మాచర్ల నియోజకవర్గం మూవీ రివ్యూ

నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా థియేటర్లలోకి వచ్చింది. తెలుగు గ్లోబల్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ..

Advertisement
Update:2022-08-12 16:29 IST

నటీనటులు: నితిన్, కృతిశెట్టి, క్యాథరీన్, రాజేంద్ర ప్రసాద్, సముద్రఖని, వెన్నెల కిషోర్ తదితరులు

సంగీతం: మహతి స్వర సాగర్

సినిమాటోగ్రఫర్: ప్రసాద్ మూరెళ్ల

మాటలు: మామిడాల తిరుపతి

నిర్మాణం: శ్రేష్ట్ మూవీస్.

నిర్మాత: సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి

రచయిత, దర్శకుడు: రాజశేఖర్ రెడ్డి

రేటింగ్ : 2/5

హీరో, విలన్, ఓ ప్రేమకథ, మరో సమస్య.. కథలో హీరో, విలన్ ను కొట్టాలి. రెగ్యులర్ తెలుగు సినిమా ఫార్మాట్ ఇది. ఇంతోటి దానికి హీరోకు క్యారెక్టరైజేషన్ ఎందుకు? ఈమధ్య దర్శకులు ఇలానే ఆలోచిస్తున్నట్టున్నారు. మొన్నటికిమొన్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో రవితేజను డిప్యూటీ కలెక్టర్ గా చూపించి, ఫైట్లు చేయించారు. అతడు చేసే పనులకు, ఉద్యోగానికి అస్సలు సంబంధం ఉండదు. ఈరోజు రిలీజైన మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా అలానే ఉంది. హీరో కలెక్టర్, చేసేవి మాత్రం ఫైట్లు. విలన్ చావు, హీరో గెలుపు, శుభం కార్డు.

హీరో ఉన్నఫలంగా కలెక్టర్ అవుతాడు. గుంటూరు జిల్లాకు వస్తాడు. మాచర్ల నియోజకవర్గంలో 30 ఏళ్లుగా ఎన్నికలు జరగవు. విలన్ ఏకగ్రీవంగా ఎన్నికవుతూ ఉంటాడు. ఈసారి మాత్రం హీరో ఎన్నికలు జరిపిస్తాడు. విలన్ ను అంతమొందిస్తాడు. మాచర్ల నియోజకవర్గం కథ ఇంతే. చెప్పుకోడానికి ఇంది ఎంత సింపుల్ గా, రొటీన్ గా ఉందో, సినిమాలో సన్నివేశాలు, స్క్రీన్ ప్లే కూడా అంతే రొటీన్ గా ఉన్నాయి.

హీరోను కలెక్టర్ గా కాకుండా, యాక్షన్ హీరోగా దర్శకుడు పరిచయం చేసినప్పుడే ఇది ఏ టైపు సినిమా అనేది అర్థమైపోతుంది. ఇక హీరో (నితిన్)వెంట ఓ హీరోయిన్ (క్యాథరీన్) పడుతుంది. హీరో మాత్రం మరో హీరోయిన్ (కృతి శెట్టి) వెంట పడతాడు. ఓ రోజు చెప్పాపెట్టకుండా హీరోయిన్ తన స్వగ్రామమైన మాచర్లకు వెళ్లిపోతుంది. ఆమెను వెదుక్కుంటూ హీరో కూడా హైదరాబాద్ నుంచి బైక్ వేసుకొని మాచర్ల వెళ్తాడు. అక్కడ విలన్ తో ఫైట్. అదే టైమ్ లో హీరోకు అదే జిల్లాలో కలెక్టర్ ఉద్యోగం వస్తుంది. ఇక్కడ ఇంటర్వెల్ ట్విస్ట్.

ఈ 3 వాక్యాల కథను గంటన్నర పాటు నడపడం ఏ దర్శకుడికైనా కష్టమే. అందుకే మంచి సన్నివేశాలు రాసుకుంటారు. బోలెడంత మంది ప్యాడింగ్ ఆర్టిస్టుల్ని పెట్టుకుంటారు. కొత్త దర్శకుడు రాజశేఖర్ రెడ్డి మాత్రం ఈ రెండు పనుల్లో ఏదీ చేయలేదు. కేవలం వెన్నెల కిషోర్ ను నమ్ముకున్నాడు. 'ఇగో గురు' అనే పాత్రను క్రియేట్ చేశాడు. ఫస్టాఫ్ అంతా ఆడుకొమ్మని స్టీరింగ్ ను వెన్నెల కిషోర్ చేతిలో పెట్టాడు. వెన్నెల కిషోర్ సీన్లు బ్యాక్ టు బ్యాక్ వస్తుంటే.. ఇందులో హీరో నితినా లేక కిషోరుడా అనే సందేహం మనకు కలుగుతుంది. రన్ టైమ్ పెట్టడం కోసం దర్శకుడు వేసిన ఈ ఎత్తుగడ బెడిసికొట్టింది. సినిమా రిజల్ట్ ను ఘోరంగా దెబ్బతీసింది. గంటన్నర ఫస్టాఫ్ చూసిన ప్రేక్షకుడికి 3 గంటల సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

పోనీ ఇంటర్వెల్ తర్వాతైనా కథ కొత్తగా, గ్రిప్పింగ్ గా పరుగులు పెడుతుందా అంటే, అక్కడ కూడా దర్శకుడు తన చమక్కులు చూపించలేకపోయాడు. రెగ్యులర్ బి.గోపాల్ సినిమాల్లోలా సన్నివేశాలు రాసుకున్నాడు. వినాయక్ సినిమాల్లో చూపించినట్టు ఎలివేషన్లు ఎత్తుకున్నాడు. ఏమాత్రం కొత్తదనం లేని ఈ కథను, కొత్త దర్శకుడు ఎందుకు ఎత్తుకున్నాడు.. ఇలాంటి కథను నితిన్ లాంటి సీనియర్ ఎలా ఓకే చేశాడనేది వాళ్లిద్దరికే తెలియాలి.

ఉన్నంతలో ఈ సినిమాను ఆదుకునే ప్రయత్నం చేసిన తొలి వ్యక్తి నితిన్. డాన్సులు, ఫైట్స్ తో బాగా కష్టపడ్డాడు. హీరోయిన్ కృతి శెట్టి మెల్లమెల్లగా బోర్ కొట్టేస్తోంది. ఇక క్యాథరీన్ ను ఆ పాత్రకు తీసుకొని చాలా తప్పు చేశారు. హీరో పక్కన అస్సలు సెట్ కాలేదు. రాజేంద్రప్రసాద్, మురళీశర్మ, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ లాంటి నటులంతా రొటీన్ అనిపించారు. ఈ సినిమాతో యాంకర్ శ్యామల క్యారెక్టర్ ఆర్టిస్టు అయిపోయింది. ఆమెకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయం.

టెక్నికల్ గా సినిమా చాలా బాగుంది. ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ మెరిసింది. మహతి స్వరసాగర్ కంపోజ్ చేసిన పాటలన్నీ బాగున్నాయి. ఈ రొటీన్ సినిమాలో ఊరట ఈ పాటలే. కొన్ని సందర్భాల్లో అతడిచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మెప్పిస్తుంది. శ్రేష్ఠ్ మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఓవరాల్ గా రొటీన్ కథ, కథనంతో తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఏమాత్రం మెప్పించదు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి శుభం కార్డు వరకు మొత్తం ఊహించుకోగలిగేలా ఉన్న ఈ సినిమాతో నితిన్, తను ఆశించిన విజయాన్ని అందుకోలేడు. 

Tags:    
Advertisement

Similar News