Pradan Mantri Suryodaya Yojana | పర్యావరణ పరిరక్షణ.. మధ్య తరగతికి కరంట్ బిల్లు నుంచి రిలీఫ్.. సూర్యోదయ యోజన బెనిఫిట్స్ ఇవీ.. !
Pradan Mantri Suryodaya Yojana | ప్రధానమంత్రి సూర్యోదయ యోజన.. దేశవ్యాప్తంగా కోటి ఇండ్లపై రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ఇన్‌స్టల్ చేయాలన్నది ఈ స్కీమ్ ప్రధానోద్దేశం.
Pradan Mantri Suryodaya Yojana | ప్రధానమంత్రి సూర్యోదయ యోజన.. దేశవ్యాప్తంగా కోటి ఇండ్లపై రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ఇన్‌స్టల్ చేయాలన్నది ఈ స్కీమ్ ప్రధానోద్దేశం. అయోధ్యలో సోమవారం రామ మందిర ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ఢిల్లీకి తిరిగి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్త భక్తులంతా సూర్యవంశీ శ్రీరామ చంద్ర భగవానుడి నుంచి వచ్చే కిరణాలతో శక్తి పొందుతారు. అయోధ్యలో పవిత్ర ఘడియల్లో రామ మందిర ప్రాణ ప్రతిష్ట పూర్తి చేసుకున్న వేళ.. ఇండ్లపై సొంత సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడంతో భారతీయులను మరింత శక్తిమంతుల్ని చేయాలన్నదే నా సంకల్పం అని తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. `అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని హస్తినకు తిరిగొచ్చిన తర్వాత మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం - దేశవ్యాప్తంగా కోటి ఇండ్లపై రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్ ఇన్‌స్టల్ చేయాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం ప్రారంభించాం. దీనివల్ల పేదలు, మధ్యతరగతి ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం తగ్గడంతోపాటు ఇంధన రంగంలో భారత్ స్వావలంభన సాధిస్తుంది` అని పేర్కొన్నారు.
బలహీన వర్గాల కుటుంబాల ఇండ్లపై రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఇలా
ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం కింద ఆర్థికంగా బలహీన వర్గాల ఇండ్లపై ప్రభుత్వమే రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ను ఇన్‌స్టల్ చేస్తుంది. ఇది సొంతింటి విద్యుత్ అవసరాలను పరిపూర్ణం చేయడంతోపాటు అదనపు విద్యుత్ విక్రయంతో ఆదాయం కూడా సంపాదించొచ్చు. ఇంటి కప్పుపై ఇన్‌స్టాల్ చేసే రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌లలో సోలార్ ప్లేట్లు అమరుస్తారు. సూర్య భానుడి కిరణాల నుంచి వచ్చే ఇంధనాన్ని ఇముడ్చుకుని విద్యుత్ తయారు చేసే టెక్నాలజీ ఇది. సౌర శక్తిని విద్యుత్‌గా మార్చేందుకు సోలార్ ప్లేట్లలో ఫోటో వోల్టాయిక్ సెల్స్ కూడా అమరుస్తారు. ప్రస్తుతం పవర్ గ్రిడ్ ద్వారా సరఫరా అవుతున్న విద్యుత్ మాదిరిగానే సౌర విద్యుత్ పని చేస్తుంది.
ఇలా సోలార్ పానెల్స్ ఇన్‌స్టలేషన్ ఖర్చు
సోలార్ ప్యానెల్‌తో అనుసంధానించే ఇన్వర్టర్, మాడ్యూల్ ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి ఖర్చు ఆధారపడి ఉంటుంది. ఒక కిలోవాట్ సోలార్ ప్యానెల్ ఇన్‌స్టల్ చేయడానికి రూ.45,000 నుంచి రూ.85,000 మధ్య ఖర్చవుతుంది. ఇందులో బ్యాటరీ ఖర్చు కూడా ఉంటది. 5 కిలోవాట్ల శక్తి గల సోలార్ ప్యానెల్ ఇన్‌స్టల్ చేస్తే రూ.2.25 - రూ.3.25 లక్షల మధ్య ఖర్చు వస్తుంది. అయినా, మనకు ప్రతి నెలా వచ్చే విద్యుత్ బిల్లు ఖర్చు చూసుకుంటే ఐదారేండ్ల తర్వాత మీ బిల్లు పూర్తిగా జీరో అవుతుంది. అంటే సోలార్ ప్యానెల్స్ ఇన్‌స్టలేషన్ ఖర్చు ఐదారేండ్లలో రికవరీ అవుతుంది.
