Asvins Movie Review: అశ్విన్స్ మూవీ రివ్యూ {2.5/5}

Asvins Movie Review and Rating: తమిళంలో 'తారామణి', 'రాకీ' సినిమాలు నటించిన హీరో వసంత్ రవి, తాజాగా రానున్న రజనీకాంత్ 'జైలర్' లో కూడా నటించాడు. ఇప్పుడు ‘అశ్విన్స్’ అనే హార్రర్ తో ముందుకొచ్చాడు.

Advertisement
Update:2023-06-23 20:05 IST

Asvins Movie Review: అశ్విన్స్ మూవీ రివ్యూ {2.5/5}

Asvins Movie Review | చిత్రం: అశ్విన్స్

రచన - దర్శకత్వం : తరుణ్ తేజ

తారాగణం : వ‌సంత్ ర‌వి, విమ‌లా రామ‌న్, మురళీధరన్ సుబ్రమణియన్, సార‌స్ మీన‌న్‌, ఉద‌య దీప్‌, మలినా అతుల్, సిమ్రాన్ ప‌రీక్‌ తదితరులు

సంగీతం : విజ‌య్ సిద్ధార్థ్‌, ఛాయాగ్రహణం : ఎడ్విన్ సాకే

సహ నిర్మాత : ప్రవీణ్ డేనియల్

నిర్మాత : బీవీఎస్ఎన్ ప్రసాద్

విడుదల : జూన్ 23, 2023

రేటింగ్: 2.5/5

తమిళంలో 'తారామణి', 'రాకీ' సినిమాలు నటించిన హీరో వసంత్ రవి, తాజాగా రానున్న రజనీకాంత్ 'జైలర్' లో కూడా నటించాడు. ఇప్పుడు ‘అశ్విన్స్’ అనే హార్రర్ తో ముందుకొచ్చాడు. లాక్డౌన్ సమయంలో హార్రర్ షార్ట్ ‘అశ్విన్స్’ తీసి పేరు తెచ్చుకున్న తెలుగు వాడైన దర్శకుడు తరుణ్ తేజ, హార్రర్ షార్ట్ నే సిల్వర్ స్క్రీన్ కి విస్తరించాడు. దీన్ని తమిళ-తెలుగు ద్విభాషా విడుదలగా సమర్పించాడు. దీనికి ప్రసిద్ధ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. బ్లాక్ టూరిజం అంశం మీద తీసిన ఈ కొత్త హార్రర్ ఎలా వుందో ఒకసారి చూద్దాం.

కథ

ఐదుగురు యూట్యూబర్లు - అర్జున్ (వసంత్ రవి), రీతు (సరస్వతీ మీనన్), గ్రేస్, వరుణ్ (మురళీధరన్) రాహుల్ (ఉదయదీప్) లు కలిసి హార్రర్ సంఘటనల వీడియోలు తీస్తూ పాపులర్ అవుతారు. వాళ్ళకి లండన్ నుంచి బ్లాక్ టూరిజం అనే ప్రాజెక్టు వస్తే అక్కడికి వెళ్తారు. అక్కడ అంతు చిక్కని మిస్టరీగా మిగిలిపోయిన ఓ పాడుబడిన భవనంలో అన్వేషణ ప్రారంభిస్తారు. ఈ భవనం ఒకప్పుడు మత వ్యవహారాల్లో నిపుణురాలైన ఆర్కియాలజిస్ట్ ఆర్తీ రాజగోపాల్ (విమలా రామన్) కి చెందింది. ఇక్కడ ఓ పదిహేను మంది శవాలై దొరికిన సంఘటన తర్వాత ఈ భవనాన్ని మూసేశారు. ఆర్తీ శవం దొరకలేదు. ఇది తెలుసుకునేందుకు భవనంలోకి ప్రవేశించిన ఐదుగురికీ భయానక అనుభవాలు ఎదురవుతాయి. ఈ భవనంలో వున్న రహస్యమేమిటి? దాంతో ఆర్తీ రాజగోపాల్ కున్న సంబంధమేమిటి? ఈ ఐదుగురూ ఏం తెలుసుకున్నారు? ఏం సాధించారు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఈ మధ్య ప్రాచుర్యం పొందుతున్న బ్లాక్ టూరిజం, లేదా డార్క్ టూరిజం అంశంపై ఈ కథ. మానవ చరిత్రలోని కొన్ని నిగూఢ సంఘటనలు జరిగిన ప్రదేశాలని సందర్శించడం ఈ బ్లాక్ టూరిజం లక్ష్యం. ఇందులో మారణహోమం, హత్య, ఖైదు, జాతి నిర్మూలన, యుద్ధం లేదా ప్రకృతి వైపరీత్యం -వంటి భూస్థాపితమైన- కాలగర్భంలో కలిసిన ఉదంతాల్ని వెలికితీసే ప్రయత్నం కూడా జరగొచ్చు. మన దేశంలో సూరత్ లోని డుమాస్ బీచి, డార్జీలింగ్ లోని డవ్ హిల్, పుణె లోని శనివర్వాడా కొన్ని బ్లాక్ టూరిజం కేంద్రాలు.

దర్శకుడు తరుణ్ తేజ ఈ కన్సెప్ట్ తీసుకుని యూట్యూబర్ల అనుభవాల హార్రర్ కథగా మలిచాడు.

