Gangs of Godavari Review: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి –రివ్యూ! {1.5/5}

Gangs of Godavari Movie Review: ఇటీవల ‘గామి’ సక్సెస్ తర్వాత విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

Advertisement
Update:2024-05-31 16:59 IST

చిత్రం: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

రచన : దర్శకత్వం : కృష్ణ చైతన్య

తారాగణం: విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి, నాజర్, గోపరాజు రమణ, హైపర్ ఆది తదితరులు

సంగీతం: యువన్ శంకర్ రాజా, ఛాయాగ్రహణం : అనిత్ మాదాడి

బ్యానర్స్: సితార ఎంటర్టయిన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్

నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య

విడుదల ; మే31, 2024

రేటింగ్: 1.5/5

ఇటీవల ‘గామి’ సక్సెస్ తర్వాత విశ్వక్ సేన్గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సమ్మర్ లో ఎండలకి, క్రికెట్ కి, ఎన్నికలకీ భయపడి పెద్ద సినిమాలని వాయిదా వేశాక, మే చివర్లో సమ్మర్ కి సెలవు చెబుతూ ఈ మూవీ విడుదలైంది. దీనికి కృష్ణ చైతన్య దర్శకుడు. ఈ సినిమా ప్రకటించినప్పట్నుంచీ ఆసక్తి రేపుతూ వచ్చింది. హిందీలో ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’ లాగా టైటిల్ తో వచ్చిన ఈ మూవీ ట్రైలర్ చూస్తే బలహీనంగా వుంది. ఈ సినిమాలో చాలా గ్యాంగ్‌లు వున్నాయి, కానీ ఇది గ్యాంగ్‌స్టర్ సినిమా కాదని, దీన్ని గ్యాంగ్‌స్టర్ మూవీగా పరిగణించవద్దనీ ప్రేక్షకుల్ని అభ్యర్థిస్తున్నానని ప్రకటించాడు దర్శకుడు. అంటే ఏమిటి? ఏమో! సినిమా చూస్తేగానీ తెలీదు. సినిమా చూసి తెలుసుకుందాం.

కథ

ఈ కథ పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని ఓ లంక గ్రామంలో పాతికేళ్ళ క్రితం జరుగుతుంది. అక్కడ పేకాట, తాగుడు, వేశ్యతో సంబంధం, డబ్బులు కొట్టేయడం వంటి పనులతో గడుపుతున్న రత్న(విశ్వక్ సేన్) కి గొదావరిలో ఇసుక అక్రమ రవాణా కంటబడుతుంది. దాని వెనుక ఎమ్మెల్యే దొరస్వామిరాజు (గోపరాజు రమణ) వుంటాడు. ఇతడి రాజకీయ ప్రత్యర్ధిగా నానాజీ (నాజర్)వుంటాడు. రత్న తెలివిగా దొరస్వామి రాజు దగ్గర చేరిపోయి ఇసుక వ్యాపారం చూస్తూంటాడు. నానాజీకో కూతురు బుజ్జి (నేహాశెట్టి) వుంటుంది. ఈమెని ప్రేమించి నానాజీకి శత్రువు అవుతాడు. అయితే ఎన్నికల్లో దొరస్వామి రాజుని ఓడిస్తానని నానాజీ ని ఒప్పిస్తాడు. ఎన్నికల్లో దొరస్వామి రాజుమీద పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుస్తాడు. దీంతో తలెత్తిన పరిణామాల్లో ఇద్దరికీ శత్రువు అవుతాడు.

ఇప్పుడేం చేశాడు రత్న? ఇద్దరు విరోధుల్ని ఎలా ఎదుర్కొన్నాడు? బుజ్జిని పెళ్ళి చేసుకున్నాడా? ప్రేమించిన వేశ్య రత్నమాల (అంజలి) ఏమైంది? ఇవి తెలుసుకోవాలంటే మిగతా కథ చూడాలి.

