గమక్ ఘర్ – మైథిలి మూవీ రివ్యూ!

Gamak Ghar movie review: ‘గమక్ ఘర్’ (2019) తీసేనాటికి 23 ఏళ్ళు. ఈ వయసులో ఇది తీసి అంతర్జాతీయ సినిమా విమర్శకుల్ని ఆశ్చర్యపర్చదమే గాక, రెండు దేశీయ, నాల్గు అంతర్జాతీయ అవార్డులతో సెలబ్రిటీ అయిపోయాడు. జపనీస్ మహా దర్శకులతో ఇతణ్ణి పోల్చారు.

Advertisement
Update: 2024-07-05 11:45 GMT

సమాంతర సినిమా చరిత్ర తొలి, మలి తరం దర్శకుల కాలంతో అంతమవకుండా యువతరం దర్శకులు ముందుకు రావడం ఈ కమర్షియల్ యుగంలో చాలా గర్వించదగ్గ విషయం. 1980 -’90 లలో సమాంతర సినిమాలకి కాలం చెల్లిన పరిస్థితుల్లో, 2000 లలో మలి తరం దర్శకుడు శ్యామ్ బెనెగల్ బాలీవుడ్ స్టార్స్ తో సమాంతర సినిమాలకి తిరిగి కొంత జీవం పోశాక, ఆ తర్వాత ముడి ఫిలిం బదులు డిజిటల్ చిత్రీకరణ సులభ సాధ్యంగా అందుబాటులో కొచ్చాక, యువతరం నుంచి సమాంతర సినిమా దర్శకులు వెల్లువలా దూసు కొచ్చేశారు. డిజిటలీ కరణతో, పైగా ప్రపంచీకరణతో వినోద పరిశ్రమ బాక్సాఫీసుకి బంగారు బాతుగా మారేక, ఈ యువతరం దర్శకులు తల్చుకుంటే వ్యాపార సినిమా వైపు వెళ్ళి పోగలరు. కానీ ఎక్కడో వీళ్ళలో వ్యాపార యుగానికి పొసగని కళాతృష్ణ అనేది బతికుంది. ఆ కళాభివ్యక్తి కోసం సమాంతర సినిమాల్ని స్వతంత్ర (ఇండిపెండెంట్) సినిమాలుగా మార్చుకుని నిబద్ధతతో ముందుకు సాగిపోతున్నారు.

ఇది తెలుగు తప్ప ఇతర భాషల్లో మాత్రమే. తెలుగులో ఆలోచనా స్థాయి నేలబారే గనుక అవే మూస సినిమాలు తీసుకుంటూ దేవుడా అనుకోవడమే. ఇప్పుడు ఓటీటీ అందుబాటులోకి వచ్చాకైనా తెలుగులో ఆర్ట్ సినిమాలు తీయొచ్చు. డబ్బుకి డబ్బూ, అంతర్జాతీయంగా పేరూ వస్తుంది. అసలు ఆర్టే తెలియనప్పుడు ఈ రెండూ ఎలా వస్తాయి. ఒకవేళ తప్పీజారీ ఒక ఆర్టు తీసినా అదీ మూసలాగే వుంటుంది. మెదడులో మసక ఆలోచనలున్నప్పుడు బొమ్మ తేటగా తీయడంలో అర్ధం లేదంటాడు జీన్ లక్ గొదార్ద్. ప్రస్తుత ఓటీటీల కాలంలో వివిధ భాషల్లో కొత్త తరం దర్శకులు రియలిస్టిక్ సినిమాలంటూ ఆకర్షిస్తున్నా, ఈ కొత్త వ్యాపారం వైపు కూడా మొగ్గకుండా, స్వతంత్ర యువ దర్శకులు తమ స్వతంత్ర సినిమాలకి కట్టుబడే వుంటున్నారు. ఈ స్వతంత్ర దర్శకుల్లో విస్మయ పర్చే యువకుడు అచల్ మిశ్రా అనే 23 ఏళ్ళ బీహార్ వాసి.

