Decision to Leave Movie Review: ‘డెసిషన్ టు లీవ్’- సండే స్పెషల్ రివ్యూ!

Decision to Leave Movie Review: ‘డెసిషన్ టు లీవ్’ ప్రసిద్ధ కొరియన్ దర్శకుడు పార్క్ చాన్ వూక్ తీసిన మాస్టర్ పీస్ అంటున్నారు. 2022 కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో అతను ఉత్తమ దర్శకుడుగా ఎంపికయ్యాడు.

Advertisement
Update:2023-01-22 12:07 IST

Decision to Leave Movie Review: ‘డెసిషన్ టు లీవ్’- సండే స్పెషల్ రివ్యూ!

95 వ ఆస్కార్ అవార్డ్సు పోటీల్లో ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం విభాగంలో షార్ట్ లిస్ట్ అయిన 15 సినిమాల్లో కొరియన్ మూవీ ‘డిసిషన్ టు లీవ్’ ఒకటి. 92 దేశాలు పంపిన చలన చిత్రాల్లో మన దేశపు ‘చెల్లో షో’ కూడా షార్ట్ లిస్ట్ అయిన విషయం తెలిసిందే. షార్ట్ లిస్టయిన 15 సినిమాల్లోంచి ఫైనల్ నామినీలుగా 5 సినిమాల్ని ఎల్లుండి అంటే జనవరి 24 న ప్రకటిస్తారు. గెలుపు గుర్రాన్ని మార్చి 12న జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో ప్రకటిస్తారు.

‘డెసిషన్ టు లీవ్’ ప్రసిద్ధ కొరియన్ దర్శకుడు పార్క్ చాన్ వూక్ తీసిన మాస్టర్ పీస్ అంటున్నారు. 2022 కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో అతను ఉత్తమ దర్శకుడుగా ఎంపికయ్యాడు. మొత్తం 11 సినిమాలకి దర్శకత్వం వహించిన పార్క్ చాన్ వూక్ వివిధ ఫిలిం ఫెస్టివల్స్ లో 43 అవార్డులు పొందాడు. ప్రస్తుతం ‘డెసిషన్ టు బ్రేకప్’ అనే మూవీ మీద పనిచేస్తున్న పార్క్, ‘డెసిషన్ టు లీవ్’ ని మర్డర్ మిస్టరీ రోమాన్స్ గా తీశాడు. దీని విశేషాలు తెలుసుకుందాం...

హత్యా పరిశోధన ప్రేమ పరిశోధన అయింది...

దక్షిణ కొరియాలోని బుసాన్ లో రిటైర్డ్ ఇమ్మిగ్రేషన్ అధికారి అనుమానాస్పదంగా ఎత్తైన కొండ మీద నుంచి జారిపడి చనిపోయిన కేసు నమోదవుతుంది. చైనీయురాలైన అతడి పడుచు భార్య సూరేని అనుమానిస్తాడు డిటెక్టివ్ హేజున్. భర్త మరణించిన బాధ ఆమెలో కనిపించదు, పైగా ఆమె చేతుల మీద, కాళ్ళ మీదా గాయాలుంటాయి. అడిగితే తన గురించి చెప్తుంది. తను భర్త జారిపడి మరణించిన కొండని క్లెయిమ్ చేయడానికి చైనా నుంచి వచ్చింది. ఆ కొండ తన తాతది. అతను మంచూరియా స్వాతంత్ర్య పోరాట వీరుడు. తల్లి చనిపోతూ ఈ విషయం చెప్తే తను వచ్చింది. తీవ్ర అనారోగ్యంతో వున్న తల్లి ఏదైనా మందు ఇచ్చి తనని పరలోకాలకి పంపేయమని అడిగితే, ఆ మందు ఇచ్చి ప్రశాంతంగా పరలోకాలకి పంపేసింది.

ఇప్పుడు భర్త మరణానికి సంబంధించి సాక్ష్యాధారాలు ఆమెకి వ్యతిరేకంగా వుంటాయి. డిటెక్టివ్ హేజున్, అసిస్టెంట్ సువాన్ తో కలిసి ఆమె మీద నిఘా పెడతాడు. ఆ నిఘాలో ఆమెని గమనిస్తూ ప్రేమలో పడతాడు భార్య వున్న హేజున్. ఆమె ఒక హత్య కాదు, తాజాగా ఇంకో రెండు హత్యలు చేసినా అతడి ప్రేమ చావదు. అతడికి దగ్గరై అతడి దగ్గరున్న సాక్ష్యాధారాల్ని తొలగించడం ప్రారంభిస్తుంది. ఇక అసలే నిద్ర లేమి పేషంట్ అయిన అతడి పిచ్చి ప్రేమతో హాత్యకేసు ప్రేమ కేసుగా మారిపోయి ఏ మలుపులు తిరిగిందన్నది మిగతా కథ.

సింపుల్ కథ -సంక్లిష్ట కథనం

దర్శకుడు పార్క్ అమెరికన్ ఫిలిం నోయర్ జానర్ సినిమాలతో స్ఫూర్తి పొంది ఈ కథ చేశాడనేది స్పష్టంగా వుంటుంది. ఒక డిటెక్టివ్- ఒక మర్డర్- మధ్యలో వాంప్ క్యారక్టర్. కాకపోతే వాంప్ క్యారక్టర్ మీద డిటెక్టివ్ ప్రేమని రగిలించాడు. అయితే డిటెక్టివ్ కి ఈ ప్రేమ రగలడానికీ, ప్రేమలో అంతా పిచ్చి వాడవడానికీ తగిన బలమైన కారణం కనిపించదు (తెలుగు ’18 పేజెస్’ లో నిఖిల్ ప్రేమలా). ఆమెలో ఏం ఆకర్షించిందో తెలియదు. ఈ లోపం వల్ల మొత్తం కథంతా, ఆర్భాటమంతా సిల్లీగా అన్పిస్తుంది. పైగా ఈ కథని 2 గంటల 20 నిమిషాలు సాగదీయడం అసహనానికి గురి చేస్తుంది.