ఎలావుంది కథ

గోదావరిలొ కొట్టుకు పోయిన నాటు పడవలా వుంది. పడవలో దర్శకుడు, హీరో, నిర్మాతలూ అందరూ వున్నారు. రెస్క్యూ ఆపరేషన్ తో కూడా ఈ కథతో సినిమాని నిలబెట్టలేరు. రాయలసీమ, తెలంగాణాల్లో మాదిరిగానే ఆంధ్రా ప్రాంతంలోనూ హత్యలు, ఘర్షణలు జరుగుతున్నాయని, ప్రతిసారీ గోదావరి జిల్లాల్ని సుందరంగా చూపించడం చాలా అసహజంగా అన్పించిందనీ, గోదావరి జిల్లాల్లో కనువిందు చేయాల్సిన దానికంటే ఎక్కువే వుందనీ, ఆ విధంగా ఈ సినిమా ద్వారా చక్కని ఎమోషన్స్ తో కూడిన మంచి కథని చెప్పే అవకాశం లభించిందనీ చెప్పాడు దర్శకుడు.

చాలా గొప్పగా చెప్పాడు. కానీ కథ అనేది ప్రధానంగా ‘పాత్ర-సమస్య-పరిష్కారం’ అనే చట్రంలో వుంటే కథవుతుందని మరిచాడు. దీంతో కథంతా గందరగోళంగా తయారైంది. ఈ కథలో హీరోకి సినిమాని నిలబెట్టే ప్రధాన సమస్యా (పాయింటు), ఆ సమస్యని సాధించాలన్న భావోద్వేగాలతో కూడిన లక్ష్యమూ లేకపోవడంతో, ఇది సినిమా కథే కాకుండా పోయింది.

సినిమా సాంతం ఒక సమస్య వస్తే, దాన్నెదుర్కొన్నాక ఇంకో సమస్య వస్తే, దీన్నెదు ర్కొన్నాక ఇంకో సమస్య వస్తే ... ఎలా ఎన్నో సమస్యలు, వాటిని ఎన్నోసార్లు ఎదుర్కోవడాలే తప్ప, ఒకచోట ఆగి ప్రధాన సమస్యతో పాయిటుకి రాదు. ఇది ఒక ఎపిసోడ్ తర్వాత ఇంకో ఎపిసోడ్ గా సాగే డాక్యుమెంటరీల కోసం వాడే స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ కింది కొస్తుంది. ఇలా వచ్చిన టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఆటోనగర్ సూర్య వంటి వెన్నో అట్టర్ ఫ్లాపయ్యాయి. డాక్యుమెంటరీ కథనాలతో కమర్షియల్ సినిమాలు తీయలేరు.

కాబట్టి ఇంటర్వెల్లో కూడా కథేమిటో అర్ధం గాదు. ఇంటర్వెల్ తర్వాత అస్సలు అర్ధంగాదు. విలన్లతో ఏవేవో సమస్యలు, హీరో పోరాటాలూ వచ్చిపోతూంటాయి. ఇన్ని సమస్యలు, పోరాటాలు అర్ధంగాకుండానే, మరిన్ని సమస్యలూ పోరాటాలూ వచ్చేస్తూంటాయి. హీరోతో కుదురుగా కథే లేకపోయాక, మరోవైపు ఎన్నో పాత్రల ఉపకథలు కూడా వచ్చేస్తూ ఇంకా గందరగోళమై పోతుంది. ఇలా హీరో సహా ఏ పాత్రా నిలబడక- తన్నుకుని చావడమే వుంటుంది.

