Ahimsa Movie Review: అహింస మూవీ రివ్యూ {1.75/5}

Ahimsa Telugu Movie Review and Rating: దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ హీరోగా తెరకెక్కాడు. తేజ దర్శకత్వంలో ‘అహింస’ లో నటిస్తూ ప్రేక్షకులకి పరిచయమయ్యాడు.

Advertisement
Update:2023-06-02 21:13 IST

Ahimsa Movie Review & Rating: అహింస మూవీ రివ్యూ {1.75/5}

చిత్రం: అహింస

రచన- దర్శకత్వం : తేజ

తారాగణం : అభిరామ్ దగ్గుబాటి, గీతికా తివారీ, సదా, రజత్ బేడీ, రవి కాలే, కమల్ కామరాజు, దేవీ ప్రసాద్ తదితరులు

సంగీతం : ఆర్పీ పట్నాయక్

ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి

నిర్మాత : పి. కిరణ్ (జెమినీ కిరణ్)

విడుదల : 2 జూన్ 2023

రేటింగ్: 1.75/5

దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ హీరోగా తెరకెక్కాడు. తేజ దర్శకత్వంలో ‘అహింస’ లో నటిస్తూ ప్రేక్షకులకి పరిచయమయ్యాడు. చాలా కాలంగా హిట్స్ లేని తేజ, 2017 లో రానా దగ్గుబాటితో ‘నేనేరాజు నేనే మంత్రి’ తో ఓ హిట్ ఇచ్చి, మళ్ళీ 2019 లో కాజల్ అగర్వాల్ తో ‘సీత’ తీసి ఫ్లాపయ్యాడు. తిరిగి ఇప్పుడు ‘అహింస’ తో రెండు దశాబ్దాలు పైబడిన అదే తన శైలిలో ఈ తరం ప్రేక్షకులతో అనుబంధం పెంచుకునేందుకు ముందుకొచ్చాడు. అయితే ఇందులో సక్సెస్ అయ్యాడా? దివంగత రామానాయుడు మనవడు అభిరాంని యువ ప్రేక్షకుల నవ హీరోగా సరైన తీరులో లాంచ్ చేయగల్గాడా? ఈ ముఖ్యాంశాల్ని పరిశీలిద్దాం.

కథ

ఆ వూళ్ళో తల్లిదండ్రుల్లేని రఘు (అభిరామ్) మేనమామ దగ్గర పెరుగుతాడు. మరదలు అహల్య (గీతికా తివారీ) ని ప్రేమిస్తాడు. వాళ్ళకి నిశ్చితార్ధం జరిపిస్తారు. వూళ్ళో నే దుష్యంతరావు (రజత్ బేడీ) అనే దుష్టుడికి ఇద్దరు కొడుకులు వుంటారు. వాళ్ళు అహల్యని అపహరించి అత్యాచారం చేస్తారు. రఘు రగిలిపోతాడు. అయితే అహింసని నమ్మే అతను చట్టరీత్యా పోవాలనుకుంటాడు. ఇందులో లాయర్ లక్ష్మి (సదా) సహకరిస్తుంది. లాయర్ లక్ష్మిని దుష్యంతరావు చంపేస్తాడు. దీంతో అహింసని నమ్మే రఘు హింసకి దిగుతాడు. ఈ పోరాటంలో దుష్యంతరావు మీద ఎలా పగదీర్చుకున్నాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

అహింసని నమ్మే హీరో హింసకి దిగే పరిస్థితులు ఎదురుకావడం, జరిగిన అన్యాయానికి పగదీర్చుకోవడం బాపతు ఫార్ములా కథలు ఎన్నో వచ్చాయి. వాటిలో ఇదొకటి. అయితే కథనం కూడా పాతబడిపోవడం ఈ కథ ప్రత్యేకత. రెండు దశాబ్దాలుగా సినిమాలు తీస్తున్న తేజ అప్డేట్ కాకుండా, అదే తనకి అబ్బిన ఆనాటి కళతో ఈనాటి ప్రేక్షకులకి దగ్గరవ్వాలనుకోవడం అత్యాశే అనుకోవాలి. ఏ విధంగా చూసినా ఈ సినిమా తేజ చేయి దాటిపోయింది. ఆయన కాలం చెల్లిపోయాడు.

