టీనేజీ రోమ్ కామ్ పేర సినిమాలొచ్చేసేవి. వీటి నుంచి విముక్తి ఈ సినిమా.
రెండుంపావు గంటలు బోరు కొట్టకుండా, అక్కడక్కడా నవ్విస్తూ, ముగింపు సహా ఏం జరుగుతుందో ముందే తెలిసినా, అప్రయత్నంగా తెరమీద కన్పించే కలర్ఫుల్ సహజ టీనేజి లోకంలో లీనమై ఎంజాయ్ చేయొచ్చు. మలయాళం సినిమాలు సహజత్వానికి దగ్గరగా వుంటాయి కాబట్టి ఆ నిజ జీవిత పాత్రలూ, సంఘటనలూ వుంటాయి. ఇది తెలుగు ప్రేక్షకులకి కొత్త. ఇది తెలుసుకుని తెలుగు మేకర్లు ఇలాటివి తీస్తే గొప్ప.
కాకపోతే హైదరాబాదులో కథ పేరుతో నేటివిటీకి గండి కొట్టారు. ఓ నాలుగైదు హైదరాబాద్ లొకేషన్లు తప్ప ఏమీ వుండదు. ఇండోర్స్ లో షూటింగు అంతా కేరళలోనే జరిపేశారు. హైదరాబాద్ నుంచి తెలుగు వాడి పెళ్ళికి, తెలుగు గ్రామానికి వెళ్ళడం కూడా ఇంతే. అది తెలుగు గ్రామం కాదు, కేరళ గ్రామం. అతను తెలుగు నటుడు కూడా కాదు, మలయాళీ. పెళ్ళిలో అందరూ మలయాళీలే. తెలుగు పెళ్ళిలా కూడా వుండదు. ఒక్కరంటే ఒక్క తెలుగు నటి, నటుదూ వుండరు సినిమా సాంతం తెలుగు ప్రాంతపు కథలో. ఆ గ్రామం నుంచి హైదరాబాదుకి కారు ప్రయాణంలో కనిపించేవి కూడా తెలుగు రోడ్లు, తెలుగు వూళ్ళు కాదు!
ఇలా హైదరాబాద్ లో తీసిన సినిమా అని పబ్లిసిటీ చేసి తప్పుదోవ పట్టించారు. ఈ ఒక్క ఫిర్యాదు తప్పితే కాలక్షేపానికి లోటిం లేదు. రైల్వే స్టేషన్లో లేదా విమానాశ్రయంలో ప్రేమ కథలు ఒకప్పుడు ఎలా ముగిసేవో ఇది కూడా అంత పాత మూసగా ముగుస్తుంది. సచిన్- రీనూల మధ్య ప్రేమకి అడ్డంకి ఎలా తొలిగిందనే క్లయిమాక్స్ సన్నివేశం, రీనూని ప్రేమిస్తున్న ఆది విలనీతో అంత పాతగానూ వుంటుంది. ఇలా తీసి కూడా వంద కోట్లు వసూలు చేసుకోవచ్చన్న దర్శకుడి ఆత్మవిశ్వాసమే మతి పోగొట్టేలా వుంది. మూడుకి 33 రెట్లు సక్సెస్.
నటనలు- సాంకేతికాలు
టీనేజర్ నెస్లన్ గఫూర్ అమాయక టీనేజి పాత్రకి సరిపోయాడు హావ భావాలు సహా. సహజ పాత్ర, సహజ నటన కామెడీతో కలిపి. ప్రేమకథలో సమస్యలున్నా ఎక్కడా సీరియస్ గా వుండదు. ప్రేమలో ఏడ్పులూ బాధలూ లేకుండా, కొత్తగా అనిపిస్తుంది ఇలాటి సినిమాలు చూసేవాళ్ళకి. హీరోయిన్ మమితా బైజూ హీరోలా కాకుండా నిలకడగా వుండే పాత్రకి తగ్గట్టు నటన కనబర్చింది. హీరో ఫ్రెండ్ గా సంగీత్ ప్రతాప్ డి కొంటె పాత్ర. ఆదిగా శ్యామ్ మోహన్ విలనీకి తగ్గట్టే వున్నాడు.
కానీ ఈ టీనేజీ రోమాన్స్ మ్యూజికల్ గా లేకపోవడం పెద్ద లోపం. పాటలు ఏ మాత్రం ఎంజాయ్ చేసేట్టు వుండవు. పాటలున్నట్టు కూడా అన్పించవు. పెళ్ళిలో పాట అయితే అపస్వరాలుగా వుంటుంది. లోబడ్జెట్ కి సంగీత దర్శకుడు మంచి పాటలివ్వకూడdనేం వుండదు. కానీ ఇలా ఇచ్చాడు. దర్శకుడు తీసుకున్నాడు.
విజువల్స్ టీనేజీ ప్రపంచానికి తగ్గట్టు కూల్ గా వున్నాయి. ఇతర సాంకేతిక విలువలు, సెట్టింగులు బడ్జెట్ లోటు అన్పించేలా లేవు. దేశవ్యాప్తంగా మంచి రివ్యూలు సంపాదించుకున్న ఈ టీనేజీలోకి జర్నీ, మలయాళ సినిమా ప్రపంచంలో మైలు రాయిగా గుర్తుంటుంది.