Phalana Abbayi Phalana Ammayi Review: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మూవీ రివ్యూ {2/5}

Phalana Abbayi Phalana Ammayi Movie Review: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మూవీ థియాటర్స్ లోకి వచ్చింది. మూవీ రివ్యూ చూద్దాం

Advertisement
Update:2023-03-17 15:04 IST

Phalana Abbayi Phalana Ammayi Review: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మూవీ రివ్యూ

నటీనటులు - నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య తదితరులు.

నిర్మాతలు - టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ,దర్శకుడు - శ్రీనివాస్ అవసరాల

డీవోపీ - సునీల్ కుమార్ నామ

సంగీతం - కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్ (కాఫీఫై సాంగ్)

లిరిక్స్ - భాస్కరభట్ల, లక్ష్మి భూపాల, కిట్టు విస్సాప్రగడ

ఎడిటర్ - కిరణ్ గంటి

నిడివి - 2 గంటల 9 నిమిషాలు

సెన్సార్ - యు/ఏ

రిలీజ్ డేట్ - మార్చి 17, 2023

రేటింగ్ - 2/5


కొన్ని పాయింట్లు పేపర్ పై రాసుకునేటప్పుడు చాలా బాగుంటాయి. ఎగ్జిక్యూషన్ కు వచ్చేసరికి పాత సినిమాల్ని గుర్తుకుతెస్తాయి. ఈరోజు రిలీజైన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా కూడా అలానే ఉంది. దర్శకుడు ఒక పాయింట్ అనుకున్నాడు. దాని చుట్టూ సన్నివేశాలు రాసుకున్నాడు. తీరా తెరకెక్కించే టైమ్ కు అది తొలిప్రేమ, థాంక్యూ, ఎటో వెళ్లిపోయింది మనసు, మై ఆటోగ్రాఫ్, ఖుషి లాంటి చాలా సినిమాల్ని గుర్తుకుతెస్తుంది. 


కాబట్టి ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే సినిమా కొత్తగా అనిపించదు. ఈ విషయం మేకర్స్ కూడా తెలుసు. అలాంటప్పుడు స్క్రీన్ ప్లేతో మేజిక్ చేయాలి, ఎమోషనల్ గా కట్టిపడేయాలి, మంచి పాటలతో మైమరిపింపజేయాలి. కానీ వీటిలో ఏ ఒక్క ప్రయత్నం జరగలేదు. దర్శకుడు కమ్ స్క్రీన్ ప్లే రైటర్ అవసరాల శ్రీనివాస్.. తను పోషించిన ఏ పాత్రకు పూర్తి న్యాయం చేయలేకపోయాడు. 


ముందుగా అవసరాల దర్శకుడిగా ఎక్కడ ఫెయిల్ అయ్యాడో మాట్లాడుకుందాం.. ఈ సినిమా కోసం నాగశౌర్య చాలా కష్టపడ్డాడు. పదేళ్ల జర్నీని తెరపై చూపించేందుకు తన బాడీని, బాడీ లాంగ్వేజ్ ను మార్చుకున్నాడు. అతడి కష్టం తెరపై కనిపించింది. హీరో అంత డెడికేషన్ తో ఉన్నప్పుడు, అతడి నుంచి మంచి అవుట్ పుట్ రాబట్టుకోవాల్సిన బాధ్యత దర్శకుడిది. కానీ అవసరాల మాత్రం తనకు అంత అవసరం లేదన్నట్టు వ్యవహరించాడు. మంచి భావోద్వేగం పండించాల్సిన టైమ్ లో కూడా హీరోను వాడుకోలేకపోయాడు. హీరోయిన్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఉన్నంతలో నీలిమ అనే పాత్ర ఎంటరైనప్పుడు దర్శకుడిగా, డైలాగ్ రైటర్ గా అవసరాల మెరిశాడు. 


ఇక స్క్రీన్ ప్లే పరంగా అవసరాల ఎక్కడ ఫెయిల్ అయ్యాడో చూద్దాం. ఈ సినిమాను ఛాప్టర్ల వైజ్ నడిపించాడు అవసరాల శ్రీనివాస్. ఈ ఎత్తుగడ తప్పుకాదు. ఎన్నో హాలీవుడ్ సినిమాలు, మరికొన్ని తెలుగు-హిందీ సినిమాలు ఇలానే వచ్చాయి. పైగా విడుదలకు ముందు అవసరాల కూడా ఈ విషయాన్ని చెప్పేశాడు, ప్రేక్షకుల్ని మెంటల్లీ ప్రిపేర్ చేశాడు. కానీ ఆ ఛాప్టర్లలో అవసరాల ఇరికించిన సన్నివేశాలు మాత్రం పెద్దగా మెప్పించవు. 


సినిమా ఎక్కడ మొదలైందో, ఇంటర్వెల్ టైమ్ కు అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ఏ సన్నివేశం మనసును తాకదు, ఏ డైలాగ్ హృదయాన్ని గుచ్చుకోదు. నిజానికి ఫస్టాఫ్ లో చాలా కథ చెప్పాడు దర్శకుడు. కానీ ఎందుకో కథ అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. సెకెండాఫ్ లో కూడా అదే పరిస్థితి. ప్రీ-క్లయిమాక్స్, క్లయిమాక్స్ ఉన్నంతలోనే బెటర్. 


స్క్రీన్ ప్లే పరంగా అవసరాల చేసిన మరో తప్పు, ఈ కథను పద్ధతి ప్రకారం చెప్పకపోవడం. కథలో ఆర్గానిక్ ఫ్లో లేదు. స్క్రీన్ ప్లే లో అక్కడక్కడ గందరగోళం కనిపిస్తుంది. కథను వెనక్కు-ముందుకు తీసుకెళ్లి చెప్పడం వల్ల ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయిపోయింది. ఇది కూడా ఓ ప్రధానమైన లోపం. 


ఉన్నంతలో ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే అది నాగశౌర్య-మాళవిక స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే. వీళ్లిద్దరూ చక్కగా చేశారు. వీళ్ల కెమిస్ట్రీ బాగా కుదిరింది. సినిమాలో ఎక్కువ భాగం వీళ్లిద్దరి చుట్టూనే తిరుగుతుంది కాబట్టి, ఆ మేరకు హీరోహీరోయిన్లు న్యాయం చేశారు. ఇక మరో కీలక పాత్ర పోషించిన మేఘా చౌదరి ఆకట్టుకుంది. ఆమె యాక్టింగ్ కూడా బాగుంది. గెస్ట్ రోల్ కంటే కాస్త ఎక్కువగా కనిపించిన అవసరాల, తన పాత్రకు న్యాయం చేశాడు. 


టెక్నికల్ గా సినిమా ఓకే అనిపిస్తుంది. కల్యాణి మాలిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నప్పటికీ పాటలు ఆకట్టుకోవు. కాఫీఫై సాంగ్ బాగుంది కానీ దానికి మ్యూజిక్ ఇతగాడు కాదు, ఆ క్రెడిట్ వివేక్ సాగర్ కు ఇవ్వాలి. సునీల్ కుమార్ నామ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 


ఓవరాల్ గా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాలో అవసరాల మార్క్ సున్నితమైన హాస్యం, డైలాగులు మిస్సయ్యాయి. సినిమాను డాక్యుమెంటరీగా చెప్పాలనే ప్రయత్నంలో బోల్తాపడ్డాడు ఈ దర్శకుడు. ఈ స్లో నెరేషన్ మూవీ కొంతమంది ప్రేక్షకుల్ని మాత్రమే ఆకట్టుకుంటుంది.

Tags:    
Advertisement

Similar News