Dunki Movie Review | ‘డంకీ’ – మూవీ రివ్యూ{2.5/5}

ఈ సంవత్సరం ‘పఠాన్’, ‘జవాన్’ అనే రెండు బ్లాక్ బస్టర్స్ నటించిన షారుఖ్ ఖాన్ మూడో ప్రయత్నంగా ఎమోషనల్ డ్రామా ‘డంకీ’ తో ప్రపంచ ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

Advertisement
Update:2023-12-21 16:58 IST

చిత్రం: డంకీ

దర్శకత్వం : రాజ్ కుమార్ హిరానీ

తారాగణం : షారుఖ్ ఖాన్, తాప్సీ పన్నూ, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చార్, అనిల్ గ్రోవర్ బొమన్ ఇరానీ తదితరులు

రచన : రాజ్ కుమార్ హిరానీ, అభిజాత్ జోషీ, కణికా ధిల్లాన్,

సంగీతం (పాటలు) : ప్రీతమ్ , నేపథ్య సంగీతం : అమన్ పంత్; ఛాయాగ్రహణం : మురళీ ధరన్, మానుష్ నందన్

బ్యానర్స్ : జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్, రాజ్ కుమార్ హిరానీ ఫిలిమ్స్

నిర్మాతలు : గౌరీ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ, జ్యోతీ దేశ్ పాండే

విడుదల : డిసెంబర్ 21, 2023

రేటింగ్: 2.5/5

ఈ సంవత్సరం ‘పఠాన్’, ‘జవాన్’ అనే రెండు బ్లాక్ బస్టర్స్ నటించిన షారుఖ్ ఖాన్ మూడో ప్రయత్నంగా ఎమోషనల్ డ్రామా ‘డంకీ’ తో ప్రపంచ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అలాగే వరస హిట్లు అందిస్తూ వస్తున్న దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఐదేళ్ళ తర్వాత మరోకొత్త కానుక అందించే ప్రయత్నంతో అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుని వచ్చాడు. అయితే ఈ అస్త్రాలు పని చేశాయా? లేక అస్త్రసన్యాసానికి దారితీశాయా? ఈ ఇంపార్టెంట్ విషయం తెలుసుకుందాం...

కథ

పంజాబ్ లోని ఓ ఊళ్ళో మనూ (తాప్సీ పన్నూ), సుఖీ (విక్రమ్ కౌశల్), బుగ్గూ (విక్రమ్ కొచ్చర్), బల్లీ (అనిల్ గ్రోవర్) ముగ్గురూ ఆర్ధిక సమస్యలతో వుంటారు. వీళ్ళ కలలు లండన్లో వుంటాయి. కానీ వెళ్ళడానికి చదువుల్లేవు, డబ్బుల్లేవు. నకిలీ వీసా ఏజెన్సీలని ఆశ్రయించి మోసపోతారు. ఈ సమయంలో పఠాన్ కోట్ నుంచి ఆర్మీ జవాన్ హర్ దయాళ్ సింగ్ అలియాస్ హార్డీ సింగ్ (షారుఖ్ ఖాన్) ఊళ్ళోకొస్తాడు. తనని కాపాడిన మనూ అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పి, అతడి టేప్ రికార్డర్ ఇచ్చిపోదామని వస్తాడు. ఆ అన్నయ్య చనిపోయాడని తెలుసుకుని మనూ అండ్ ఫ్రెండ్స్ ని లండన్ పంపి ఆదుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ ముగ్గురూ ఇంగ్లీషు నేర్చుకుని స్టూడెంట్స్ వీసా మీద వెళ్దామనుకుంటారు. కానీ బల్లీకి తప్ప ఇంకెవరికీ వీసాలు రావు.

అయినా ఎలాగైనా లండన్ వెళ్ళేందుకు హర్డీ సాయపడాలనుకుంటాడు. దీంతో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ గా డంకీ (డొంకదారి/అడ్డదారి) రూట్లో దేశాలు దాటుకుంటూ అక్రమంగా లండన్ చేరేందుకు బయల్దేరతారు. ఈ క్రమంలో ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని ప్రమాదాలెదుర్కొన్నారు, ఇలా వలస వెళ్ళిన చొరబాటు దార్ల పరిస్థితి చివరి కేమవుతుంది - అన్నవి తెలిపేదే మిగతా కథ.

