గురువాయూరంబాల నడాయిల్ – తెలుగు వెర్షన్ రివ్యూ! {2.75/5}

Guruvayoor Ambalanadayil Movie Review: ఇటీవల పెద్ద హిట్టయిన ‘ఆడుజీవితం’ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, మూడు హిట్టయిన సినిమాల దర్శకుడు, నటుడు బేసిల్ జోసెఫ్ జోడీగా నటించిన ‘గురువాయూరంబాల నడాయిల్’ (గురువాయూర్ ఆలయం) మలయాళ మూవీ, 2024 మేలో విడుదలై ఈ సంవత్సరం హిట్టయిన 8 మలయాళం సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

Advertisement
Update: 2024-07-01 07:27 GMT

చిత్రం: గురువాయూరంబాల నడాయిల్ –తెలుగు వెర్షన్ 

దర్శకత్వం : విపిన్ దాస్

తారాగణం : పృథ్వీరాజ్ సుకుమారన్, బాసిల్ జోసెఫ్, నిఖిలా విమల్, అనస్వర రాజన్

రచనా : దీపూ ప్రదీప్, సంగీతం : అంకిత్ మీనన్, ఛాయాగ్రహణం : నీరజ్ రేవీ

బ్యానర్: పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, ఈ 4 ఎంటర్‌టైన్‌మెంట్, నిర్మాతలు : సుప్రియా మీనన్, ముఖేష్ మెహతా, సీవీ పార్థసారథి

విడుదల : జూన్ 28, 2024 (అమెజాన్ ప్రైమ్)

రేటింగ్: 2.75/5

ఇటీవల పెద్ద హిట్టయిన ‘ఆడుజీవితం’ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, మూడు హిట్టయిన సినిమాల దర్శకుడు, నటుడు బేసిల్ జోసెఫ్ జోడీగా నటించిన ‘గురువాయూరంబాల నడాయిల్’ (గురువాయూర్ ఆలయం) మలయాళ మూవీ, 2024 మేలో విడుదలై ఈ సంవత్సరం హిట్టయిన 8 మలయాళం సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది తెలుగు వెర్షన్ సహా. దీని దర్శకుడు విపిన్ దాస్ మూడు హిట్లు తీసి, నాల్గవ హిట్ తో ముందుకొచ్చాడు. పెళ్ళి చుట్టూ ఓ కామెడీ తీసి హిట్ చేసిన ఈ దర్శకుడి ‘కళ’ ఏమిటో తెలుసుకుందాం...

కథ

గురువాయూర్ కి చెందిన వినూ రామచంద్రన్ (బాసిల్ జోసెఫ్) దుబాయిలో ఉద్యోగం చేస్తూంటాడు. అతడికి అంజలి (అనస్వర రాజన్) తో నిశ్చితార్థం జరుగుతుంది. జంషద్ పూర్ లో అంజలి అన్న ఆనంద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఉద్యోగం చేస్తూంటాడు. అతడితో వినూకి సన్నిహిత పరిచయమేర్పడుతుంది. వినూ పూర్వం పార్వతి (నిఖిలా విమల్) ని ప్రేమించి విఫలమయ్యాడు. ఆమె మోసం చేసిందని కోపం పెంచుకుని ముందుకు సాగలేక పోతూంటాడు. గతాన్ని మర్చిపొమ్మని వినూకి ఆనంద్ నచ్చజెప్తాడు. ఆనంద్ కి కూడా ఓ సమస్య వుంటుంది. భార్య పార్వతికి ఒక ప్రేమలేఖ రావడంతో గొడవపడి పుట్టింటికి పంపేశాడు. ఇది తెలుసుకుని వినూ ఆనంద్ కి నచ్చజెప్పి పార్వతిని తెచ్చుకునేలా చేస్తాడు.

