Top Gear Movie Review: 'టాప్ గేర్' – మూవీ రివ్యూ {2/5}

Aadi Saikumar's Top Gear Telugu Movie Review: కొత్త దర్శకులు ఆది తోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పుడు ఇంకో కొత్త దర్శకుడు శశికాంత్ అదే యాక్షన్ జానర్ లో ‘టాప్ గేర్’ తీశాడు. ఆదికి ఈ 18వ ప్రయత్నం.

Advertisement
Update:2022-12-30 16:51 IST

Top Gear Movie Review: ‘టాప్ గేర్’ – మూవీ రివ్యూ {2/5}

చిత్రం : టాప్ గేర్

రచన -దర్శకత్వం : శశికాంత్

తారాగణం : ఆది సాయికుమార్, రియా సుమన్, బ్రహ్మాజీ, శత్రు, సత్యం రాజేష్, మైమ్ గోపి, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్,

బ్యానర్‌ : శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్

నిర్మాత ; కెవి శ్రీధర్ రెడ్డి

విడుదల : డిసెంబర్ 30, 2022

రేటింగ్ : 2/5

ఆది సాయి కుమార్ వరస ఫ్లాప్స్ తో సంబంధం లేనట్టు సినిమాలు చేసుకుంటూ పోవడమే సిద్ధాంతంగా పెట్టుకున్నట్టు కన్పిస్తోంది. 2011 లో రంగ ప్రవేశం చేస్తూ నటించిన 'ప్రేమ కావాలి' తప్ప హిట్టు ఎరగని హీరోగా 17 ఫ్లాప్ సినిమాలు చేసుకుంటూ పోవడం తన కే చెల్లింది. 2022 లోనే అతిధి దేవోభవ, బ్లాక్, తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెలో అనే నాల్గూ వరసగా ఫ్లాపయినా అదే వరసలో ఇప్పుడు అయిదవదీ నటించాడు. సాఫ్ట్ రోల్స్ ప్రయత్నిస్తే ఫలించకపోవడంతో మాస్ హీరోగా యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అసలు తనకేది సూటవుతుందో తెలియని పరిస్థితితో ఒకే మూసలో సినిమాలు చేస్తూ ఫ్లాపవుతున్నాడు. ఇన్ని ఫ్లాప్స్ వస్తున్నా కొత్త దర్శకులు ఆది తోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పుడు ఇంకో కొత్త దర్శకుడు శశికాంత్ అదే యాక్షన్ జానర్ లో 'టాప్ గేర్' తీశాడు. ఆదికి ఈ 18వ ప్రయత్నం.

కథ

అర్జున్ (ఆది సాయి కుమార్) కొత్తగా పెళ్ళయిన క్యాబ్ డ్రైవర్. సాయంత్రం త్వరగా ఇంటికొస్తానని భార్య ఆద్య (రియా సుమన్) కి చెప్పి వెళ్తాడు. తీరా ట్రిప్పులు ముగించుకుని ఇంటికి వెళ్తూంటే క్యాబ్ లో ఇద్దరు డ్రగ్ స్మగ్లర్లు (బ్రహ్మాజీ, సత్యం రాజేష్) ఎక్కి తొందర పెడతారు. పేరు మోసిన డ్రగ్ డాన్ సిద్ధార్థ్ (మైమ్ గోపి) తన ఆపరేషన్స్ ని సింగపూర్ కి మార్చుకోవాలని ఆ ఇద్దర్నీ సుబ్బారావు దగ్గరికి పంపుతాడు. సుబ్బారావు దగ్గర్నుంచి ఒక ముఖ్యమైన బ్యాగు తీసుకుని వస్తున్న ఇద్దరూ గొడవపడి కాల్చుకుని చచ్చిపోతారు. దీంతో సిద్ధార్థ్ అర్జున్ భార్య ఆద్యని కిడ్నాప్ చేసి బ్యాగు తెచ్చిచ్చి ఆద్యని విడిపించుకోమంటాడు. రోడ్డు మీద బ్యాగు ఎక్కడ పడిపోయిందో అర్జున్ కి తెలీదు. ఇప్పుడేం చేశాడు? ఆద్యని ఎలా విడిపించుకున్నాడు అర్జున్? ఇదీ ఒక రాత్రంతా జరిగే కథ.