ఎలావుంది కథ

డంకీ ఫ్లయిట్ అని పంజాబ్ లో పాపులరైన పదం. అమెరికా, కెనడా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో అక్రమ ప్రవేశాలకి సంబంధించి వాడే ఇమ్మిగ్రేషన్ టెక్నిక్ ఇది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ టెక్నిక్ ని అనుసరిస్తారు. అంతర్జాతీయ ప్రయాణాల ఆకర్షణ, విదేశాల్లో స్థిరపడి ఇంటికి డబ్బులు పంపాలనే కలల కారణంగా ఈ అక్రమ వలసలకి పాల్పడతారు. ఇందులో చాలా కష్టాలు, మోసాలు, పట్టివేతలు, జైల్లో మగ్గడాలూ వుంటాయి.

2017 లో మలయాళంలో దుల్కర్ సల్మాన్ అమెరికా వెళ్ళే ఇలాటి కథతో ‘కామ్రేడ్ ఇన్ అమెరికా’, 2022 లో పంజాబీలో మరో అమెరికా అక్రమ వలసల కథ ‘ఆజా మెక్సికో చలియే’ విడుదలయ్యాయి. ఇప్పుడు ‘డంకీ’ మూడోది. కాబట్టి ఇది దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ అందించిన కొత్త కాన్సెప్టు ఏమీ కాదు, అతడి గత సినిమాల్లాగా. అలాగే గత సినిమాల కంటే ఇది బలహీన సినిమా.

మున్నాభాయ్ ఎంబీబీఎస్, పీకే, త్రీ ఇడియట్స్, సంజు లాంటి బలమైన సూపర్ హిట్స్ అందించిన హిరానీ ఈసారి బలహీన పడ్డాడు. ఈసారి ఏమైందో తన బ్రాండ్ రచన చేయలేకపోయాడు. కాలానికి తగ్గ రచనకి బదులు తొమ్మిదేళ్ళ నాటి ‘పీకే’ స్టయిల్ దగ్గర ఆగిపోయాడు. పైగా కొట్టొచ్చినట్టూ రచనలో డెప్త్ కోల్పోయాడు. అస్త్రాల వాడి తగ్గింది. ఆస్థాన రచయితల్ని మార్చి కొత్తతరం నుంచి వర్క్ తీసుకుని వుంటే వేరేగా వుండేది.

ఫస్టాఫ్ ఊళ్ళో సమస్యలూ, హాస్యాలూ వగైరాలతో కథలోకి వెళ్ళకుండా కాలక్షేపం చేయడం వరకూ, అక్కడక్కడా పాత వాసన వేసినా ఫర్వాలేదపిస్తాడు. పైగా గత యాక్షన్ సినిమాలకి భిన్నంగా షారుఖ్, ఈసారి సాఫ్ట్ రోల్ లో చాలా కాలం తర్వాత కామెడీ చేయడం వెరైటీని తీసుకొస్తుంది. ఈ ఫస్టాఫ్ కథ పాతికేళ్ళ నాటి ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు 50 ఏళ్ళ వయస్సులో షారుఖ్ తోపాటు ఇతరులు గతాన్ని తల్చుకోవడంతో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది. ఇలా ‘త్రీ ఇడియట్స్’ ట్రీట్ మెంట్ నే అనుసరించాడు హిరానీ. అయితే విక్కీ కౌశల్ పాత్ర ఆత్మహత్యతో బలమైన ఎమోషనల్ ఇంటర్వెల్ తో ఫస్టాఫ్ ముగుస్తుంది.

సెకండాఫ్ కూడా ఈ ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూ అవుతుంది. క్లయిమాక్స్ లో ప్రస్తుతానికొచ్చి ఓ సందేశంతో ముగుస్తుంది. ఈ సెకండాఫ్ లోనే కథ ప్రారంభమవుతుంది. ఫస్టాఫ్ నవ్వించాక, సెకండాఫ్ ఏడ్పించే కథ.

