'ఫస్ట్ డే ఫస్ట్ షో' రివ్యూ!

సూపర్ హిట్ కామెడీ 'జాతిరత్నాలు' టీం మరోసారి నవ్వించేందుకు 'ఫస్ట్ డే ఫస్ట్ షో' అనే మరో కామెడీతో వచ్చారు. రెండు చిన్న సినిమాల్లో నటించిన శ్రీకాంత్ రెడ్డి హీరో. సోషల్ మీడియా స్టార్‌గా కోట్లు సంపాదిస్తున్న18 ఏళ్ళ సంచితా బసు హీరోయిన్.

Advertisement
Update:2022-09-03 15:25 IST

దర్శకత్వం : వంశీధర్ గౌడ్, పి. లక్ష్మీనారాయణ

తారాగణం: శ్రీకాంత్ రెడ్డి, సంచితా బసు, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సివిఎల్ నరసింహారావు, ప్రభాస్ శ్రీను, మహేష్ ఆచంట, వంశీధర్ గౌడ్, సాయి చరణ్ తదితరులు.

రచన : అనుదీప్ కెవి, సంగీతం: రధన్, ఛాయాగ్రహణం : ప్రశాంత్ అంకిరెడ్డి

నిర్మాతలు: శ్రీజ ఏడిద, శ్రీరామ్ ఏడిద

బ్యానర్ : పూర్ణోదయ పిక్చర్స్, శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్స్, మిత్రవింద మూవీస్

విడుదల : సెప్టెంబర్ 2, 2022

రేటింగ్ : 1.5/5

సూపర్ హిట్ కామెడీ 'జాతిరత్నాలు' టీం మరోసారి నవ్వించేందుకు 'ఫస్ట్ డే ఫస్ట్ షో' అనే మరో కామెడీతో వచ్చారు. రెండు చిన్న సినిమాల్లో నటించిన శ్రీకాంత్ రెడ్డి హీరో. సోషల్ మీడియా స్టార్‌గా కోట్లు సంపాదిస్తున్న18 ఏళ్ళ సంచితా బసు హీరోయిన్. వంశీధర్ గౌడ్, పి. లక్ష్మీనారాయణ జంట దర్శకులుగా చేస్తున్న తొలి ప్రయత్నం. 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ ఇచ్చిన కథతో ఈ కామెడీ చిత్రం తీశారు. శంక‌రాభ‌ర‌ణం, సీతాకోక చిలుక‌, స్వ‌యం కృషి, సితార‌, సాగ‌ర సంగ‌మం లాంటి క్లాసిక్స్ నిర్మించిన పూర్ణోదయ పిక్చర్స్ సంస్థ 30 తర్వాత ఏళ్ళ రీఎంట్రీ ఇస్తూ, సంస్థ అధినేత ఏడిద నాగేశ్వర రావు మనవరాలు శ్రీజ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కింది. 'జాతిరత్నాలు' ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ నిర్మిస్తే, అదే టీం నుంచి వచ్చిన 'ఫస్ట్ డే ఫస్ట్ షో' కి కూడా ప్రముఖ నిర్మాతే లభించడం టీంకున్న గుడ్ విల్ ని తెలుపుతుంది. మరి ఇంతా చేసి ఈ రెండో కామెడీతో అంతే నవ్వించారా, ఎక్కువ నవ్వించారా, అసలు నవ్వించలేదా? ఇది తెలుసుకుందాం.

కథ

2001లో శీను (శ్రీకాంత్ రెడ్డి) కాలేజీ స్టూడెంట్. పవన్ కళ్యాణ్ అంటే పడి చస్తాడు. ఏ పవన్ సినిమా విడుదలైనా మొదటిరోజు మొదటి ఆట చూసేస్తాడు. థియేటర్లో, ఊళ్ళో బ్యానర్లు కట్టి హడావిడి చేస్తాడు. ఎంతగానో ఎదురు చూసిన పవన్ కొత్త సినిమా 'ఖుషీ' విడుదలవుతుంటే ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ల కోసం జనంలో పడతాడు. క్లాస్ మేట్ లయ (సంచితా బసు) అని వుంటుంది. ఆమెని ఇష్టపడుతుంటాడు. తను కూడా పవన్ ఫ్యానే అని, ఎలాగైనా టికెట్ కావాలని ఆమె అడుగుతుంది. ఆమె మీద ఇష్టంతో శీను ఎలాగైనా టికెట్లు సంపాదించాలని కదనరంగంలోకి దూకుతాడు. అలా దూకిన శీను టికెట్లు సంపాదించాడా లేదా? దీని కోసం ఎలాటి సాహసాలు చేశాడు? ఇద్దరూ కలిసి సినిమా చూశారా? లయతో ఇష్టం ప్రేమగా మారిందా? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి.