ఎలావుంది కథ

హీరో హత్యలో ఇరుక్కోవడం, ఓ బ్యాగు కోసం వేట అనే కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఒక రాత్రంతా జరిగే కథలతో కూడా సినిమాలొచ్చాయి. మరి 'టాప్ గేర్' లో కొత్తదనమేమిటి? తెలిసిన కథనే ఫస్టాఫ్ లో కూర్చుబెట్టేలా కథనం చేయడం కొత్తదనం. రాత్రిపూట సైబరాబాద్ విజువల్స్ కొత్త దనం. ఆది రియలిస్టిక్ క్యారక్టర్ కొత్తదనం. క్యారక్టర్ కి తగ్గట్టు ఆది నటనని మెరుగుపర్చుకోవడం కొత్తదనం. ఫస్టాఫ్ సంఘటనల్లో థ్రిల్, సస్పెన్స్ కొత్తదనం. సెకండాఫ్ యాక్షన్ కి కథని ఏర్పాటు చేసిన విధానం కొత్తదనం.

సెకండాఫ్ తీరా ఏర్పాటు చేసిన కథని నడపడంలో కొత్తదనమంతా మాయమై మందకొడితనం ముప్పుతిప్పలు పెడుతుంది. ఫస్టాఫే టాప్ గేర్. సెకండాఫ్ గేర్లు సరిగా పడని డ్రైవింగ్. పోలీసులతో, డ్రగ్ కింగ్ తో ఆదికి వున్న ప్రమాదాలు, మధ్యలో భార్య, పోలీసులు- డ్రగ్ కింగ్ వాళ్ళ ప్రయోజనాలతో గేమ్ ఆడుకోవడానికి అవకాశమున్నా దాన్ని కథలో భాగం చేయకపోవడం వంటి బలహీనతలు సెకండాఫ్ ని విఫలం చేశాయి. హడావిడిగా ముగించిన తీరుతో కూడా సెకండాఫ్ తేలిపోయింది. దర్శకుడు ఫస్టాఫ్ లో చూపించిన టాలెంట్ ని సెకండాఫ్ లో ఎందుకు చూపించుకో లేకపోయాడన్నదే పెద్ద సస్పెన్స్.

నటనలు –సాంకేతికాలు

పైన చెప్పుకున్నట్టు ఆదికి ఈ రియలిస్టిక్ పాత్ర, దాంతో నటన మాత్రమే కలిసివచ్చిన అంశాలు. వీటికి తగ్గ విషయం సినిమాలో లేకపోవడం సక్సెస్ కోసం తన వేటకి మైనస్. హీరోయిన్ రియా సుమన్ గ్లామర్ తో ఆకర్షిస్తుంది. నటించడానికి పెద్దగా పాత్ర లేదు. కిడ్నాపైన పాత్రగా బందీ అయిపోయింది. విలన్ గా మైమ్ గోపి బలమైన నటన ప్రదర్శించాడు. అలాగే డిసిపి గా శత్రు కూడా ఓకే. బ్రహ్మాజీ, సత్యం రాజేష్ లు రొటీనే. ఫస్టాఫ్ లో ఆసక్తికరంగా సెటప్ చేసిన పాత్రల్ని సెకండాఫ్ లో అంతే ఆసక్తికరంగా నడపలేకపోయిన లోపం నటులకి శాపంగా మారింది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతంలో ఒక పాట వుంది. నేపథ్య సంగీతం యావరేజ్, సాయి శ్రీరామ్ కెమెరా వర్క్ తో బాటు. రాత్రిపూట సైబరాబాద్ దృశ్యాలు అద్భుతంగా వున్నా, కథ ఒకే లొకేషన్లో నడుస్తున్నట్టు అన్పించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సింది.

మొత్తానికి ఈసారి కూడా అదికి కలిసి రాలేదు. ఈ సంవత్సరం స్పీడు పెంచి ఐదు సినిమాలు చేసినా గేర్లు సరిగా పడలేదు. క్యాబ్ ట్రబుల్ ఈ సంవత్సరానికి రిపేరు కోరుకుంటోంది. కొత్త సంవత్సరమైనా తేడాగా వుంటుందేమో చూడాలి.

Tags:    
Advertisement

Similar News