BRO Movie Review | బ్రో- ది అవతార్ మూవీ రివ్యూ {2.25/5}

BRO Movie Review | మెగా బంధువులు పవన్ కళ్యాణ్, సాయిధరం తేజ్ లు కలిసి అంతగా పాపులర్ కాని తమిళ రీమేక్ లో నటిస్తూ అభిమానుల్ని అలరించడానికి తెరపై కొచ్చారు.

Advertisement
Update:2023-07-28 15:47 IST

చిత్రం: బ్రో- ది అవతార్

కథ దర్శకత్వం : సముద్రకని

తారాగణం : పవన్ కళ్యాణ్, సాయి ధరం తేజ్, కేతికా శర్మ, ప్రియా ప్రకాష్, రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్,సుబ్బ రాజు తదితరులు

సంగీతం : తమన్, ఛాయాగ్రహణం : సుజిత్ వాసుదేవ్

నిర్మాతలు : టిజి వెంకటేష్, వివేక్ కూచిభొట్ల

విడుదల : జులై 28, 2023

రేటింగ్: 2.25/5

మెగా బంధువులు పవన్ కళ్యాణ్, సాయిధరం తేజ్ లు కలిసి అంతగా పాపులర్ కాని తమిళ రీమేక్ లో నటిస్తూ అభిమానుల్ని అలరించడానికి తెరపై కొచ్చారు. తమిళంలో సముద్రకని నటిస్తూ దర్శకత్వం వహించిన ‘వినోదయ సిత్తం’ (వింత కోరిక) కి ఇది రీమేక్. దీనికీ సముద్రకని దర్శకత్వం వహించాడు. తమిళంలో ఇది 2021 లాక్ డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలైన గంటన్నర ప్రయోగాత్మక సినిమా. ఏమిటి ఇంత పొట్టి సినిమా ప్రత్యేకత? పవన్ కళ్యాణ్ లాంటి బిగ్ స్టార్ తో రీమేక్ చేసేంత విశేషం ఇందులో ఏముంది? ఇందులో వున్న సానుకూల ప్రతికూలత లేమిటి? తమిళ మలయాళ స్మాల్ బడ్జెట్ సబ్జెక్టులు తెలుగులో స్టార్స్ కి సూటవుతాయా? ఈ సందేహాలకి సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం...

కథ

మార్క్ అలియాస్ (మార్కండేయులు) ఓ టెక్స్ టైల్ కంపెనీలో ఏజీఎం గా పనిచేస్తూంటాడు. అన్ని పనులూ తనమీదే వేసుకుని వాటిని పూర్తి చేయాలన్న తపనతో పరుగులు దీస్తూంటాడు. దేనికీ సరైన టైమ్ కేటాయించలేక పోతూంటాడు. అతడికి పెళ్ళీడుకొచ్చిన చెల్లెలు (ప్రియా ప్రకాష్ వారియర్), చదువుకుంటున్న ఇంకో చెల్లెలు (యువ లక్ష్మి), అమెరికాలో తమ్ముడూ, ఇంట్లో అనారోగ్యంతో తల్లీ (రోహిణి) వుంటారు. ఇంకో పక్క రమ్య (కేతికా శర్మ) ని ప్రేమిస్తూంటాడు.

ఇంతలో ఉరుకులు పరుగులతో ఒక రోడ్డు ప్రమాదంలో మరణిస్తాడు. అప్పుడు టైమ్ (కాలం) రూపంలో దేవుడు (పవన్ కళ్యాణ్) ప్రత్యక్ష మవుతాడు. తనని అప్పుడే చంపవద్దనీ, ఇంటి బాధ్యతలు తీర్చుకోవడానికి ఇంకో 90 రోజులు గడువివ్వమనీ వేడుకుంటాడు మార్క్. బాధ్యతలు పూర్తి చేసుకుని వచ్చి లొంగిపోతానంటాడు. సరేనని 90 రోజుల గడువిస్తాడు టైమ్.

ఈ గడువులో మార్క్ బాధ్యతలు పూర్తి చేసుకున్నాడా? ఈ ప్రయత్నంలో ఏ ఇబ్బందులెదుర్కొన్నాడు? తను లేకపోతే కాలం ఆగిపోయిదా? లేక తను లేకపోయినా అన్ని పనులూ జరిగిపోతున్నాయా? జీవితం గురించి ఏం తెలుసుకున్నాడు మార్క్? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది ఫిలాసఫికల్ ఫాంటసీ జానర్ కథ. కథ అనేకన్నా ఇది గాథ. తమిళంలో శ్రీవత్సన్ అనే రచయిత రాసిన నాటకం ఆధారంగా తమిళంలో తీశారు. తెలుగులో రీమేక్ చేశారు. గాథ అనడంలోనే సినిమాకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. గాథలు సినిమాలకి పనికి రావని గతంలో ఎన్నో ఉదాహరణలు చూశాం ఫ్లాపయిన మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ (2016) సహా. ప్రస్తుత గాథగా తీసిన ‘బ్రో’ లోకంలో అన్నీ మన వల్లే జరుగుతున్నాయనీ, మనం లేకపోతే ప్రపంచమే ఆగిపోతుందనీ, అహం పెంచుకుని ప్రవర్తించే మనుషులకి సంబంధించిన ఇతివృత్తం.

