చౌక ఉత్పత్తుల కోసం.. అమెజాన్ బజార్ వచ్చేసింది
అమెజాన్ యాప్‌లోనే ఈ బజార్ కూడా అందుబాటులో ఉంది.
అమెజాన్ అంటే ఖరీదైన వస్తువులే ఉంటాయి. 200, 300 రూపాయల వస్తువు కావాలంటే మీషో లేదా షాప్సీ లాంటి యాప్స్‌లో వెతకాలి.ఇదీకస్టమర్ల అభిప్రాయం. దీన్ని మార్చేస్తూ కేవలం 600 రూపాయల్లోపు ధరలో వస్తువులు మాత్రమే అమ్మేందుకు అమెజాన్ బజార్ అనే విభాగాన్ని కొత్తగా ప్రవేశపెట్టింది. అమెజాన్ యాప్‌లోనే ఈ బజార్ కూడా అందుబాటులో ఉంది.
ఏమేం దొరుకుతాయి?
బట్టలు, చెప్పులు, వాచీలు, డెకరేటివ్ ఐటమ్స్, వంటగదిలోకి, బెడ్‌రూమ్‌లోకి అవసరమైన చిన్న చిన్న ఉత్పత్తులు దొరుకుతాయి. బెడ్‌షీట్లు, డోర్ కర్టెన్లు, హ్యాండ్‌బ్యాగులు, చిన్నపిల్లల దుస్తులు, నైట్ డ్రస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. బజార్‌లో వీటిని అమ్మే సెల్లర్ల దగ్గర నుంచి ఎలాంటి ఫీజూ తీసుకోవడం లేదు.
ఇవి పరిమితం
పేమెంట్ ఆప్షన్లలో క్రెడిట్ కార్డు వంటివి లేవు. ఓన్లీ యూపీఐ లేదా క్యాష్ ఆన్ డెలివరీ మాత్రమే ఉంది. అమెజాన్ పే బ్యాలెన్స్ ఉన్నా తీసుకుంటుంది. అమెజాన్‌లో వినియోగదారులకు నగరాల్లో అయితే ఒకటి రెండు రోజుల్లో.. కొన్ని ఉత్పత్తులయితే గంటల్లోనే డెలివరీ అయిపోతాయి. కానీ ఈ బజార్ విభాగంలో కొన్న వస్తువులకు మాత్రం నగరాల్లో కూడా 5,6 రోజుల డెలివరీ టైమ్ చూపిస్తోంది.
ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యాప్‌లోనే
బజార్ అనే ఆప్షన్ ప్రస్తుతం అమెజాన్ ఆండ్రాయిడ్ యాప్‌లో మాత్రమే ఉంది. యాప్ ఓపెన్ చేయగానే టాప్ లెఫ్ట్ కార్నర్‌లో బజార్ అనే సింబల్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి, ఆ విభాగంలోకి వెళ్లొచ్చు. అయితే ఐవోఎస్ యాప్ ఇంకా రాలేదు. కాబట్టి ఐఫోన్‌లో, ఇతర యాపిల్ డివైస్‌ల్లో దీన్ని ప్రస్తుతానికి యాక్సెస్ చేయలేం.