ఎలావుంది కథ

2000 నుంచి ఓ అయిదారేళ్ళ పాటు చిత్రం, నువ్వే కావాలి మొదలైన లైటర్ వీన్ ప్రేమ సినిమాల పేరుతో కుప్పతెప్పలుగా వచ్చి పడ్డ యూత్ సినిమాలు ఎలా వుండేవో, అదే కాలంలో ఈ కథని స్థాపించిన సినిమా కూడా నాటి సినిమాల్లాగే వుంది. నాటి సినిమాల స్పెషాలిటీ ఏమిటంటే, లైటర్ వీన్ అని కథ ఎక్కడో క్లయిమాక్స్ లో వుండేది. అంతసేపూ కథలేకుండా లవర్స్ తో పైపై కామెడీలే. క్లయిమాక్స్ దగ్గర్లో కాస్తంత కథ పుట్టి, ప్రేమికులు సమస్యలో పడి, ఓ అయిదు పది నిమిషాలు బాధపడి, ఆ సమస్య తీరిపోయి సుఖాంతమవడం ఈ సినిమాల ధోరణి. అందువల్ల ఇవి మిడిల్ మాటాష్ స్క్రీన్ ప్లే అయ్యాయి. రాను రాను ఇవి బోరుకొట్టి, ఐదేళ్ళ తర్వాత ట్రెండ్ పరిసమాప్తమైనా, కొన్ని పెద్ద స్టార్ల సినిమాలు కూడా ఇలాగే తీస్తూ అట్టర్ ఫ్లాపయ్యారు. 2015 లో రవితేజతో 'బెంగాల్ టైగర్' కూడా ఇలాగే తీసి అట్టర్ ఫ్లాపయ్యారు.

ఇప్పుడు 'ఫస్ట్ డే ఫస్ట్ షో' తో ఇదే సమస్య. కేవలం హీరోయిన్ కోసం హీరో టికెట్లు సంపాదించే లైటర్ వీన్ కథ. దీన్ని 2001 లో చూసేవాళ్ళేమో గానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు షార్ట్ ఫిలింకి సరిపోతుంది. అయితే కథలేని కథల్ని రెండు గంటల సినిమాగా సాగదీసే విధానం కూడా వుంది. ఈ సినిమా కథకుడు ఈ జానర్ ని రీసెర్చ్‌ చేయలేదు. చేసి వుంటే హాలీవుడ్ లో ఇలాంటి పలచని కథల్ని ఆద్యంతం సంక్లిష్టం చేసి నిలబెడతారని తెలిసేది. అదే చిక్కటి కథల్ని హాలీవుడ్ రచయితలు తేలికపాటు చేస్తారు. కానీ తెలుగులో ఇంకా పలచని కథని పలచగానే తీసి పదేపదే దెబ్బ తింటున్నారు.

అసలు కథ వుందా అన్పించే సక్సెస్ అయిన హాలీవుడ్ సినిమాలు- కాఫీ అండ్ సిగరెట్స్, ది బ్రేక్ ఫాస్ట్ క్లబ్, లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్, ది స్ట్రెయిట్ స్టోరీ, బిఫోర్ సన్సెట్.. ఇలా చాలా వున్నాయి. 'ఫస్ట్ డే ఫస్ట్ షో' లో కేవలం టికెట్లు పొందే విషయం లేని కథనే చివరంటా సాగదీయడంతో, టికెట్ల కోసమే చివరంటా కామెడీలు చేయడంతో, కథ అంతసేపు నిలబడడం కష్టమైపోయింది. టికెట్ల కోసం ప్రారంభమైన కథ ఇంకేదో సమస్య తర్వాత సమస్యగా, సంక్లిష్టమవుతూ పోయే హాలీవుడ్ స్కీముని అనుసరించి వుంటే ఇలా జరిగేది కాదు. ఎంత సేపూ టికెట్ల గోలతో ప్రేమ కథని కూడా సరిగా చూపించలేదు. టికెట్ల కథతో కూడా నమ్మకం లేనట్టు - ఇక పవనే కాపాడాలన్నట్టు పవన్ కళ్యాణ్ మీద ఆధారపడ్డారు. ఎప్పుడు చూసినా పవన్ మీద డైలాగులు, పోస్టర్లూ ఇవే కన్పిస్తాయి పవర్ స్టార్ ని ప్రమోట్ చేయడానికి సినిమా తీసినట్టు!

