Mr Bachchan Movie Review: మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ {2.5/5}
Mr Bachchan Movie Review: మిరపకాయ్ తర్వాత రవితేజ, హరీశ్ శంకర్ కాంబినేషన్ లో వచ్చింది మిస్టర్ బచ్చన్ మూవీ. సినిమా రివ్యూ..
చిత్రం: మిస్టర్ బచ్చన్
తారాగణం: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, తనికెళ్ల భరణి, గౌతమి, శరత్ ఖేదేకర్, సత్య, చమ్మక్ చంద్ర, ప్రభాస్ శీను తదితరులు
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
కెమెరా: అయనంక బోస్
సంగీతం: మిక్కీ జె మేయర్
నిర్మాత: టి జి విశ్వప్రసాద్
దర్శకత్వం: హరీష్ శంకర్
విడుదల: 15 ఆగస్ట్ 2024
రేటింగ్: 2.5/5
రవితేజ సాలిడ్ హిట్ కొట్టి చాన్నాళ్లయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ధమాకా చేసి హిట్ కొట్టాడు. మళ్లీ ఇన్నేళ్లకు అదే బ్యానర్ పై మిస్టర్ బచ్చన్ చేశాడు. మరి మళ్లీ హిట్ కొట్టాడా? మిస్టర్ బచ్చన్ ఎలా ఉంది?
ధైర్యం, నిజాయితీ ఉన్న ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్ బచ్చన్ (రవితేజ). అయితే ఈ యాటిట్యూడ్ ప్రతిసారి పనికిరాదు. ఓ పొగాకు వ్యాపారిపై ఐటీ దాడి చేస్తాడు బచ్చన్. అతడు చేసింది మంచి పనే అయినప్పటికీ, పై అధికారుల ఆగ్రహానికి గురవుతాడు. ఫలితంగా సస్పెండ్ అవుతాడు. దీంతో అన్నీ వదిలేసి తన ఊరు కోటిపల్లి వచ్చేస్తాడు.
స్వతహాగా సంగీత ప్రియుడైన బచ్చన్, తన ఫ్రెండ్స్ తో కలిసి కోటిపల్లిలో మ్యూజిక్ ఆర్కెస్ట్రా పెట్టుకుంటాడు. అదే టైమ్ లో జిక్కీ (భాగ్యశ్రీ బోర్సె)ని చూసి మనసు పారేసుకుంటాడు. ముందు జిక్కీ నో చెబుతుంది. కానీ తర్వాత బచ్చన్ మంచితనం చూసి ఓకే చెబుతుంది. అంతా రెడీ. ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకున్న టైమ్ లో, బచ్చన్ కు మళ్లీ పోస్టింగ్ వస్తుంది. ఈసారి ఎంపీ ముత్యం జగ్గయ్య (జగపతిబాబు) ఆస్తులపై దాడులు చేయమని ఆదేశిస్తారు.
మళ్లీ ఉద్యోగంలో చేరిన బచ్చన్, పెళ్లి టైమ్ కు వచ్చేస్తానని జిక్కీకి మాటిస్తాడు. ముత్యం జగ్గయ్యపై రెయిడ్ చేసిన బచ్చన్ కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అతడు రెయిడ్ పూర్తిచేసి విజయవంతంగా బయటకు వచ్చాడా లేదా? జిక్కీని పెళ్లాడ్డానికి అతడికి ఎదురైన ఆటంకాలేంటి? ఇది బ్యాలెన్స్ స్టోరీ.
దేశ చరిత్రలోనే ఆదాయపు పన్నుశాఖ చేసిన అతిపెద్ద ఐటీ దాడి ఆధారంగా తెరకెక్కిన రెయిడ్ అనే బాలీవుడ్ సినిమాకు రీమేక్ ఇది. కాకపోతే ఆ సినిమా సీరియస్ గా ఉంటుంది. పూర్తిగా కథకే పరిమితమై ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఆ కథకు కమర్షియల్ టచ్ ఇస్తూ, వినోదాన్ని జోడించి మిస్టర్ బచ్చన్ తీశాడు హరీశ్ శంకర్. కత్తి మీద సాములాంటి ఈ వ్యవహారంలో హరీశ్ సగమే పాసయ్యాడు.
