సరికొత్త క్రెడిట్ కార్డు మోసాలు! జాగ్రత్తలు ఇలా..
ఫిషింగ్ స్కామ్, సిమ్ స్వాపింగ్, స్కిమ్మింగ్ స్కామ్, అప్లికేషన్ స్కామ్.. ఇలా క్రెడిట్ కార్డు స్కాముల్లో చాలా రకాలున్నాయి.
రోజురోజుకీ క్రెడిట్ కార్డుల వినియోగంతో పాటు క్రెడిట్ కార్డు స్కాములు కూడా పెరుగుతున్నాయి. క్రెడిట్ కార్డులు వాడేవాళ్లను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు కొత్తరకాల మోసాలకు పాల్పడుతున్నారు. వీటి నుంచి ఎలా తప్పించుకోవాలంటే..
ఫిషింగ్ స్కామ్, సిమ్ స్వాపింగ్, స్కిమ్మింగ్ స్కామ్, అప్లికేషన్ స్కామ్.. ఇలా క్రెడిట్ కార్డు స్కాముల్లో చాలా రకాలున్నాయి. ఇవెలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిషింగ్ స్కామ్
డేటా చోరీనే ఫిషింగ్ అనొచ్చు. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ను దొంగిలించి తద్వారా క్రెడిట్ కార్డుని యాక్సెస్ చేయడమే ఈ స్కామ్ ఉద్దేశం. క్రెడిట్ కార్డు సంస్థల్లా నమ్మించి లింక్స్ లేదా ఓటీపీల వంటివి పంపి మీ డేటాను దొంగిలించే ప్రయత్నం చేస్తారు స్కామర్లు. వారి వలలో చిక్కుకుంటే ఇక వెంటనే మీ క్రెడిట్ బ్యాలెన్స్‌ను జీరో చేస్తారు.
సిమ్ స్వాపింగ్
తాజాగా వెలుగులోకి వచ్చిన మరో కొత్త రకం స్కామ్ పేరు సిమ్ స్వాపింగ్. స్కామర్లు మీ పేరు, ఆధార్ కార్డు, క్రెడిట్ కార్డు వివరాలు దొంగిలించి వాటి సాయంతో కొత్త సిమ్ తీసుకుని క్రెడిట్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్‌ను మార్చే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి మోసాల బారిన పడకూడదంటే మొబైల్ లేదా సిమ్‌ను ఎక్కువరోజులు స్విఛాఫ్ చేసి ఉంచకుండా చూసుకోవాలి. సిమ్ వెరిఫికేషన్ పేరుతో మెసేజ్‌లు వచ్చినా, ఉన్నట్టుండి నెట్‌వర్క్ ఆగిపోయినా వెంటనే మొబైల్ ఆపరేటర్‌కు కాల్ చేసి కంప్లెయింట్ చేయాలి.
స్కిమ్మింగ్ స్కామ్
తరచుగా క్రెడిట్ కార్డులను స్వైప్ చేసేవాళ్లను టార్గెట్ చేసుకుని స్కామర్లు స్కిమ్మింగ్ అనే స్కామ్‌ను అమలు చేస్తారు. పబ్లిక్ ప్లేసుల్లో ఉన్న స్వైపింగ్ మెషీన్స్‌ను హ్యాక్ చేసి.. అందులో వారి మాల్వేర్ ఇన్‌స్టాల్ చేస్తారు. ఆ మెషీన్స్‌లో స్వైప్ చేసినప్పుడు కార్డు డేటా అంతా వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. అలా డబ్బు అంతా మాయం అవుతుంటుంది. అందుకే పబ్లిక్ ప్లేసుల్లో క్రెడిట్ కార్డుల్ని స్వైప్ చేసేటప్పుడు జాగ్రత్త వహించడం అవసరం.
ఇకపోతే క్రెడిట్ కార్డు బిల్ కట్టినప్పుడు వచ్చే రిసీట్‌లను పారవేయడం, ఆన్‌లైన్‌లో లోన్స్ కోసం సెర్చ్ చేయడం వంటి యాక్టివిటీస్ కూడా స్కామ్స్‌కు వీలు కల్పిస్తాయి. అలాగే ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు ఎక్కడపడితే అక్కడ ఎంటర్ చేయడం కూడా అంత మంచిది కాదు. ఇలాంటివన్నీ స్కామర్లకు ప్రైమరీ డేటాలాగా పనికొస్తాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.