ఒక పాడుబడ్డ భవనం, అందులో ఒక ఆత్మ, ఆ ఆత్మతో కొందరి భయానక అనుభవాలూ అనేది హార్రర్ సినిమాల రెగ్యులర్ ఫార్ములానే. దీనికి బ్లాక్ టూరిజమని పేరు పెట్టడంతో ఇదేదో కొత్త కాన్సెప్ట్ అనిపిస్తుందిగానీ, ఇది రెగ్యులర్ హార్రర్ సినిమానే. ఇలా కాకుండా, నిజ నేపథ్యమున్న బ్లాక్ టూరిజం కేంద్రపు ఉదంతం తీసుకుని వుంటే కొత్త కథగా వుండేది. ఉదాహరణకి- పుణె లోని శనివార్వాడ కోటకి ప్రజలు చెప్పుకునే హృదయ విదారక దెయ్యం కథ వుంది. ఇది మరాఠా రాజ్యం చారిత్రక వృత్తాంతానికి ప్రసిద్ధి చెందింది. పేష్వా నారాయణరావు హత్యకి గురవడానికి ముందు కోట మీదుగా పరుగెత్తుతూ, ప్రాణాలు కాపాడమని మామని వేడుకుంటూ అరిచిన అరుపులు, పౌర్ణమి రాత్రి కోటలో ఇప్పటికీ విన్పిస్తాయని చెప్పుకుంటారు. ఇలాటి ఉదంతాల పూర్వాపరాలు తెలుసుకునే కథగా చేసి వుంటే, బ్లాక్ టూరిజం కాన్సెప్ట్ కి న్యాయం జరిగేది.

దర్శకుడు తరుణ్ తేజ ఆర్కియాలజిస్టు ఆర్తీ కల్పిత పాత్ర మరణంతో ఫిక్షన్ కథ చేశాడు. దీన్ని పురాణాల్లో దేవతల కథతో కలిపి స్పిరిచ్యువల్ హార్రర్ టైపులో ప్రెజెంట్ చేశాడు ‘విరూపాక్ష’ లాగా. అయితే షార్ట్ ఫిలిమ్ ని సినిమాకి విస్తరించే సరికి ఫస్టాఫ్ లో విషయం కొరవడింది. షార్ట్ ఫిలిమ్ లోని విషయాన్ని సెకండాఫ్ లోకి నెట్టేసినట్టున్నాడు. సెకండాఫ్ లో కథకి ఫస్టాఫ్ ఉపోద్ఘాతంలా వుంది. పాత్రల పరిచయాల తర్వాత భవనంలో భయపెట్టే సంఘటనలు వస్తాయి. ఏ సంఘటనలు రొటీనే అయినప్పటికీ బిజీఎంతో, సౌండ్ ఎఫెక్ట్స్ తో థ్రిల్ చేస్తాయి. అలాగే సంభాషణల బలం ఫస్టాఫ్ ని చూసేలా చేస్తాయి.

ఇంటర్వెల్ మలుపుతప్ప ఈ కథలో మలుపులుండవు, మలుపులులేక సస్పెన్స్ వుండదు. ఇంటర్వెల్ మలుపుతో సెకండాఫ్ లో కథ ప్రారంభమవుతుంది. సెకండాఫ్ లో హార్రర్ సీన్లు రిపీటవుతూంటాయి. ఆర్కియాలిజిస్టు ఆర్తీకి శవం ఏమైందన్న అంశం చుట్టే దృశ్యాలుంటాయి. అయితే హార్రర్ కథ కాస్తా సైకలాజికల్ కథగా మారి జీవన్మరణాల మీమాంసతో, శాప విముక్తి ప్రశ్నలతో సామాన్య ప్రేక్షకులకి అర్ధమవడం కష్టమై పోతుంది.

నటనలు- సాంకేతికాలు

ప్రధాన పాత్రలో వసంత్ రవి మరోసారి ‘తారామణి’ టైపు నేచురల్ యాక్టింగ్ చేశాడు. ఆర్కియాలజిస్టు ఆర్తీ గా విమలా రామన్ చాలా కాలం తర్వాత తెర మీద కన్పించింది. పాత్రకి సరిపోయింది. ఇతర నటీనటులందరికీ సరిసమానంగా పాత్రలు దక్కాయి. పాత్రలకి తగ్గట్టు నటించారు. ముఖ్యంగా టెక్నికల్ గా ఈ హార్రర్ ఆకట్టుకునేలా వుంది. ఎడ్విన్ సాకే కెమెరా యాంగిల్స్, లైటింగ్ తో కూడిన విజువల్స్ ప్రయోగాత్మకంగా వున్నాయి. ఇక విజ‌య్ సిద్ధార్థ్‌ సంగీతం- బిజీఎం హార్రర్ దృశ్యాల్ని ఎలివేట్ చేసేలా వున్నాయి. అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ కూడా.

దర్శకుడు తరుణ్ తేజ తన షార్ట్ ఫిలిమ్ ని సినిమాగా తీసి నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నం పూర్తిగా ఫలించకపోయినా ఫర్వాలేదన్పించే ప్రయత్నమే చేశాడు. అయితే బ్లాక్ టూరిజానికి కల్పిత కథ గాకుండా, నిజంగా జరిగిన ఉదంతాన్ని తీసుకుని వుంటే కొత్త సీసాలో పాత సారా కాకుండా వుండేది.


Full View


Tags:    
Advertisement

Similar News