ఇలా పరస్పరం ఇద్దరి సమస్యలు తీర్చుకున్నాక, వినూ పెళ్ళికి బయల్దేరి వచ్చి ఆనంద్ ని కలుస్తాడు. కలిస్తే అతడి భార్య మరెవరో కాదు, తనని మోసం చేసిన పార్వతే. ఈ మోసగత్తె కుటుంబంతో పెళ్ళి వద్దనుకుని ఫ్రెండ్స్ సహాయంతో తన పెళ్ళి చెడగొట్టుకునే ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నాల్లో అంజలికి దొరికిపోయి విషయం చెప్పేస్తాడు. అంజలి అతడ్ని పెళ్ళి చేసుకోవడానికి అభ్యంతరం లేదని చెప్తుంది. రాజీ పడతాడు.

ఇంతలో పెళ్ళి చెడగొట్టడానికి ముందు ఒప్పుకోని వినూ ఫ్రెండ్ ఒకడు, ఇప్పుడు ఆనంద్ దగ్గరికెళ్ళి- మీ ఆవిడకి మాజీ ప్రియుడని చెప్పేస్తాడు. దీంతో అసలే కోపిష్టి అయిన ఆనంద్ అతడ్నీ, వినూనీ పట్టుకుని చిత్తుగా తన్ని పెళ్ళి క్యాన్సిల్ చేస్తాడు.

వినూ ఎదురు తిరిగి అనుకున్న ముహూర్తానికి గురువాయూర్ ఆలయంలో నీ చెల్లెలికి తాళి కట్టేస్తానని ఛాలెంజ్ చేస్తాడు. ఎలా కడ్తావో చూస్తానని ఆనంద్ ఎదురు ఛాలెంజీ చేస్తాడు. ఇప్పుడేం జరిగింది? ఇప్పుడు తన చెల్లెలితో వినూ పెళ్ళిని చెడగొట్టడానికి ఆనంద్ ఏఏ విఫల యత్నాలు చేశాడు? ఇంకా వినూ పాత విరోధులు ఒకరొకరే ముందుకొచ్చి పెళ్ళిని చెడగొట్టడానికి ఏఏ పథకాలేశారు? ఎప్పుడో గతంలో ఫ్రెండ్ శరవణన్ (యూగిబాబు) శోభనం రాత్రి పాల గ్లాసులో గొడ్డు కారం వేసి పెళ్ళి చెడగొట్టిన వినూ జీవితంలోకి ఆ శరవణన్ కక్ష గట్టుకుని పెళ్ళికి వచ్చి ఏం చేశాడు? గురువాయూర్ ఆలయంలో రసాభాస ఎలా జరిగింది? డ్రోన్ వచ్చి తాళినెలా ఎగరేసుకుపోయింది? అప్పుడేం జరిగింది? ఆనంద్ భార్యకి ప్రేమ లేఖ రాసిందెవరు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

వెడ్డింగ్ కామెడీ కథ ఇది. ఇందులో ప్రేమలు, డ్యూయెట్లు, ప్రేమలో సమస్యలు వగైరా వుండవు. అందుకని ఇది రోమాంటిక్ కామెడీ గానీ, రోమాంటిక్ డ్రామా గానీ కాదు. నేరుగా పెళ్ళి కథ మాత్రమే చెప్పదలిచాడు. కాబట్టి ఇందులో రోమాంటిక్ కామెడీ లేదా రోమాంటిక్ డ్రామా తాలూకు సీన్లని జొరబడనీయలేదు. వాటిని ఫిల్టర్ చేసి స్పష్టంగా వెడ్డింగ్ కామెడీ జా నర్ మర్యాదకి ఏం ఎలిమెంట్స్ కావాలో అవి మాత్రమే ప్రయోగించాడు. ఇది ప్రధానంగా పెళ్ళికి అటూ ఇటూ జట్టు కట్టిన శక్తులు సృష్టించే కాన్ఫ్లిక్ట్ చుట్టూ తిరిగే కథ. అందుకని ఈ కాన్ఫ్లిక్టే హైలైట్ అయ్యేలా రెండు మూడు వేర్వేరు సీన్లని కలిపి ఇంటర్ కట్స్ లో చూపిస్తూ థ్రిల్ నీ, స్పీడునీ, కామెడీనీ పెంచుతూ పోయాడు. దీంతో పాటు కథనంలో డైనమిక్స్ ని ప్రయోగించాడు. ఒక సీన్లో అనుకూలంగా జరిగితే వెంటనే తర్వాతి సీన్లో వ్యతిరేకంగా జరిగే డైనమిక్స్. ఈ ఇంటర్ కట్స్ తో బాటు డైనమిక్స్ వల్ల కథనంనిత్యం చలనంలో వుంటూ, ఫైర్ అవుతూ వుంటుంది. దీంతో ఈ రెండుంపావు గంటల వెడ్డింగ్ కామెడీ మంచి వినోద కాలక్షేపంలా తయారయ్యింది.