గోదావరి జిల్లాలో యాక్షన్ కథ చెప్పడానికి పూర్వమున్న’కత్తి కట్టడం’ అనే సాంప్రదాయాన్ని కేంద్ర బిందువుగా తీసుకున్నాడు. అక్కడ పగదీర్చుకునే కార్యక్రమాన్ని కత్తి కట్టడం అంటారు. దీన్ని రూపుమాపడం హీరో లక్ష్యం. దీని మీదే నిలబడి కథ చెయ్యక, ఈ పాయింటుని మరుగున పడేసి ఏమేమో చేశాడు. టైటిల్ కూడా ఈ కథకి కుదర్లేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే క్రిమినల్, మాఫియా కథల్ని సూచించే టైటిల్ లాగా వుంది. కానీ చూస్తే ఇది రెండు రాజకీయ గ్రూపుల రొటీన్ కథ. రాజకీయ నాయకులు పోషించుకునే కార్యకర్తల్ని గ్యాంగ్స్ అనరు. పూర్వం 1970, 80 లలో గోదావరి జిల్లాల్లో గ్రామ కక్షలతో కూడిన సినిమాలెన్నో వచ్చేవి. వాటిలో జమీందారో, సర్పంచో విలన్ గా వుండేవాడు. ఆ బాపతు కథే ఇదీనూ.

దర్శకుడన్నట్టు, ప్రతిసారీ గోదావరి జిల్లాల్ని కనువిందుగా చూపించలేదు. అప్పుడు కూడా గ్రామ కక్షలతో కొట్టుకోవడం చూపించారు. కాబట్టి తానేదో మొదటి సారిగా చూపించడం లేదు. 2023 లో శ్రీకాంత్ అడ్డాల తీసిన ‘పెదకాపు’ కూడా ఇలాటి గోదావరి జిల్లా యాక్షన్ కథనే గజిబిజి గందరగోళంగా తీసి అట్టర్ ఫ్లాప్ చేశాడు.

నటనలు –సాంకేతికాలు

విశ్వక్ సేన్ వూర మాస్ పాత్ర వేశాడు. మధ్యలో ఎమ్మెల్యేగా మారినా తేడా లేకుండా అదే వూర మాస్ గా నటించుకుపోయాడు. క్యారక్టర్ ఆర్క్ అనేది లేకుండా పదిహేనేళ్ళ పాత్ర జర్నీని ఎత్తు పల్లాల్లేకుండా, భావోద్వేగాల్లేకుండా ఫ్లాట్ గా, రొడ్డ కొట్టుడుగా చేసుకుపోయాడు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచాక ఆ పదవిలోనే కొనసాగక, మధ్యలో పదవి పోగొట్టుకుని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవడం, కొట్లాడుకుని ఓ పది సార్లు జైలు కెళ్ళడం, అయిదారుసార్లు ఆస్పత్రికెళ్ళడం, ఒకర్ని కన్నాక మళ్ళీ ఇంకోసారి ఇంకో పిల్లని కనడం, ఇలా చేసిందే చేస్తూ అక్కడక్కడే తిరుగుతూంటాడు తప్ప ముందు కెళ్ళే కథా నాయకత్వమే లేదు. ఓ సమస్య, దాని పరిష్కారం కోసం ఓ లక్ష్యం వుంటేగా? పాటలు, ఫైట్లు బాగా చేశాడు, ఫస్టాఫ్ లో లారీ మీద యాక్షన్ సీను ఎక్సైటింగ్ గా వుంది.

హీరోయిన్లు నేహాశెట్టి, అంజలి ఇద్దరికీ పాత్రలు అంతంత మాత్రం. ప్రభావం చూపరు. విలన్లుగా నాజర్, గోపరాజు రమణలవి ఫార్ములా పాత్రలు, నటనలు. హీరో వెంట వుండే హైపర్ ఆది రెండు మూడు చోట్ల కామెడీ డైలాగులు విసురుతాడు.

సాంకేతికంగా ఏ లోటూ లేకుండా చూసుకున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతంలో మూడు పాటల్లో మొదటి రోమాంటిక్ పాట, దాని చిత్రీకరణా బావున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టాప్ అనొచ్చు. అలాగే అనిల్ మాదాడి ఛాయాగ్రహణం టాప్ రేంజిలో వుంది. ఇందులో పచ్చటి పంట పొలాలు కనపడవు, ఎర్రటి రక్తాలు కనపడతాయి. యాక్షన్ సీన్స్, కళాదర్శకత్వం చెప్పుకోదగ్గవి. కానీ దర్శకుడి చేతిలో విషయపరంగా సినిమా చెప్పుకో దగ్గది కాదు. 

Full View
Tags:    
Advertisement

Similar News