సినిమా ప్రథమార్థం మొత్తం కథే కనిపించదు, మొత్తం వినోదమే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కమెడియన్ సత్య ఇరగదీశాడు. అతడి కామెడీ టైమింగ్ టోటల్ సినిమాకే హైలెట్. సందర్భం కాకపోయినా ఇక్కడో విషయం చెప్పుకోవాలి. రంగబలి అనే సినిమా ఫస్టాఫ్ మొత్తాన్ని ఎలాగైతే సత్య నిలబెట్టాడో, సరిగ్గా అదే ఫార్ములా మిస్టర్ బచ్చన్ లో కూడా వర్కవుట్ అయింది. అయితే సెకండాఫ్ కు వచ్చేసరికి జానర్ పూర్తిగా మారిపోతుంది. అదే కొందరికి నచ్చదు.
ఫస్టాఫ్ మొత్తం కలర్ ఫుల్ గా కనిపించిన సినిమా సెకండాఫ్ కు వచ్చేసరికి సీరియస్ గా మారిపోవడంతో పాటు, విలన్ ఇంటికే పరిమితమైపోతుంది. దీంతో కథ ముందుకు సాగుతున్న ఫీలింగ్ రాదు. దీనికితోడు విలన్ పాత్ర రాసుకున్న విధానం కూడా మెప్పించదు. ముందు చాలా సీరియస్ గా చూపిస్తారు. ఆ తర్వాత అతడ్ని కూడా సంగీత పిపాసకుడిగా మార్చేస్తారు. చివర్లో మరిన్ని మెలికలు పెడతారు. ప్రారంభంలో సీరియస్ గా కనిపించిన విలన్, హీరోను ఏమాత్రం ఇబ్బందిపెట్టలేకపోతాడు. విలన్ నుంచి పెద్దగా సవాళ్లు ఎదురుకానప్పుడు హీరోయిజం ఎలివేట్ అయ్యే అవకాశం ఉండదు.
పైగా ఒరిజినల్ మూవీని యథాతథంగా తీయకూడదని కంకణం కట్టుకున్నట్టు, సెకండాఫ్ లో కూడా టేకింగ్ ను మార్చేశారు. మరీ ముఖ్యంగా ఒరిజినల్ మూవీలో సెకెండాప్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాల్ని, ఈ రీమేక్ లో కూడా ఉంచాల్సింది. సినిమాకు ఆయువుపట్టు ఆ సీన్స్, వాటిని కూడా మార్చేయడం ఇబ్బంది అనిపిస్తుంది. ఒరిజినల్ చూడని వాళ్లకు ఆ తేడాలు కనిపించవు. బహుశా వాళ్లకు నచ్చే అవకాశం ఉంది.
అయితే ఏ సినిమాకైనా సెకెండాఫ్ కీలకం. ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకొచ్చేటప్పుడు వాడికి ద్వితీయార్థం, క్లయిమాక్స్ మాత్రమే ఎక్కువగా గుర్తుంటాయి. అవి బాగుంటే సినిమా ఆటోమేటిగ్గా పాసవుతుంది. మిస్టర్ బచ్చన్ లో అదే మిస్సయింది. ఫస్టాఫ్ హిట్టయినంతగా, సెకెండాఫ్ మెప్పించదు. దీనికితోడు సీట్లో కూర్చున్న ప్రేక్షకుడు ఎలా ఊహించుకుంటాడో కథ అలానే సాగుతుంది. ఇక కిక్ ఏముంటుంది? ఇవన్నీ ఒకెత్తయితే, ఈకాలం యూత్ కు ఇందులో పెట్టిన పాత పాటలు పెద్దగా నచ్చకపోవచ్చు. అడుగడుగునా పాటలు కనిపిస్తాయి.