కారణం లేని డిటెక్టివ్ ప్రేమతో ఉద్వేగభరిత చిత్రణ చేశాడు. సూటిగా వున్న విషయాన్ని వీలయినంత సాగదీసి, దాని స్థితి స్థాపకతని పరీక్షించి చూడాలనుకున్నట్టు అన్పిస్తాడు దర్శకుడు. దీనికి స్థలకాలాల ఐక్యతతో ఆడుకుంటాడు. గతాన్ని వర్తమానంతో బ్లర్ చేస్తాడు. విషయాన్ని కొండని తవ్వుతున్నట్టు తవ్వి ఎన్నెన్నో అంశాలతో, కథా గమనానికి అంతరాయం కలిగిస్తాడు. మ్యాజిక్ చేస్తున్నట్టు ఫ్లాష్‌బ్యాకులతో, ఫాంటసీలతో తికమక పెట్టేస్తాడు.

ఆమె చేసే కొత్త హత్యలకి ప్రేమోన్మాదియైన డిటెక్టివ్ తనే క్లూస్ ని మాయం చేసే లాంటి కథకవసరమైన మలుపులు కొన్నే వుంటాయి. ప్రేమ గోలే ఎక్కువుంటుంది. ప్రేమలో అతడి అంతులేని ఊహల మత్తులో ప్రమాదకర చర్యలకి పాల్పడేలాంటి థ్రిల్లింగ్ ఘట్టాలుండవు. ప్రేమకి కారణం లేకపోవడం వల్ల మొత్తం కథ అర్ధరహితంగా కన్పిస్తుంది. సినిమా ఫస్టాఫ్ మర్డర్ మిస్టరీలా, సెకండాఫ్ లవ్ స్టోరీలా వుంటుంది. అయితే భాషా సమస్యల కారణంగా కూడా సినిమాని ఫాలో అవడం కష్టంగా వుంటుంది. సబ్ టైటిల్స్ వేసినా, ప్రతీ సూక్ష్మ అంశాన్నీ వివరించకపోతే అసలే సంక్లిష్టంగా వున్న కథ పూర్తిగా అర్ధంగాని పరిస్థితి. వీకీపీడియాలో కథ చదువుకుని సినిమా చూస్తే ఓహో ఇదా విషయమని కొన్ని సూక్ష్మాంశాలు అర్ధమ వుతాయి. సూక్షం, సంక్లిష్టం, సంకీర్ణం ఇవన్నీ అవసరం లేదు దీనికి.

అసలు స్వరూపం ఇది...

పొరవిప్పి చూస్తే ఈ కథ అసలు స్వరూపం తెలుస్తుంది. ఈ అసలు స్వరూపంతోనే ఆస్కార్ కి షార్ట్ లిస్ట్ అయినట్టు తెలుస్తుంది. 2019 లో దక్షిణ కొరియా ‘పారసైట్’ ఆస్కార్ అవార్డుకి ఈ స్వరూపమే కారణం. ‘డెసిషన్ టు లీవ్’ కి ‘పారసైట్’ తో ఈ సారూప్యముంది. ‘పారసైట్’ లాగే ‘డెసిషన్ టు లీవ్’ శ్రామిక- పెట్టుబడిదారీ వర్గ విభజనని చిత్రిస్తుంది. ఆమె చైనా నుంచి వచ్చి వుంటున్న అక్రమ వలసదారు. కొరియన్ విముక్తి పోరాట వీరుడి వారసురాలిగా కొండని స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన హత్య కేసు నిందితురాలు, నిమ్నురాలు. అతను కొరియన్ సమాజపు కులీనుడు. వీళ్ళిద్దరి ప్రేమని అంగీకరించదు వర్గ సోపానక్రమపు కొరియన్ సమాజం. అందుకని ‘అనార్కలి’ కథ ఎలా ముగిసిందో అలా ముగుస్తుంది ఈ కథ. ముగిపు గుండెని పిండేసినట్టు వుంటుంది ఈ ‘సలీం’ తో. వర్గ తరతమ్యాలు సరే గానీ పునాదిలేని ప్రేమ పురాణంతోనే వచ్చింది సమస్య.

ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో అమెరికన్ ఫిలిం నోయర్ సినిమాలు కూడా ధనిక- పేద విభజనతో కూడిన క్రైమ్ సినిమాలే. వాటిలో తప్పనిసరిగా కొన్ని నియమిత పాత్రలు, చిత్రీకరణ ఎలిమెంట్లు వుంటాయి. వీటితో అతి కళాత్మకతకి పోయి సంక్లిష్టం చేయకుండా సూటిగా, తేటగా విషయం చెప్పేవాళ్ళు. ఇలా కాకుండా ‘డెసిషన్ టు లీవ్’ నోయర్ ని అతి చేసిన కళాప్రదర్శన అయింది. సబ్ టైటిల్స్ తో ఇది ‘ముబి’ ఓటీటీలో వుంది.


Full View


Tags:    
Advertisement

Similar News