హాలీవుడ్ సూపర్ హిట్ ‘బ్రూస్ ఆల్ మైటీ’ (2003) లో జిమ్ కేరీ స్వలాభం కోసం చేసే కొన్ని పనులు ఎదురు తన్ని, టీవీ రిపోర్టర్ ఉద్యోగంలోంచి డిస్మిస్ అవుతాడు. అప్పుడు వొళ్ళు మండిపోయి ‘అసలు డిస్మిస్ చెయ్యాల్సింది నిన్నేరా!’ అని దేవుణ్ణి తిట్టి పోస్తాడు. ఆ దేవుడు ప్రత్యక్షమై, తన పవర్స్ అన్నీ జిమ్ కేరీ కిచ్చేసి- ఇక పనులు పూర్తి చేసుకో పొమ్మంటాడు. ఇది గాథ కాదు, కథ. ఎందుకంటే ఇందులో రెండు ఎదురెదురు పాత్రల మధ్య (జిమ్ కేరీ- దేవుడు) సంఘర్షణ వుంది. ప్రధాన పాత్ర- ప్రత్యర్ధి పాత్రలు వుండి, వాటి మధ్య ఒక సమస్యతో సంఘర్షణ పుడితే అది సినిమా కథ, లేకపోతే సినిమాకి పనికిరాని గాథ- అగాథం!

మనమున్నా లేకపోయినా ప్రపంచంలో ఏదీ ఆగదనీ, ప్రపంచం దాని పని అది చేసుకుపోతుందనీ, మన కోసం కాలం ఆగదనీ, కనుక అహం మాని కాలంతో బాటు బ్రతకమనీ చెప్పే గాథ. అదే సమయంలో మరణం ఆఖరి మజిలీ కాదనీ, జనన మరణాలు ముగింపు లేని ఒక వృత్తమనీ, మరణాన్ని చూసి భయపడకూడదనీ, చెప్పే ఫిలాసఫికల్ ఫాంటసీ గాథ. గాథకి ఈ కాన్సెప్ట్ ఆడియెన్స్ ఫ్రెండ్లీగా బాగానే వుంది. కానీ గాథ కమర్షియల్ సినిమా ఫ్రెండ్లీ కాదు గనుక దీంతో పవన్ ఫ్యాన్స్ తప్ప ఇతర ప్రేక్షకులు ఇబ్బంది పడొచ్చు.

‘బ్రో’ గాథా, ‘బ్రూస్ ఆల్ మైటీ’ కథా రెండూ మనిషి సూపీరియారిటీ కాంప్లెక్స్ గురించే. అయితే జిమ్ కేరీతో వినోద విలువలతో కాన్సెప్ట్ ని హాస్యభరితంగా, కథగా చూపిస్తే, సాయి ధరం తేజ్ తో వినోద విలువలకి వీడ్కోలు చెప్పి విషాద భరిత గాథ చేశారు. ఇది థియేటర్ మెటీరీయల్ కాదని ఓటీటీలో ఒరిజినల్ ని చూస్తూంటేనే తెలిసిపోతుంది. దేవుడు- కాలం లాంటి ఫిలాసఫికల్ ఫాంటసీ కాన్సెప్టులు నాటకానికి సీరియస్ గా, గాథగా వుంటే సరిపోవచ్చు గానీ, సినిమాకి హాలీవుడ్ ప్రకారం హీరోయిక్ ఫాంటసీ కథగా వుండా

ల్సిందే. ఫిలాసఫీ పనికి రాదని కాదు. ఈ ఫిలాసఫికల్ ఫాంటసీని ‘బ్రూస్ ఆల్ మైటీ’ లాగా ఫన్నీగా, కామెడీగా, కథగా తీయాల్సిందే. ఏ సీరియస్ కాన్సెప్ట్ అయినా షుగర్ కోటింగ్ వేసిన తియ్యటి క్యాప్సూల్ లా వుండాల్సిందే కమర్షియల్ సినిమాకి.

ఇక్కడ షుగర్ కోటింగ్ పవన్ కళ్యాణ్ పాత్రతో ఇచ్చి ఎంటర్ టైనర్ గా మార్చే ప్రయత్నం చేశారు. చీటికీ మాటికీ పవన్ సినిమా పాటలు వేస్తూ, కథ కాని గాథని నిలబెట్టే ప్రయత్నం చేశారు. పవన్ మ్యానరిజమ్స్ తో కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఇవి ఫ్యాన్స్ ని రెచ్చగొడతాయే తప్ప ఇతర ప్రేక్షకులకి కష్టమే.