అక్రమంగా దేశాలు దాటేటప్పుడు పడ్డ బాధలు. పాకిస్తాన్, ఇరాన్, టర్కీ లద్వారా ఇంగ్లండ్ లో ప్రవేశించే ప్రయత్నాలు క్లుప్తంగా చూపించేసి అసంతృప్తి కల్గిస్తాడు. ఇంగ్లాండ్ లో ఇల్లీగల్ గా బతికే వారి కష్టాల మీదే ఎక్కువ ఫోకస్ చేశాడు. ప్రేక్షకుల చేత కన్నీళ్ళు పెట్టించడంలో మాత్రం సఫల మయ్యాడు. లండన్లో షారుఖ్ ఖాన్ కోర్టులో చేసే ప్రసంగాన్ని దేశభక్తి, సరిహద్దులు, వీసాలు, పేదల కష్టాలూ వగైరా అంశాలతో బలంగా చూపించినా, ఎందుకో ఆ డైలాగులు గుండెల్లోంచి వస్తున్నట్టు వుండవు. మళ్ళీ క్లయిమాక్స్ చాలా ఎమోషనల్ గా వుంటుంది.

సెకండాఫ్ ఇంత భారంగా కాకుండా, దేశాలు దాటే ఎడ్వంచర్స్ కి ఎక్కువ కవరేజి ఇచ్చి, ఆతర్వాత ఏడ్పించే కథ క్లుప్తంగా ముగించి క్లయిమాక్స్ వెళ్తే ఎంటర్ టైన్మెంట్ కి ఎక్కువ అవకాశముండేది. అక్రమంగా విదేశాలకెళ్ళి సంపాదించాలనే బంగారు జీవితాల్ని కలలు గనే ఇలాటి కథని - నిధికోసం వేట తాలూకు చేసే సాహసాలతో కూడినా ట్రెజర్ హంట్ జానర్ లో తీసివుంటే, రాజ్ కుమార్ గత సినిమాల్లాగా వినోదాత్మక సందేశం లాగా వుండేది.

అమెరికన్ పర్వతాల్లో బంగారు గనులు తవ్వుకుందామని బయల్దేరే బృందాలతో హాలీవుడ్ క్లాసిక్ ‘మెకన్నాస్ గోల్డ్’ లాగా. తీరా పర్వతాల్లోకి చేరాక భూకంపం రావడం! ఇలాగే బంగారు గనులు తవ్వుకుందామని లండన్ బయల్దేరే పాత్రల సాహసాలు చూపించి, చివర్లో లండన్లో కలలు కల్లలయ్యే భూకంపం లాంటి కష్టాలతో ఓ సందేశ మివ్వాల్సింది.

నటనలు - సాంకేతికాలు

ఫస్టాఫ్ నవ్వించి, సెకండాఫ్ ఏడ్పించే రెండు కోణాల్లో షారుఖ్ మాత్రమే ఈ సినిమాకి ఏదైనా వుంటే ఆకర్షణ. ‘కల్ హోనా హో’ తర్వాత గుర్తుండే నటన. పాతికేళ్ళ వయసులో, 50 ఏళ్ళ వయసులో రెండు పాత్రలతో మెప్పిస్తాడు. కానీ సందేశం ‘జవాన్’ లో ఇచ్చిన పోలిటికల్ స్పీచ్ అంత ప్రభావశీలంగా లేకపోవడం లోపం.

తాప్సి కూడా యంగ్, ఓల్డ్ రెండు పాత్రల్లో తన ఎమోషనల్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటుంది. అందరికంటే ఎక్కువ ముద్ర వేసేది విక్కీ కౌశల్ పాత్ర, నటన. ఓ పదిహేను నిమిషాలు తన సొంతం చేసుకుని గడగడ లాడించేస్తాడు. మిగిలిన పాత్రల్లో విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్, బొమన్ ఇరానీ తదితరులు ఫన్నీ సీన్స్ లో నవ్విస్తారు.

సినిమాలో యాక్షన్ సీన్స్ లేవు. ప్రీతమ్ సంగీతంలో పాటలు కూడా ఈసారి హిరానీ ముద్రతో లేవు. అమన్ పంత్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఈ ఎమోషనల్ డ్రామాకి తగ్గట్టు సహకారం అందించింది. మురళీ ధరన్, మానుష్ నందన్ ల ఛాయాగ్రహణం, ఇతర నిర్మాణ విలువలు హిరానీ స్థాయిలో ఉన్నతంగా వున్నాయి.

దేశంలో ప్రభుత్వాలు బంగారు కలల్ని నిజం చేసుకునే పని కల్పించకుండా, ఉచితాల సంతర్పణ చేస్తున్నంత కాలం, పొట్ట చేతబట్టుకుని విదేశాల్లో పట్టుబడే ప్రతిష్టతో, దేశం బాగానే మూడో బడా ఆర్ధిక శక్తి అన్పించుకుంటుంది!

Tags:    
Advertisement

Similar News