అచల్ మిశ్రా తాత ప్రముఖ రచయిత పండిత్ కేదార్ నాథ్ మిశ్రా కావడంతో, కళారంగం పట్ల అచల్ కి అచంచలమైన భక్తి ఏర్పడింది. చదువుకుంటూనే 17వ యేట ఒక హిందీ సినిమాకి పనిచేసి, నేరుగా వెళ్ళి లండన్ కింగ్స్ కాలేజీలో సినిమా అధ్యయనం కోర్సులో చేరిపోయాడు. అది వదిలేసి బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో అంతర్జాతీయ సినిమాలు చూస్తూ, నటుల అభినయాల్ని గమనిస్తూ, సినిమా ప్రముఖుల్ని కలుసుకుంటూ, సినిమా తీయాలన్న నిర్ణయాని కొచ్చేశాడు. అలా సినిమాలు చూస్తూ, సినిమా ప్రముఖుల ప్రసంగాలు వింటూ, స్వదేశాని కొచ్చి సినిమా తీసేశాడు.

‘గమక్ ఘర్’ (2019) తీసేనాటికి 23 ఏళ్ళు. ఈ వయసులో ఇది తీసి అంతర్జాతీయ సినిమా విమర్శకుల్ని ఆశ్చర్యపర్చదమే గాక, రెండు దేశీయ, నాల్గు అంతర్జాతీయ అవార్డులతో సెలబ్రిటీ అయిపోయాడు. జపనీస్ మహా దర్శకులతో ఇతణ్ణి పోల్చారు. దివంగత తాతకి గర్వకారణంగా నిలిచాడు. ఆ తాత ముత్తాతలకే నివాళిగా ‘గమక్ ఘర్’ (ఊళ్ళో ఇల్లు) తీసే ఆలోచన చేసి.

మైథిలీ భాష హిందీకి దగ్గరగానే వుంటుంది. హిందీ వచ్చి వుంటే సబ్ టైటిల్స్ లేకున్నా ఈ సినిమా అర్ధమైపోతూనే వుంటుంది. బీహార్లో భోజ్ పురీ తో బాటు మగాహీ, మైథిలీ భాషల్లో సినిమాలు తీస్తారు. 2015 లో ప్రారంభించి నేటి వరకూ మైథిలీలో అయిదే సినిమాలు తీశారు ‘గమక్ ఘర్’ సహా. మైథిలీ భాష ఇండో ఆర్యన్ భాష. బీహార్, ఝార్ఖండ్, నేపాల్ లలో ఈ భాష మాట్లాడే జనాభా మూడున్నర కోట్లు వుంటారు. ఇక ‘గమక్ ఘర్’ ఎలావుందో చూద్దాం...

కథ

1998. ఆ గ్రామం వెళ్ళే దారిలో పచ్చగా పెరిగిన వృక్షం దిక్సూచిలా వుంటుంది. గ్రామంలోకి దారి విశాలంగా వుంటుంది. గ్రామంలో ఆ ఇల్లు ఆలనా పాలనతో కళకళ లాడుతూ వుంటుంది. ఇంటినిండా మనుషులుంటారు. ఆప్యాయంగా, ప్రేమగా వుంటారు. మంచాలు, కుర్చీలు పద్ధతిగా అమర్చి వుంటాయి. ఇల్లు చక్కగా అలంకరించి వుంటుంది. వాకిట్లో తులసి కోట పూజ చేసి వుంటుంది. వరండాలో తాజా కూరగాయలూ, బాగా పండిన నోరూరించే మామిడి పళ్ళూ కుప్ప పోసివుంటాయి. కడివెల్లో స్వచ్ఛమైన గడ్డ పెరుగు తయారుగా వుంటుంది. మగవాళ్ళు వరండాలో పేకాడుతూ వుంటారు. పిల్లలు ఇంటా బయటా ఆడుకుంటూ వుంటారు. ఆడవాళ్ళు లోపల వంట చేస్తూ వుంటారు. ఒక కారులో డాక్టరు, అతడి భార్యా వస్తారు. పేకాటలో డాక్టర్ని కూర్చో బెట్టుకుంటారు మగవాళ్ళు. ఒకావిడ పనివాణ్ణి మామిడి తోపుకి పంపిస్తుంది. వాడు పిల్లలతో వెళ్ళి మామిడి కాయలు కోసుకొస్తాడు. ఇంటి హాల్లో గోడకి ఫోటో వుంటుంది. అది తాతగారి ఫోటో. గదిలో మంచం మీద ఒకావిడ వుంటుంది. ఆవిడ నానమ్మ. ఇంకో గదిలో చిన్న కోడలు వుంటుంది. ఆమె వొళ్ళో పసికందు వుంటాడు. ఆమె భర్త మార్కెట్ కెళ్ళి చేపలు పట్టుకొస్తాడు.