ప్రస్తుతం నేషనల్ రూఫ్‌టాప్ స్కీమ్ తరహాలోనే కేంద్రం సౌర విద్యుత్ పథకం అమలు చేస్తున్నది. ఈ పథకం కింద మీరు సొంతంగా మీ ఇంటి రూఫ్‌పై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని కోరుకుంటే.. మూడు కిలోవాట్ల కెపాసిటీ వరకూ ఏర్పాటు చేసుకునే సోలార్ ప్యానెల్స్ పై కేంద్రం 40 శాతం సబ్సిడీ అందిస్తుంది. ఒకవేళ మీరు 10 కిలోవాట్ల కెపాసిటీ గల ప్యానెల్స్ అమర్చుకుంటే 20 శాతం సబ్సిడీ అందిస్తుంది. విద్యుత్ పంపిణీదారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేంద్రప్రభుత్వ నూతన సంప్రదాయేతర ఇంధన శాఖ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది.
ప్రస్తుతం అమలులో రెండోదశ సోలార్ సిస్టమ్
ప్రస్తుతం 2023 నవంబర్ 30 నుంచి దేశవ్యాప్తంగా రెండో దశ రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్ అమలవుతున్నది. దీని కింద 2651మెగావాట్ల కెపాసిటీ గల ప్యానెల్స్ దేశవ్యాప్తంగా ఇన్‌స్టల్ చేశారు. రెండు దశల్లో సోలార్ విద్యుత్ సిస్టం కింద దేశమంతటా 10,407 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తవుతుందని కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ ఇటీవలే చెప్పారు.
2026 మార్చి వరకూ సబ్సిడీ లభ్యం
రెండో దశ రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్ స్కీమ్ 2026 మార్చి నెలాఖరు వరకూ ఇటీవలే పొడిగించింది కేంద్రం. ఈ ప్రోగ్రామ్ కింద జనరల్ క్యేటగిరీ రాష్ట్రాలకు మూడు కిలోవాట్ల కెపాసిటీ గల ప్యానెల్స్‌ను సరఫరా చేసింది కేంద్రం. దీంతో ఇక కిలోవాట్ కెపాసిటీ ప్యానెల్‌పై రూ.14,588 సబ్సిడీ అందిస్తున్నది. రెండో దశలో మొత్తం రూ.11,814 కోట్లు ఖర్చు చేస్తామని కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్ తెలిపారు. ఇందులో విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ.4,985 కోట్ల ఇన్‌సెంటివ్‌లతోపాటు కేంద్ర ఆర్థిక సాయం రూ.6,600 కోట్లు కూడా ఉన్నాయి.
సోలార్ ప్యానెల్ సిస్టమ్ బెనిఫిట్లు ఇవీ
సోలార్ ప్యానెల్ సిస్టమ్ సాయంతో ఇంటి వద్దే విద్యుత్ తయారు చేయొచ్చు.
పవర్ గ్రిడ్ నుంచి పొందే విద్యుత్‌తో పోలిస్తే సౌర విద్యుత్ చౌక, సౌకర్యవంతంగా ఉంటుంది.
సోలార్ ప్యానెల్ ఇన్‌స్టల్ చేయడానికి విడిగా స్పేస్ అవసరం లేదు. రూఫ్ పైనే అమర్చవచ్చు.
సోలార్ ప్యానెల్స్‌పై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీతో వాటిని కొనుగోలు చేయడం చాలా తేలిక.
సోలార్ ప్యానెల్స్ లైఫ్ 25 ఏండ్లు ఉంటుంది. మరమ్మతులు, మెయింటెనెన్స్ అవసరం లేదు.
సమయానుకూలంగా ప్యానెల్స్‌ను శుభ్రం చేస్తే వాటిపై సూర్య కిరణాలు సరిగ్గా పడతాయి.
పర్యావరణ సమస్య రాదు. కర్బన ఉద్గారాల నియంత్రణతోపాటు పర్యావరణ పరిరక్షణ సాధ్యం.
నేషనల్ రూఫ్ టాప్ స్కీం కింద కేంద్ర ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ ఇస్తోంది.