Falling for Christmas Review: 'ఫాలింగ్ ఫర్ క్రిస్మస్' - సండే స్పెషల్ రివ్యూ!

Falling for Christmas Review: ప్రస్తుతం ‘ఫాలింగ్ ఫర్ క్రిస్మస్’ నెట్ ఫ్లిక్స్ టాప్ స్ట్రీమింగ్ గావుంది. కారణం హాలీవుడ్ స్టార్ లిండ్సే లోహన్ నటించడం. ఈమె పదేళ్ళ క్రితం సినిమాలు ఫ్లాపై కనుమరుగైంది. ఇప్పుడు చాలా తేలికపాటి క్రిస్మస్ రోమాన్స్ తో క్రిస్మస్ కి గ్లామర్ తెస్తూ తెరపై కొచ్చింది.

Advertisement
Update:2022-12-18 14:59 IST

Falling for Christmas Review: ‘ఫాలింగ్ ఫర్ క్రిస్మస్’ - సండే స్పెషల్ రివ్యూ! 

క్రిస్మస్ వచ్చిందంటే హాలీవుడ్ నుంచి క్రిస్మస్ సినిమాలొస్తాయి. క్రిస్మస్ వచ్చిందంటే అమెరికాలో నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ కంపనీ (ఎన్ బి సి) ఛానెల్ 1946 నాటి క్లాసిక్ 'ఇట్స్ ఏ వండర్ఫుల్ లైఫ్' క్రమం తప్పకుండా ప్రసారం చేస్తూ వుండాల్సిందే. మన దగ్గర కొంతకాలం క్రితం వరకూ నవమికి 'లవకుశ' టీవీ ఛానెల్స్ లో ప్రసారం చేసినట్టు. 'ఇట్స్ ఏ వండర్ఫుల్ లైఫ్' డిసెంబర్ 24 రాత్రి ఎనిమిది గంటలకి ఎన్ బి సి లో ప్రసారం కాబోతోంది. మరో ఛానెల్ 'ఈ' లో 24 గంటల పాటూ ప్రసారమవుతూనే వుంటుందట. వరుసగా మూడేళ్ళు క్రిస్మస్ కి విడుదలవుతూ వచ్చిన 'ది ప్రిన్సెస్ స్విచ్' సీక్వెల్స్ లో నాల్గోది ఈ క్రిస్మస్ కి రాలేదు. ఇప్పుడు లిండ్సే లోహన్ నటించిన 'ఫాలింగ్ ఫర్ క్రిస్మస్' క్రిస్మస్ మూడ్ ని పెంచుతూ వచ్చేసింది. సాధారణంగా క్రిస్మస్ సినిమాలు ఫ్యామిలీ- రోమాంటిక్ ఎంటర్ టైనర్లుగా వస్తాయి. ఈసారి ఇంకో క్రిస్మస్ సినిమా కాస్త తేడాగా 'హూ కిల్డ్ శాంటా' అంటూ మర్డర్ మిస్టరీ కామెడీగా వచ్చింది. వచ్చేవారం దీని రివ్యూ చూద్దాం.

ప్రస్తుతం 'ఫాలింగ్ ఫర్ క్రిస్మస్' నెట్ ఫ్లిక్స్ టాప్ స్ట్రీమింగ్ గావుంది. కారణం హాలీవుడ్ స్టార్ లిండ్సే లోహన్ నటించడం. ఈమె పదేళ్ళ క్రితం సినిమాలు ఫ్లాపై కనుమరుగైంది. ఇప్పుడు చాలా తేలికపాటి క్రిస్మస్ రోమాన్స్ తో క్రిస్మస్ కి గ్లామర్ తెస్తూ తెరపై కొచ్చింది. దీనికి జనీన్ డమైన్ దర్శకత్వం వహించింది. ఈమె కొత్త దర్శకురాలు. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ దేశ భాషల్లో కేవలం హిందీలోనే అందుబాటులో వుంది. ఇదెలా వుందో చూద్దాం...

గొప్పింటి కూతురు గల్లంతు

మంచు కొండల్లో మిస్టర్ బెల్మౌంట్ కి ఒక లగ్జరీ హోటల్ వుంటుంది. ఈ హోటల్ కి కూతురు సియారాని అట్మాస్ఫియర్ వైస్ ప్రెసిండెంట్ గా నియమించి బిజినెస్ టూర్ వెళ్ళి పోతాడు. బిజినెస్ మీద ఏమాత్రం ఆసక్తి లేని సియారా, బాయ్ ఫ్రెండ్ టాడ్ తో మంచు

కొండల్లో స్కయింగ్ కి వెళ్తుంది. టాడ్ ఇక ఆగలేక ఆమెకి ప్రపోజ్ చేసి వెడ్డింగ్ రింగ్ తొడుగుతాడు. ఇంతలో అట్మాస్ఫియర్ లో మార్పులొచ్చి పెద్ద గాలి వీచడంతో సియారా బ్యాలెన్సు తప్పుతుంది. టాడ్ ఆమెని పట్టుకోబోతే ఉంగరం వూడి చేతి కొస్తుంది. ఆ అట్మాస్ఫియర్ లో అట్మాస్ఫియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన సియారా కొండ మీంచి జారి గల్లంతై ఎక్కడో వెళ్ళి పడుతుంది. టాడ్ ఇంకెక్కడో వెళ్ళి పడతాడు.