మగవాళ్ళు భోజనాలకి లేస్తారు. మగవాళ్ళు, ఆడవాళ్ళూ పిల్లలూ కలిసి ఆనందంగా భోజనాలు చేస్తారు. సాయంత్రమవుతుంది. చీకటి పడుతుంది. పనివాణ్ణి వీసీఆర్ తెమ్మని పంపిస్తారు. పనివాడు వెళ్ళి వీసీఆర్ తో బాటు సల్మాన్ ఖాన్, సన్నీడియోల్ సినిమాల వీడియోలు పట్టుకొస్తాడు. చిన్న కోడలు పసికందుతో పూజ లో కూర్చుంటుంది. పసికందుని దేవుడి ముందు పెడుతుంది. అందరూ పసికందుకి చదివింపులు చదివిస్తారు. వాకిట్లో విస్తారాకులేసి పంక్తి భోజనాలు మొదలవుతాయి. వూళ్ళో జనాలకి చేప కూరతో, మిఠాయిలతో కడుపారా వడ్డిస్తారు. ఇంట్లో అందరూ భోజనాలు చేస్తారు. పిల్లలతో కలిసి పనివాడు వీడియోలు చూస్తాడు. తెల్లారి వాకిట్లో కలుస్తారందరూ. నానమ్మ వొళ్ళో పసికందుని వుంచి, గ్రూప్ ఫోటో దిగుతారు. దీంతో పుట్టిన పసికందుకి ఆ రోజు తలపెట్టిన శుభ కార్యం కోలాహలంగా ముగిసింది.

2010. గ్రామ శివారులో వృక్షం కొమ్మలు వాలిపోయి వుంటుంది. గ్రామంలో కెళ్ళే మార్గం కాలి బాటంత కుంచించుకు పోయివుంటుంది. వూళ్ళో ఇల్లు వొంటరిగా వుంటుంది. వాకిట్లో తులసి మొక్క సన్నబడి వుంటుంది. ఇల్లు పెచ్చులూడిన గోడలతో, రంగులు వెలసి కళ తప్పి వుంటుంది. వరండాలో మాసిన కుర్చీ లుంటాయి. మనుషులుండరు. ఇంట్లో మనుషులు నల్గురైదుగురు వుంటారు. ఆ నల్గురిలో ఆప్యాయతల్లేవు, ప్రేమల్లేవు, మాటలు అంతగా లేవు. అంత టైమ్ లేదు. పిల్లల ఆటల్లేవు, నవ్వుల్లేవు. ఇల్లంతా అదోలాటి నిశ్శబ్దం. పెద్ద కొడుకు ఢిల్లీలో డాక్టరీ చదివాడు గానీ చనిపోయాడు. రెండో కొడుకు నోయిడాలో ఫ్లాట్ కొనుక్కుని స్థిరపడ్డాడు. మూడో కొడుకు ఇక్కడే తల్లితో వుంటున్నాడు. కొంత స్థలం అమ్మేసి మెడికల్ షాపు పెట్టాలనుకుంటున్నాడు.

మధ్యాహ్నం భోజన వేళవుతుంది. వరండాలో అటు దూరంగా రెండు కుర్చీలు, ఇటు దూరంగా రెండు కుర్చీలు నిర్లక్ష్యంగా లాక్కుని, ఒక కుర్చీలో కూర్చుని, రెండో కుర్చీలో పళ్ళెం పెట్టుకుని, వంచిన తల ఎత్తకుండా తింటూంటారు అన్నదమ్ములు. మొక్కుబడిగా రెండు మాటలు తలెత్తకుండానే, మాట్లాడుకుని తినేస్తారు. గ్రామం అవతల నది వొడ్డున ఉత్సవం జరుగుతూంటుంది. వూళ్ళో వాళ్ళంతా అక్కడ చేరతారు. అన్నదమ్ములు భార్యలతో వచ్చి పాల్గొంటారు. ఈ రోజు రాక తప్పదు కాబట్టి వచ్చారు. ఎలాగో అయిందన్పించుకుని వెనుదిరుగుతారు. ఇంటికెళ్ళి కాకర పువ్వొత్తులు వెల్గించి ముగిస్తారు.

ఎదిగిన మనవడు నానమ్మని అడిగి తాత రాసిన పుస్తకాల మూట తీసుకుంటాడు. బాబాయితో కలిసి వాటిని చూస్తాడు. ఒక డైరీలో తాత రాసిన ఖర్చులుంటాయి. బాబాయికి పెట్టిన ఖర్చులు రాశాడు తాత. బిస్కెట్లు, పెట్రోలు, టైరు పంక్చర్ మొదలైన వాటికి పెట్టిన ఖర్చులు. ఇంట్లోకి తెచ్చిన 12 కేజీల మటన్ ఖర్చు కూడా ఒక చోట రాశాడు.