అహింసా వాదంతో సినిమాలో చూపించింది అర్ధం పర్ధం లేని హింసే. ఇది ప్రేక్షకుల్ని హింసించడమే. అక్షరాలా రెండు గంటలా 42 నిమిషాలు సాగదీసిన ఉన్మాదం. ప్రేయసి అత్యాచారానికి గురైతే అహింసని నమ్మాలంటూ కోర్టుని ఆశ్రయించినవాడు, లాయర్ హత్యతో అహింసని వదిలేసి హింసకి దిగడం మింగుడు పడని వ్యవహారం. ప్రేయసి కంటే లాయరే ఎక్కువన్నట్టు పాత్ర చిత్రణ తయారైంది. దీంతో పాత్ర, దాంతో కథా నమ్మబుద్ధి కావు.

తేజ తీసిన సినిమాలన్నిట్లో ఇదే అత్యంత తక్కువ రేటింగ్ గల సినిమా. చిత్రం, నువ్వు నేను, జయం లు తీసిన కాలంలోనే వుండి పోయి ఈ కాలంలో సినిమా తీసిన ఫలితమిది. పైగా ఆ సినిమాల్లోని సన్నివేశాలే చాలాసార్లు వాడేశారు. ఫస్టాఫ్ లో రోమాన్స్, కొంత, వినోదం కొంత ఫర్వాలేదన్పించినా, హీరోయిన్ మీద అత్యాచారంతో పాత రివెంజి కథగా ఫస్టాఫ్ లోనే తేలిపోయింది. ఇక బరి తెగించిన హింసతో సెకండాఫ్ దారుణం.

యూత్ కోసం తీసిన ఈ సినిమాలో యూత్ అప్పీల్ హీరో హీరోయిన్లతో లేదు, కథా కథనాలతోనూ లేదు. అంతా రొడ్డ కొట్టుడుగా చుట్టేశారు. కథని అడవుల్లోకీ తీసికెళ్ళడం తేజ ఇంకో రొటీన్ ఫార్ములా. మళ్ళీ కథని తీసికెళ్ళి అడవుల్లో పడేశారు. అభిరామ్ లాంచింగ్ ని ప్రశ్నార్ధకం చేశారు.

నటనలు- సాంకేతికాలు

అభిరామ్ ఈ లాంచింగ్ తో నిలబడాలని విశ్వప్రయత్నం చేశాడు. కానీ పాత్ర, కథ, దర్శకత్వం సహకరించలేదు. పాతబడిపోయిన తేజతో అభిరామ్ కిది రాంగ్ లాంచింగ్. ఇంకెవరైనా కొత్త దర్శకుడితో ట్రెండీ మూవీ చేయాల్సింది. ముఖంలో హావభావాలున్నాయి, నటనలో ఈజ్ కూడా వుంది. సినిమా నటుడుగా అర్ధవంతంగా కన్పిస్తున్న తను అర్ధం పర్ధం లేని సినిమాలో నటించడమే విచిత్రం. మలి ప్రయత్నంతోనైనా ఇలాటి పొరపాటు చేయకుండా వుంటే బావుంటుంది.

హీరోయిన్ గీతిక అందంగా వుంది. పాత్ర అంతంత మాత్రమే వుంది. ‘జయం’ హీరోయిన్ సదా లాయర్ పాత్రలో ఫర్వాలేదు. విలన్ గా రజత్ బేడీ కూడా ఫర్వాలేదు. పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో క‌మ‌ల్ కామ‌రాజు, ఇంకో పోలీసు పాత్రలో రవికాలే వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారు.

సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం మంచి విజువల్స్ ని పట్టుకుంది. ముఖ్యంగా ఫారెస్ట్ సీన్స్ లో. ఆర్పీ పట్నాయక్ సంగీతం క్రేజ్ ఏం క్రియేట్ చేయలేదుగానీ, ఇప్పటి స్టయిలు మ్యూజిక్ కి కాస్త దగ్గరగా వుంది. ఒకప్పటి తేజ సినిమాలు యువతని ఉర్రూత లూగించే మ్యూజికల్ హిట్స్. ఇప్పటి ఈ సినిమా వాటి దరిదాపుల్లో కూడా లేకపోవడం హైలైటయ్యే అంశం.


Full View


Tags:    
Advertisement

Similar News