ఫస్టాఫ్ వినూ పాత్ర ఇష్టం లేని తన పెళ్ళిని చెడగొట్టుకునే కథ, సెకెండాఫ్ పెళ్ళికి సిద్ధ పడితే ఇతరులు ఆ పెళ్ళిని చెడగొట్టే కథ. ఈ రెండిటి మధ్య నలిగే వినూ కామెడీ పాట్లు. మధ్యలో తనతో విశసంగా లేదని భావిస్తున్న భార్య పార్వతితో ఆనంద్ పాట్లు. ఈ పాయింటుతో ఆనంద్- వినూల మధ్య శతృత్వం. ఈ గొడవల్లో వినూతో లేచిపోతనని పెళ్లికూతురు అంజలి బ్లాక్ మెయిల్. ఈ ప్రధాన పాత్రల చుట్టూ చేరి రసాభాస చేసే ఇతర పాత్రలు. ఈ పాత్రల్లో ఒక ఆడ పాత్ర కూడా వుంటే కాన్ఫ్లిక్ట్ కి యూత్ అప్పీల్ వచ్చేది.

క్లయిమాక్స్ గురువాయూర్ టెంపుల్ లో యాక్షన్ సీన్లు, డ్రోన్ ఎంట్రీ, తాళి గల్లంతు వగైరా. ఆద్యంతం నవ్వించడమే పనిగా పెట్టుకున్న ఈ వెడ్డింగ్ కామెడీ ప్రియదర్శన్ కామెడీ సినిమాల్ని గుర్తుకు తెస్తుంది.

నటనలు –సాంకేతికాలు

పృథ్వీరాజ్ సుకుమారన్ ఎప్పటిలాగే హుషారుగా పాత్ర పోషించాడు. కోపిష్టి పాత్ర కావడంతో బల ప్రయోగం కూడా చేస్తాడు. ఎత్తుగడలు వేసినప్పుడు యాక్షన్ లోకొచ్చి కథని మలుపులు తిప్పుతూంటాడు. ఈ కథకి హీరో బేసిల్ జోసెఫ్. పృథ్వీరాజ్ వ్యతిరేక పాత్ర. అందువల్ల వీళ్ళిద్దరి మధ్య సంఘర్షణతో నడుస్తూంతుంది కథ. పృత్వ్హీరాజ్ సీరియస్ పత్రాయితే జోసెఫ్ కామెడీ పాత్ర. ఈ డైనమిక్స్ కూడా బాగా పనికొచ్చాయి. జోసెఫ్ కామెడీ పాట్లు సున్నిత హాస్యంతో తెలివిగా నటించాడు.

పృథ్వీరాజ్ భార్యగా ఆకాశరామన్న ప్రేమ లేఖతో అపార్ధానికి గురయిన పాత్రలో నిఖిల జరుగుతున్న తతంగం సీరియస్ గా గమనిస్తూ వుంటుంది. ఎక్కువ మాట్లాడదు. జోసెఫ్ పెళ్ళి చేసుకునే అంజలి పాత్రలో అనస్వర కేర్ ఫ్రీగా వుంటుంది. ఇక అటూ ఇటూ కుటుంబ పాత్రలు, వూళ్ళో మేకవన్నె పులుల్లాంటి పాత్రలూ చాలా వున్నాయి.

ఇక పాటలు, లొకేషన్లు, కెమెరా వర్క్ సున్నిత కామెడీకి తగ్గట్టు సాఫ్ట్ గా కనిపిస్తాయి. కథనానికి దర్శకుడు విపిన్ దాస్ వాడిన క్రియేటివిటీయే ఈ వెడ్డింగ్ కామెడీకి బాక్సాఫీసు బలాన్నిచ్చింది.

Tags:    
Advertisement

Similar News