ఇది చూసి తాత మటన్ ఎంత బాగా వండే వాడో గుర్తు చేసుకుంటారు. మసాలా దినుసులూ అవీ తానే నూరి, అన్నీ తానే అయి అద్భుతంగా మటన్ వండి, పదిహేను మందికి తృప్తిగా వడ్డించేవాడని తలచుకుంటారు. తాత రాసిన నాటకం వుంటే తిరగేస్తారు. ఆ నాటకం వేస్తున్నప్పుడల్లా చుట్టు పక్కల జనం గుంపులుగా ఎలా వచ్చేవారో చెప్పుకుంటారు. నువ్వెలాగూ థియేటర్ ఆర్ట్స్ లో వున్నావు కదా, ఈ నాటకంలో ఐడియాలు పనికొస్తాయేమో చూడమంటాడు బాబాయి. తల్లవారుతుంది. స్నానాల గది తలుపు, వంట గది తలుపు రిపేరు చేయించాలని మాట్లాడుకుంటారు అన్నదమ్ములు. ఇంటికి రంగులు వేయాలనుకుంటారు. రిక్షా వస్తుంది. వచ్చిన ఛాఠ్ పండగ ఎలాగో ముగించారు కాబట్టి ఇక బయల్దే రతారు.

2019. గ్రామ శివారులో చెట్టెండి పోయి వుంటుంది. గుబురు పొదలతో కాలిబాట కనిపించదు. తెల్లవారుతూంటుంది. పొగమంచు కమ్మేసి వుంటుంది. శిథిలమైన ఇల్లు పొగమంచుతో కప్పేసి వుంటుంది. తులసి కోట పాడుబడి వుంటుంది. తులసి మొక్క ఎండిపోయి వుంటుంది. వాకిలి గడ్డి మొలిచి వుంటుంది. మేకలూ మేక పిల్లలూ మేస్తూంటాయి. వరండాలో కుర్చీలు వుండవు. ఈ వూరితో సంబంధమున్న ఒక్క నానమ్మ ఇప్పుడు లేదు. ముసలివాడై పోయిన పనివాడు వుంటాడు. చీపురు పట్టుకుని వరండా ఊడుస్తాడు. వాకిట్లో మేకల్ని బయటికి తోలుతాడు. గేటు ముందు కూర్చుని టీ తాగుతూంటాడు. మోటారు సైకిలేసుకుని ఒకతను వచ్చి, పొలంలో పనుంది వచ్చి చేసుకోమంటాడు. రానంటాడు పనివాడు. పొద్దెక్కుతుంది. ఒక మేస్త్రీ నల్గురు కూలీలతో వఛ్చి, ఇల్లు పడగొట్టడం మొదలెడతాడు...

ఎలావుంది కథ

మతిపోయే కథ. ఈ తరహాగా కథ రాయవచ్చని ఎవరూ తలపోసి వుండరు. కథ లేకుండా కథ చెప్పడం. కథంటే కొన్ని పాత్రలు, ఆ పాత్రల మధ్య ఒక విషయం, ఆ విషయంతో తర్జన భర్జన. ఇక్కడ పాత్రలే లేవు. కనిపించిన మనుషులు పాత్రలు కారు. వాళ్ళకి కథ లేదు కాబట్టి. వాళ్ళు కేవలం సాధనాలు. ఈ సాధనాలతో కథ కన్పిస్తోంది ఇంటికే. సాధనాలని బట్టి ఇల్లెలా మారిపోతూ వచ్చిందన్నదే ఇంటి గురించిన ఈ మౌన కథ.

ఇల్లు బావుండాలంటే మనసు లోగిలిలో మనుషులుండాలి. మనసు లోగిల్లో మనుషుల్లేక పోతే ఆ ఇల్లు ధర్మ సత్రం. ఆ మనుషులు అన్నీ వున్న అనాధలు. ఈ కథలో మనుషులు పుట్టి పెరిగిన తమ ఇల్లొదిలి, ఇంకెక్కడో ఉనికిని వెతుక్కుంటూ మనసు లోగిల్లో మనుషుల్ని కోల్పోయారు. ఈ ఇంట్లో ఎంత మందైతే మనుషులూ వాళ్ళ పిల్లలూ అనుబంధాల్ని పెంచుకున్నారో, వాళ్ళ స్థానంలో అన్ని మేకలూ మేకపిల్లలూ వుంటున్నాయి. మటన్ వండే తాత కోసం ఎదురు చూస్తున్నట్టు. వీటి విశ్వాసం చూస్తూంటే ...

