Drishyam 2 Hindi Movie Review: 'దృశ్యం 2' – హిందీ రివ్యూ! {3/5}
Drishyam 2 Hindi Movie Review : 2013 లో మలయాళంలో విడుదలైన ‘దృశ్యం’ తెలుగు, హిందీ రీమేకులు కూడా 2014, 2015 లలో విడుదలై హిట్టయ్యాయి
'దృశ్యం 2' – హిందీ రివ్యూ
దర్శకత్వం : అభిషేక్ పాఠక్
తారాగణం : అజయ్ దేవగణ్, టబు, అక్షయ్ ఖన్నా, శ్రియా శరణ్ తదితరులు
కథ : జీతూ జోసెఫ్, స్క్రీన్ ప్లే : అభిషేక్ పాఠక్, అమీల్ కీయాన్ ఖాన్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : సుధీర్ కె. చౌదరి
బ్యానర్స్ : పనోరమా స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్, టీ-సిరీస్ ఫిల్మ్స్
నిర్మాతలు : భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, ఆంటోనీ పెరుంబవూరు
విడుదల : నవంబర్ 18, 2022
రేటింగ్ : 3/5
2013 లో మలయాళంలో విడుదలైన 'దృశ్యం' తెలుగు, హిందీ రీమేకులు కూడా 2014, 2015 లలో విడుదలై హిట్టయ్యాయి. తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగణ్ నటించారు. తర్వాత 2021 లో 'దృశ్యం 2' తెలుగు రీమేక్ లాక్ డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలై హిట్టయ్యింది. హిందీ రీమేక్ ఈవారం విడుదలైంది. దీనికి అభిషేక్ పాఠక్ కొత్త దర్శకుడు. నిజానికి 'దృశ్యం', 'దృశ్యం2' మలయాళ ఒరిజినల్స్ దర్శకుడు జీతూ జోసెఫ్ 'దృశ్యం' కంటే, 'దృశ్యం2' నే ఎక్కువ పకడ్బందీగా తీశాడు. ఫ్యామిలీ క్రైమ్ డ్రామా విలువలు ఇందులో ఎక్కువున్నాయి. తెలుగులో 'దృశ్యం2' ని వెంకటేష్ తో తనే రీమేక్ చేసి ఆ విలువల్ని కాపాడాడు. ఇప్పుడు హిందీ రీమేక్ లో కొత్త దర్శకుడు ఆ విలువల్ని కాపాడాడా లేదా తెలుసుకుందాం...
కథ
'దృశ్యం' లో కేబుల్ టీవీ ఆపరేటర్ అయిన విజయ్ సల్గావ్కర్ (అజయ్ దేవగణ్) ఇప్పుడు థియేటర్ ఓనర్ గా, సినిమా తీయాలనుకుంటున్న ప్రొడ్యూసర్ గా ఎదిగి వుంటాడు. ఇతడికి భార్య నందిని (శ్రియా శరణ్), కూతుళ్ళు అంజూ, అనూ (ఇషితా దత్తా, మృణాల్ జాదవ్) వుంటారు. తను ఓ రచయిత (సౌరభ్ శుక్లా) తో కలిసి సినిమా కథ కూడా రాస్తూంటాడు. ఏడేళ్ళ క్రితం 'దృశ్యం' లో పోలీస్ ఐజీ మీరా దేశ్ ముఖ్ (టబు) కొడుకు శ్యామ్ అదృశ్యం కేసులో అనుమానితుడైన విజయ్ కుటుంబాన్ని ఆ కేసు భయం ఇంకా వెన్నాడుతూ వుంటుంది. కూతురి కోసం కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో శ్యామ్ ని చంపి కుటుంబాన్ని కాపాడుకున్నాడు విజయ్. శవం ఎంతకీ దొరక్కుండా మాయం చేశాడు.
ఇప్పటికీ కోల్డ్ కేసుగా వున్న ఆ కేసుని ఇప్పుడు పోలీసులు తిరగ దోడడం ప్రారంభిస్తారు. దీంతో విజయ్ కుటుంబం తిరిగి ప్రమాదంలో పడుతుంది. ఇప్పుడు కొత్త ఐజీ తరుణ్ అహ్లావట్ (అక్షయ్ ఖన్నా) శ్యామ్ అదృశ్యం కేసులో కొత్త సాక్ష్యాధారాలు సేకరించి విజయ్ ని ట్రాప్ చేస్తాడు. ఇప్పుడు విజయ్ ఏం చేశాడు? సినిమా కథ అల్లడంలో మంచి టాలెంట్ చూపిస్తున్న తను, ఇప్పుడు ఏఏ కథల్ని అల్లి పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టి మళ్ళీ విజయవంతంగా కుటుంబాన్ని రక్షించుకున్నాడు? ఇదీ మిగతా కథ.