ఇలాంటి మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ.. రవితేజ మరోసారి తన ఎనర్జీతో సినిమాను లాక్కొచ్చే ప్రయత్నం చేశాడు. కొన్ని చోట్లు దర్శకుడు సరైన సన్నివేశాలు రాసుకోనప్పటికీ, రవితేజ మేనరిజమ్స్ తో అవి నడిచిపోతాయి. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ, ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఆమె అందాలు ఆకట్టుకున్నాయి. అయితే నటన పరంగా ఆమె ఇంకా ఓనమాలు స్టేజ్ లోనే ఉంది. పట్టుబట్టి ఆమెతో డబ్బింగ్ చెప్పించే బదులు, సెట్స్ పైకి రాకముందు ఆమెకు కాస్త యాక్టింగ్ నేర్పించి ఉంటే బాగుండేది. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు, డిఫరెంట్ గా తీసిన యాక్షన్ సన్నివేశాలు క్లిక్ అయ్యాయి. సిద్ధు జొన్నలగడ్డ మెరుపు ఎంట్రీ అందర్నీ అలరిస్తుంది.
మిగతా పాత్రల గురించి చెప్పుకుంటే.. జగపతి బాబు గెటప్ కొత్తగా ఉన్నప్పటికీ, ఆయన పాత్ర రొటీన్ గా ఉంది. ముత్యం జగ్గయ్య పాత్రను పూర్తిగా కామెడీగా లేదా పూర్తిగా సీరియస్ గానైనా మలచాల్సింది. అటుఇటు కాకుండా చేయడంతో ఆ ప్రభావం హీరోయిజంపై పడింది. ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఈ సినిమాకు మరో సేవియర్ కమెడియన్ సత్య. ఫస్టాఫ్ మొత్తం ఇతడు నిలబెట్టాడు. తనికెళ్ల భరణి, గౌతమి, శరత్ ఖేడేకర్, శుభలేఖ సుధాకర్, అన్నపూర్ణ తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు.
రీమేక్స్ ను తనదైన శైలిలో తీయడంలో పండిపోయిన హరీశ్ శంకర్, మిస్టర్ బచ్చన్ కు కూడా తనదైన మేజిక్ ను జోడించే ప్రయత్నం చేశాడు. అయితే అసలు కథలో సీరియస్ నెస్ ను, తను చొప్పించాలనుకున్న వినోదాన్ని అతడు బ్యాలెన్స్ చేయలేకపోయాడు. దీంతో విడివిడిగా చూస్తే సన్నివేశాలు బాగుంటాయి కానీ.. స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే చాలా సీన్స్ అసందర్భంగా తోస్తాయి. హరీశ్ శంకర్ రాసుకున్న సన్నివేశల్ని పక్కనపెడితే.. టెక్నికల్ గా అతడికి మంచి సపోర్ట్ దొరికింది.
అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అదిరింది. సాంగ్స్, ఫైట్స్, సీన్స్ అనే తేడా లేకుండా ప్రతి ఫ్రేమ్ లో అతడు తన మేజిక్ చూపించాడు. లైటింగ్ వాడకంలో ఇతడిది ఓ విభిన్న శైలి అనే విషయం సినిమా చూస్తే అర్థమౌతుంది. పీసీ శ్రీరామ్ తర్వాత ఈ కోణంలో అయనంక బోస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవచ్చు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. ఇక ఉజ్వల్ కులకర్ణికి ఎడిటర్ గా పెద్దగా పని పెట్టలేదు ఈ సినిమా. ఇలాంటి ఫార్ములా సినిమాలకు ఆడుతూపాడుతూ ఎడిటింగ్ చేసేస్తాడు అతడు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎప్పట్లానే ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నిర్మించాడు. తన బ్యానర్ స్థాయికి తగ్గట్టు డబ్బు ఖర్చుపెట్టాడు.
ఓవరాల్ గా మిస్టర్ బచ్చన్ సినిమా ముక్కలు ముక్కలుగా చూస్తే బాగుంటుంది. మొత్తం కలిపి చూస్తే సహనానికి పరీక్ష పెడుతుంది. సినిమాలో అన్ని రసాలున్నాయి. కానీ హాస్య రసం తప్ప, మిగతా ఏ రసం రుచించదు.
బాటమ్ లైన్ - బచ్చన్.. సగం సగం నచ్చెన్