ఈ దర్శకుడి తల్లిదండ్రులు ఎక్కడెక్కడో ఇళ్ళు మారుతూ వుంటే, తను బోర్డింగ్ స్కూళ్ళల్లో, అద్దె గదుల్లో గడుపుతూ, చివరికి దేశం విడిచి లండన్ కే వెళ్లి పోయాడు. అప్పుడాలోచించాడు. మన ఇల్లు, మన మూలాలు అన్న ఠికానాతో సాంత్వన ఎప్పుడు కలుగుతుంది? కనీసం అలాటి గుర్తు వుండాలిగా? ఆ గుర్తు బీహార్ రాష్ట్రం దర్భంగా దగ్గర్లో, మాధోపూర్ గ్రామంలో 1950 లలో ముత్తాత కట్టిన ఇల్లు. ఆ ఇల్లు ఇప్పుడు లేదు. ఆ ఇల్లు లాంటిదే ఇంకో ఇల్లు చూసుకుని సినిమా తీశాడు. భావాత్మకంగా ధ్యాన ముద్రలోకి తీసికెళ్ళి పోయే సినిమా. 90 నిమిషాల ఈ కథ ముగింపు దృశ్యం చూస్తూంటే, రావిశాస్త్రి ‘ఇల్లు’ నవల, ‘సినిమా పారడిసో’ సినిమా చివరి దృశ్యం, ఎందుకు గుర్తొచ్చి కాసేపు బాధ పడతామో తెలీదు.

నటనలు - సాంకేతికాలు

నటీ నటులందరూ మైథిలీ భాష తెలిసిన కొత్తవారే. అందరూ మంచి రూపం వున్నవాళ్ళు. వీళ్ళు పాత్రలు కాకపోయినా నటించక తప్పదు. అయితే నటిస్తున్నట్టు అన్పించరు. వాళ్ళ సొంత ఇళ్ళల్లో ఎలా వుంటారో అలా వ్యవహరిస్తున్నట్టు వుంటారు. బాల నటులూ అంతే. పెద్దవాళ్ళు ఎవరు ఎవరో, ఎవరికి ఏమవుతారో, పిల్లలు ఎవరెవరి పి‌ల్లలో, చెప్పే జోలికెళ్ళ లేదు దర్శకుడు. కథ వీళ్ళతో కాదు కాబట్టి. ఓ పసికందుతో వుంది కాబట్టి చిన్న కోడలని ఒకామెని, నానమ్మనీ, పనివాణ్ణీ గుర్తిస్తామంతే.

సాంకేతికంగా, సృజనాత్మకంగా ఇదొక కవిత్వం. సినిమా అంతా ఫోటో ఆల్బంలా వుంటుంది. దృశ్యాలు ఆల్బంలో ఫోటోలు తిరగేస్తున్నట్టు మారుతూంటాయి. ఈ కథ థీమ్ వచ్చేసి కెమెరా మనసులో ‘ఇంటితో జ్ఞాపకాలు’. 1998 నుంచి కెమెరా మాత్రమే చూస్తోంది ఈ ఇంటిని. అందుకని ఆ జ్ఞాపకాలని దర్శిస్తున్నట్టు ఫోటోల్లాంటి దృశ్యాలతో కథనం. ఈ దృశ్యాల్లో కెమెరా కదలదు. కెమెరా అలా పెట్టేసి వుంటుంది, దృశ్యాల్లో నటులే కదులుతారు. అన్ని దృశ్యాలకీ ఒకే మిడ్ షాట్ రేంజిలో కదలకుండా, కెమెరా స్టాటిక్ గా వుంటుంది. ఆద్యంతం ఒకదాని తర్వాటొకటి స్టాటిక్ మిడ్ షాట్స్ పరంపర ఈ సినిమా. కెమెరామాన్ కెమెరా అలా పెట్టేసి, వెళ్ళిపోయి వేరే పని చేసుకోవచ్చు. క్లోజప్స్ తీసే పనిలేదు, యాంగిల్స్ మార్చే అవసరం లేదు. ఒక్కో దృశ్యం ఒకే షాట్, ఫోటోగ్రాఫ్స్ కాబట్టి. స్టీవెన్ స్పీల్ బెర్గ్ తీసిన 'మైనారిటీ రిపోర్ట్' లో షాట్స్ లాగా.