అట్నుంచి జేక్ వస్తూంటాడు. ఇతను అటు చాలా దూరంలో నార్త్ స్టార్ లాడ్జి ఓనర్ గా తీవ్ర నష్టాల్లో వుంటాడు. స్పృహ తప్పి పడున్న సియారాని చూసి తీసికెళ్ళి లాడ్జిలో పడుకోబెడతాడు. అతడికో కూతురు ఎవీ, అత్తగారు వుంటారు. కళ్ళు తెరిచిన సియారా తనెవరో జ్ఞాపక శక్తిని కోల్పోతుంది. అటు మంచు కొండల్లో ఎటో తప్పిపోయి సహాయం కోసం చూస్తూంటాడు టాడ్. ఇలా క్రిస్మస్ రోజుల్లో దూరమైన ప్రేమ జంట, మధ్యలో జేక్, అటు సియారా కోసం వెతుకుంటున్న మిస్టర్ బెల్మౌంట్, హోటల్ సిబ్బంది, పోలీసులూ... ఈ మూడు పరిస్థితులూ ఏ ముగింపుకి చేరాయన్నది మిగతా కథ.

జ్ఞాపక శక్తిని కోల్పోయిన సియారాకి జేక్ కి ఎలా దగ్గరైంది, భార్య చనిపోయిన జేక్ కూతురు ఎవీ ప్రోత్సాహంతో సియారా కెలా దగ్గరయ్యాడు, ఈ ప్రేమ కథ ఇక్కడ పురులు విప్పుకుంటున్న వేళ చచ్చీ చెడీ ఎలాగో చేరుకున్న టాడ్ పరిస్థితేమిటి, కూతురి జాడ కనుక్కుని వచ్చిన బెల్మౌంట్ తీసుకున్న నిర్ణయమేంటీ...ఇవి కూడా మిగతా లైటర్ వీన్ ఫన్నీ స్టోరీలో తెలుస్తాయి.

లిండ్సే మెయిన్ ఎట్రాక్షన్

లిండ్సే లోహన్ అద్భుత గ్లామర్ తో, కాస్ట్యూమ్స్ తో, సరదా నటనతో పండగ సినిమాని మనోహరంగా మార్చేస్తుంది. క్రిస్మస్ సినిమాలు ఎలా తీయాలో కొన్ని నియమాలు పెట్టుకున్నారు. సినిమా అంతా నేపథ్యంలో క్రిస్మస్ వాతావరణం, విందులు, వినోదాలు, సంగీతం వుంటాయి. కథలో కుటుంబాలుంటాయి. కుటుంబాల్లో హీరోహీరోయిన్ల ప్రేమ కథలుంటాయి. ఎవరు చూసినా నవ్వుతూ వుంటారు. బరువైన సెంటిమెంట్లు, బాధలు, ఏడ్పులు అస్సలుండవు. నవ్వు పుట్టించే గమ్మత్తయిన సీన్లు వుంటాయి. ప్రేమ కథ తియ్యటి మిఠాయిలా పైపైన లైటర్ వీన్ గా వెళ్ళి పోతూంటుంది. ప్రేమ కథలో ప్రేమిస్తున్న మూడో పాత్ర వుంటే, ఓకే నో ప్రాబ్లం అని, న్యూసెన్స్ చేయకుండా లైట్ తీసుకుని తప్పుకుంటుంది. మొత్తం మీద ఫార్ములా కథలే తప్ప కొత్తగా ఏం వుండదు. తీసిన విధానం క్రిస్మస్ స్పెషల్ లాగా వుంటుంది.

ఇవన్నీ ఈ క్రిస్మస్ మూవీలో ఎంజాయ్ చేయవచ్చు. తెలుగులో సంక్రాంతి సినిమాలని, దీపావళి సినిమాలనీ వస్తూంటాయి. వీటిలో భారీ ఖడ్గాలు పట్టుకుని తిరగడం, నరకడం, రక్తాలు పారించడం వుంటాయి. శుభమాని పండగ పూట ఈ బీభత్సాలకి అలవాటు పడ్డారు ప్రేక్షకులు. మన ప్రేక్షకుల తట్టుకునే శక్తి అపారం.

ఎవీ మీదే ఫోకస్

ఎవీ పాత్ర వేసిన బాలనటి ఒలీవియా పెరేజ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది దర్శకురాలు జనీన్. సమూహంలో ఎందరున్నా, వాళ్ళ సంభాషణలు నడుస్తూంటే, ఒలీవియా మీదే ఫోకస్ చేసి ఆమె రియాక్షన్ షాట్సే వేస్తూంటుంది. కారణం ఈ బాలనటి స్మైల్ ప్రేక్షకుల మూడ్ ని వెలిగించేసేలా వుంటుంది. ఈ బాక్సాఫీసు కిటుకు పట్టుకుంది కొత్త దర్శకురాలు.

ఇక జేక్ గా నటించిన కార్డ్ ఓవర్ స్ట్రీట్, టాడ్ గా నటించిన జార్జి యంగ్ టీవీ నటులే. మిస్టర్ బెల్మౌంట్ గా నటించిన జాక్ వాగ్నర్ రిచర్డ్ గేర్ పోలికలతో వుంటాడు. ఈ గంటన్నర ఎంటర్ టైనర్ లో మొత్తం 30 పాటలున్నాయి. ఇవి రవంత బిట్లుగా వచ్చిపోతూంటాయి. పూర్తిగా క్రిస్మస్ వేడుకల వాతావరణంతో, రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతో, మంచు ప్రాంతంలో, అద్భుత సెట్ డిజైన్లతో, మేకింగ్ ఏ కంప్యూటర్ గ్రాఫిక్స్ మాయాజాలానికీ తీసిపోనట్టుగా కనువిందు చేస్తుంది 'ఫాలింగ్ ఫర్ క్రిస్మస్'.

Tags:    
Advertisement

Similar News