నటనలు- సాంకేతికాలు

తమిళంలో చిన్న బడ్జెట్ లో టైమ్ పాత్ర తానే నటించిన దర్శకుడు సముద్రకని, తెలుగులో పవన్ కళ్యాణ్ తో పెద్ద బడ్జెట్ కి ఆర్భాటం చేసి నటింపజేశాడు. ఇతివృత్తంలో వున్న లోపాల్ని కవర్ చేసేలా పవన్ స్టార్ డమ్ ని, యాక్టింగ్ స్కిల్స్ ని, డైలాగ్ డెలివరీనీ, పాత పాటల్ని జోడిస్తూ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే ప్రయత్నమంతా చేశాడు. ఈ మాస్ ఎలిమెంట్స్ తో పవన్ ఒన్ మాన్ షోగా మారింది- కాన్సెప్ట్ ని పక్కన పెట్టేసి. హిందీ ‘పింక్’ లో అమితాబ్ బచ్చన్ సున్నిత పాత్రని తెలుగులో ‘వకీల్ సాబ్’ గా పవన్ ఎంత హంగామా చేశాడో అంత హంగామా ‘బ్రో’ లో చేశాడు. ఫ్యాన్స్ కి మాంచి కిక్కు ఈ ‘బ్రో’.

తమిళంలో తంబి రామయ్య మధ్య వయస్కుడైన తండ్రి పాత్రని యువ పాత్రగా మార్చుకుని సాయి ధరం తేజ్ నటించాడు. కానీ తంబి రామయ్య యాక్టింగ్ స్కిల్స్ తో పోలిస్తే సాయిధరం తేజ్ ఇలాటి పాత్రలకి ఇంకా చాలా కృషి చేయాలి. వందకి పైగా సినిమాలు నటించిన సీనియర్ క్యారక్టర్ ఆర్టిస్టు తంబి రామయ్య ప్రదర్శించే అహం, రోషం, భోళాతనం, అమాయకత్వం అన్నీ సహజంగా ఇతివృత్తంలో కలిసిపోతాయి. తమిళంలో ఈ రెండు పాత్రల్లో తమిళ స్టార్స్ ఎవరినీ తీసుకోకపోవడం గమనించాలి. స్టార్ స్టేటస్ వున్న పాత్రలు కాకపోవడం చేత.

మిగిలిన పాత్రల్లో అందరూ పాత్రలకి తగ్గట్టు నటించారు- ఒక్క హీరోయిన్ కేతికా శర్మ తప్ప. ఈమెకి పెద్దగా పాత్ర లేదు. కుటుంబంలో ఇతర పాత్రల ప్రవర్తనలతో నటీనటులు కాస్త ఆకట్టుకుంటారు. సాంకేతికంగా థమన్ సంగీతంలో పాటలకంటే నేపథ్య సంగీతానికి ఎక్కువ ప్రాధాన్య మిచ్చాడు. వచ్చి పోతూ వుండే పవన్ పాత సినిమాలు ఫస్టాఫ్ వరకూ ఎంటర్ టైన్ చేస్తాయి గానీ, సెకండాఫ్ లో అతి అనిపిస్తాయి-ఇతివృత్తాన్ని వదిలేసి సాము చేయడంతో. పోతే, ఇతర సాంకేతిక విలువలన్నీ బ్రహ్మాండంగా వున్నాయి. అయితే గ్రాఫిక్స్ క్వాలిటీ అంతగా రుచించదు. సముద్రకని స్టార్ సినిమాకి దర్శకత్వం వహించడం ఇదే. కానీ స్టార్ స్టేటస్ కి తగ్గ కథ వుండాలి, గాథ కాదు.

చివరికేమిటి

ఫస్టాఫ్ సాయిధరం తేజ్ మొదటి ఇరవై నిమిషాలూ తన పాత్ర ధోరణితో చేసిన కామెడీ సరిగ్గా వర్కౌట్ కాలేదు. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గా ఎంట్రీ ఇచ్చాకే, ఇంటర్వెల్ వరకూ ఆయన పవర్ తో- కాంబినేషన్ తో సాయి ధరం తేజ్ కామెడీలు, బ్రోమాన్స్ హుషారెక్కిస్తాయి. సెకండాఫ్ వచ్చేసరికి విడుదలవుతున్న అన్ని సినిమాలకి లాగే విషయం లేక చేతులెత్తేసింది సినిమా. పవన్- ధరమ్ పాత్రల మధ్య సంఘర్షణ లేకపోవడంతో నసపెట్టే వ్యవహారంగా మారింది గాథ. దీనికి స్క్రీన్ ప్లే చేసిన త్రివిక్రమ్ కి ఇది కథ కాదు, గాథ అని తెలియదనుకోవాలా?

ఈ గాథ సాయి ధరమ్ తేజ్ పాత్రకి సంబంధించింది అయితే, పవన్ మీద రాజకీయ వాసనలున్న డైలాగులతో మెసేజివ్వడం ఇంకో పొరపాటు (మన జీవితం, మరణం భావి తరాల కోసమే; పుట్టుక మలుపు, మరణం గెలుపు). మొత్తానికి ఈ కాన్సెప్ట్ ని కథ గా మార్చడానికి ఏం చేయాలో ఆలోచించకుండా, గాథకే అలంకారాలు చేయడం వల్ల ఎంత బడ్జెట్ ని ధారబోసినా అగాథం అగాథం లాగే వుండిపోయింది.

Tags:    
Advertisement

Similar News