అయితే అచల్ మిశ్రా షాట్స్ లో కన్పించే ఆయా దృశ్యాలు తైలవర్ణ చిత్రాల్లా వుంటాయి. కుంచె కారుడొచ్చి, ఒక చేత్తో సిగరెట్ పట్టుకుని, ఇంకో చేత్తో తీరుబడిగా బొమ్మలేస్తున్నట్టు. ఎక్కువగా నటులు ఫ్రేముకి కుడి వైపుంటారు. వెండి తెర మీద మన కళ్ళు ఎడం వైపు చూస్తాయి. ఇక్కడ ఎడం వైపు ఖాళీగా వుంటుంది. దర్శకుడెందుకిలా చేశాడో ఆలోచించాలి. కెమెరా మాన్ ఆనంద్ బన్సల్ ఒక దృశ్యకావ్యాన్ని రచించాడు.

ఈ మేకింగ్ చూస్తూంటే మణికౌల్ ‘ఉస్కీ రోటీ’ (1970, లోకల్ క్లాసిక్స్ -35) గుర్తుకు రాకమానదు. ఇందులో కథ చెప్పడానికి నటుల్ని నటింప జేయడు మణికౌల్. నటులు లోపలి భావోద్వేగాలని బయటికి ప్రదర్శిస్తారు. మణికౌల్ దృష్టిలో నటులు కేవలం మానవ దేహాలకి మోడల్స్. కాబట్టి మోడల్స్ అయిన నటులు (మోడలింగ్ ఛేస్తున్నట్టు) బయటి భావోద్వాగాల్ని లోపల తమ ఇమేజుల్లో పలికించాలి. అలా వాళ్ళ ఛాయాచిత్రాల్లాంటి షాట్స్ తో కథ చెప్తాడు. ఈ థియరీని రాబర్ట్ బ్రెసన్ నుంచి తీసుకున్నాడు.

మణికౌల్ దృశ్యంలో పాత్రలు కదలవు, కెమెరా కదుల్తుంది. అచల్ మిశ్రా దృశ్యంలో పాత్రలు కదుల్తాయి, కెమెరా కదలదు. ఎలాగైతే మణికౌల్ సినిమా చూడడం వొత్తిళ్ళని దూరం చేసే మెడిటేషనో, అలా అచల్ మిశ్రా సృష్టి కూడా ముందు చెప్పుకున్నట్టు, భావాత్మకంగా ధ్యాన ముద్రలోకి తీసికెళ్ళే అనుభవం.

ధ్యాన ముద్ర కాబట్టి దృశ్యంతో బాటు శబ్ద సౌందర్యమూ పాటించాడు. ఆడియో లెవెల్ మంద్ర స్థాయిలో వుంటుంది. పిల్లలు కూడా గోల చేయరు. పిల్లలతో ఏ దృశ్యం చూసినా శాంతం కన్పిస్తుంది, ముసిముసి నవ్వులు కన్పిస్తాయి. వుండీ లేనట్టు విన్పించే అంశుమన్ శర్మ స్వరాలూ మేడిటేషన్లో భాగమే.

మూడు భాగాల ఈ కథలో మొదటి 1998 కథా కాలాన్ని అకాడెమీ రేషియోలో చిత్రీకరణ చేశాడు. 16 ఎంఎం లా కన్పిస్తుంది. కుటుంబ సభ్యులిలా తక్కువ చోటులో ఒద్దికగా వున్నారని చెప్పడం ఉద్దేశం. తక్కువ చోటులో ఒద్దికగా వున్నప్పుడు ఇల్లు వికాసంతో వుంది. తర్వాతి రెండు భాగాలు నిండు తెర నాక్రమిస్తుంది చిత్రీకరణ. ఈ కాలాల్లో స్థాన చలనాలతో జీవితాలు విశాల మయ్యాయి గానీ, ఇల్లు కుంగదీసుకు పోయింది. ఇవీ సాంకేతిక విశేషాలు. చివర ఇల్లు పడగొట్టే ముగింపు దృశ్యంలో, ఒక ఆనందమేమిటంటే, చివర్లో ఒకతను వచ్చి చూస్తూ వుంటాడు. ఇల్లు పడగొట్టిస్తున్నది ఇతనే. కొత్తగా కట్టించడానికి. ఇతను చిన్న కొడుకు! 


Full View


Tags:    
Advertisement

Similar News