ఎలావుంది కథ
'దృశ్యం 2' వెంకటేష్ తో ఎదైతే చూశామో అదే వుంది కథా కథనాలు మార్చకుండా. ఫ్యామిలీ క్రైమ్ డ్రామా విలువలు సురక్షితంగా వున్నాయి. ఈ విలువలే ఈ కథకి ప్రాణం. కేసు దర్యాప్తుతో ఇంటలెక్చువల్ విలువలు- అపరాధ భావంతో పౌర విలువలు. ఈ రెండిటి హోరాహోరీ. ఫస్టాఫ్ కథనం 40 నిమిషాలు మాత్రం ఒరిజినల్లో లాగే అత్యంత మందకొడిగా సాగుతుంది. ఈ నిడివిని ఆక్రమిస్తూ, కేసు భయంతో ఇంకా కూతుళ్ళు మానసిక వేదన అనుభవించే దృశ్యాలు, విజయ్ ని భార్య నందిని సున్నితంగా సాధించే దృశ్యాలూ, రహస్యంగా పోలీసులు దర్యాప్తు చేసే దృశ్యాలూ ఒక క్రమ పద్ధతిలో వస్తూంటాయి డ్రామాని బిల్డప్ చేస్తూ.
చనిపోయిన శ్యామ్ తండ్రి, మాజీ ఐజీ మీరా దేశ్ ముఖ్ భర్త మహేష్ దేశ్ ముఖ్ (రజత్ కపూర్) కూడా వచ్చి, శ్యామ్ అస్థికలైనా ఇప్పించమని విజయ్ ని ప్రాధేయపడే ఎమోషనల్ దృశ్యాన్ని - విజయ్ గిల్టీ ఫీలింగ్ ని పతాక స్థాయికి చేర్చే బలమైన భావోద్వేగ దృశ్యంగా ఎస్టాబ్లిష్ చేశాడు కొత్త దర్శకుడు పాఠక్ కూడా.
ప్రొఫెషనల్ గా, ఒక అర్ధవంతంగా సాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ధాటికి విజయ్ డిఫెన్స్ లో పడిపోయి- దీన్నెదుర్కొంటూ సినిమా కథలు చెప్పే కాబోయే నిర్మాత తెలివి తేటలతో- పోలీసులకి చెక్ పెట్టే దృశ్యాలూ థ్రిల్ చేస్తాయి. కథనం, దాని చిత్రీకరణ, నేపథ్య సంగీతం ఒక ఫీల్ తో డిఫరెంట్ అనుభవాన్నిస్తాయి. మలయాళ దర్శకుడి 'దృశ్యం2' తెలుగు రీమేక్ కి తీసిపోకుండా హిందీ రీమేక్ చేసి విజయవంతంగా ప్రెజెంట్ చేశాడు కొత్త దర్శకుడు. ఇక క్లయిమాక్స్, ముగింపూ అసాధారణమైనవే మేధస్సుకి పని పెడుతూ.
నటనలు – సాంకేతికాలు
ప్రమాదంలో పడ్డ కుటుంబాన్ని తిరిగి కాపాడుకునే రాజీ లేని తెగువ ప్రదర్శించే విజయ్ పాత్రలో అజయ్ దేవగణ్ వెంకటేష్ కి తీసిపోకుండా నటించాడు. అసలీ పాత్రకి మౌలికంగా ప్రాణ ప్రతిష్ట చేసింది మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. ఆ వారసత్వాన్ని కాపాడుతున్నారు. ఒక ఫ్యామిలీ మాన్ గా హెవీ కమర్షియల్ ఎమోషన్స్ ప్రదర్శించకుండా, సున్నిత ఫీలింగ్స్ తోనే సైలెంట్ గా చేసుకుపోయాడు అజయ్. పోలీస్ స్టేషన్ లో టబు తనమీద ప్రతాపం చూపించే సన్నివేశంలోనూ తగ్గి నటించాడు. టబు సంధించే ప్రశ్నలకి పోలీస్ స్టేషన్ కెక్కిన తన కుటుంబంతో పడే వేదన, నేరం ఒప్పుకోలేని డైలమా చాలా కాలం తర్వాత అజయ్ దేవగణ్ లోని నటుడ్ని కొత్తగా చూపిస్తుంది. ఎలాటి హైప్, కమర్షియల్ హంగామా, హీరోయిజమూ లేని ఈ బలమైన ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ తో అజయ్ దేవగణ్ కూడా అలా గుర్తుండి పోతాడు.
టబుతో బాటు శ్రియా శరణ్, ఇషితా, మృణాల్, అక్షయ్ ఖన్నాలది కూడా ఎక్సెలెంట్ నటనలే. ఈ క్రైమ్ డ్రామాలో ఎలాటి అరుపులు, కేకలు లేకుండా; హింసా, దానికి సంబంధించి చెవులు పగిలే బిజిఎం లేకుండా సైలెంట్ గా సాగిపోయే ఈ మూవీ- నిజ జీవితంలా వుంటుంది.