కామెడీ కూడా కాసేపటికి విషయం లేక ఆవిరైపోయింది. అర్థం పర్థం లేని గోల కామెడీతో నింపేశారు. శవం సీను, టపాసులు విసిరే సీను నవ్వించకపోగా కోపం తెప్పిస్తాయి. ఎలాపడితే అలా చూపిస్తే ప్రేక్షకులు నవ్వుతారనుకున్నారేమో. క్రియేటివిటీ పూర్తిగా కొరవడి వెటకారంగా తయారైంది టికెట్ల కోసం కామెడీ. లాజిక్ లేని మైండ్ లెస్ కామెడీలు తీయొచ్చు. అయితే దానికి విచిత్ర మనస్తత్వాలున్న పాత్రలుండాలి. హిందీలో రోహిత్ శెట్టి 'గోల్ మాల్' సిరీస్ సినిమాలు స్టార్స్ తో నాలుగు తీశాడు. కరీనా కపూర్, అజయ్ దేవగన్‌, తుషార్ కపూర్, శ్రేయాస్ తల్పడే లవి విచిత్ర క్యారెక్టర్లు. వీళ్ళ మైండ్ లెస్ కామెడీలు ఎన్నిసార్లు చూసినా కొత్తగానే వుంటాయి. సిరీస్ లో నాల్గూ హిట్టయ్యాయి. ఇంకోటి రాబోతోంది. 'జాతిరత్నాలు' దర్శకుడు రాసిన ఈ కథలో ఒకసారి చూసి భరించగల కామెడీ కూడా లేదు. కథ అసలే లేదు. కాస్త నవ్వించేది వెన్నెల కిషోర్ కామెడీయే.

నటనలు – సాంకేతికాలు

హీరోగా నటించిన శ్రీకాంత్ రెడ్డి నటనకి ఇంకా కొత్త. ఇప్పుడే టైమింగ్ తో కూడిన కామెడీ నటించడం కష్టం. పూర్తి స్థాయి కామెడీ సినిమాని హీరోగా తను నిలబెట్టలేడు. ఇంకా చాలా టైమ్ పడుతుంది. అంతవరకూ ఇతర సినిమాలు చేసుకోవడమే. హీరోయిన్ సంచిత సోషల్ మీడియాలో టాప్ వీడియోలు చేసింది గానీ, ఇక్కడ నటించడానికి సరైన పాత్రలేక, వున్న పాత్ర కూడా నిడివి తక్కువ కావడంతో కంటికి ఆనలేదు. ఇందాక చెప్పుకున్నట్టు వెన్నెల కిషోర్ తన అనుభవంతో కొన్ని సీన్లు నిలబెట్టాడు. ఇంకా చాలా మంది కమెడియన్లూ, సహాయ నటులూ వున్నారు గానీ, విషయమే లేకపోతే ఏం నటిస్తారు. ఇకపోతే రధన్ సంగీతంలో పాటలు బావున్నాయి. వాటి చిత్రీకరణ బాగుంది. శ్రీకాంత్ ఛాయాగ్రహణం బాగుంది. జంట దర్శకులు దర్శకత్వం గురించి ఇంకా చాలా నేర్చుకోవాల్సి వుంది. ఏమైనా ధైర్యం చేసి ఈ కొత్త టాలెంట్స్ చేతిలో బడ్జెట్ పెట్టి, సినిమా తీసిన ప్రముఖ నిర్మాణ సంస్థని అభినందించాలి.

Tags:    
Advertisement

Similar News