పట్టాభి స్నానం ముగించి పట్టుపంచ కట్టుకొని పూజామందిరం ముందు పీటవాల్చుకుని కూర్చుని, దీపం వెలిగించాడు . పెదాలతో శ్లోకాలు జపిస్తూ, మునివేళ్ళతో పువ్వులు అమ్మ వారి మీద విసురుతున్నాడే గానీ మనసు మాత్రం పూజలో లీనమవటం లేదు!. రాత్రంతా స్థిమితం లేని ఆలోచనలతో సరిగ్గా నిద్ర పట్టక తల చాలా భారంగా ఉంది.
పూజ ముగించి వీధి వరండాలోకి వెళ్లేసరికి భార్య లలితమ్మ వేడి కాఫీ గ్లాసు అందిస్తూ, "ఈ వేళ రాజమ్మ రాలేదండి.. ఎక్కడి పనులు అక్కడే ఉండి పోయాయి.." అంటుండగానే వీధి గేటు దగ్గర శ్రీను గాడు ప్రత్యక్షమయ్యాడు. వాడి ముఖం విచారంగా ఉంది!
"అమ్మగారూ! రాజమ్మ కి రాత్రంతా విపరీతమైన జ్వరం... కలవరింతలు...పొద్దుటికి కాస్త తెప్పరిల్లింది. మీరు ఒక్కరూ పనులు చేసుకోలేరని , నన్ను వెళ్ళమంది రాజమ్మ!" అంటూ గబగబా చీపురు తీసుకుని, పెరట్లో చెట్ల కింద రాలిన ఆకులు అన్నీ తుడిచి పోగు పెడుతూ, వాడి పనిలో లీనమై పోయాడు!
శీను గాడికి పాతికేళ్లు ఉంటాయి. వాడి పెళ్ళాం రాజమ్మ కి ఇరవై ఏళ్ళు ఉంటాయి. ఇద్దరూ చూడ చక్కనైన జంట! శీనుగాడి మాట ఎంతో స్పష్టంగా, ఉచ్చారణ ఎంతో చక్కగా, ఉంటుంది. వాడితో కబుర్లు చెప్పే సమయంలో, "ఏరా.. శీనూ.. మీరు సముద్రం మీదకు వేటకు వెళ్తారు కదా.... నీ మాటల్లో ఇంత స్వచ్ఛత ,ఇంత చక్కని ఉచ్చారణ ఎలా వచ్చాయిరా?" అంటూ నవ్వుతూ అడిగితే ;"మేము సరస్వతీ పుత్రులం అమ్మగారూ !మీ ఋషులు మా తండ్రులు కదా!" అని మేలమాడతాడు.
ఆ పూట పెరట్లో అంట్లు తోమడం మినహా మిగతా పనులన్నీ ముగించి ,లలితమ్మ చేతి కాఫీ తాగి,
"రేపు తెల్లారగట్టే వస్తా అమ్మా !" అంటూ వెళ్ళిపోయాడు.
పట్టాభి కాఫీ తాగటం ముగించి దీర్ఘాలోచనలో పడిపోయాడు! తన తాత ముత్తాతలు, తండ్రి... అందరూ చేయి తిరిగిన వంటవాళ్ళు. పెళ్లిళ్లకు, ఉపనయనాలకు వంటలు చేయటానికి తన కుటుంబమే ప్రసిద్ధి. చక్కగా ఆ రోజుల్లో ఐదు రోజుల పెళ్ళిళ్ళకు .... ఎన్నివందల మందికి అయినా సరే, పొద్దున్నే ఐదు గంటలకు ఫిల్టర్ కాఫీ అందించవలసిందే !
ఇడ్లీ ,వడా ,పెసరట్టు ఉప్మా, రెండు చట్నీలు కారపుపొడి నెయ్య సాంబారు లతో చక్కని ఫలహారాలు ఎనిమిది గంటలకల్లా సిద్ధమై పోయేవి!
మధ్యాహ్నం పన్నెండయ్యే సరికి భోజనంలో అరిటాకు నిండా రకరకాల కూరలతో బాటు రుచికరమైన బూర్లు బొబ్బట్లు పులిహార వంటి అచ్చమైన తెలుగు వంటకాలు చవులూరించేవి!
అయితే కాలక్రమేణా మార్పులు వచ్చాయి! మన తెలుగు వంటకాలకు ఆదరణ తగ్గింది.పులావులు, మసాలా కూరలు ,దమ్ బిర్యాని, నూడిల్స్ మొదలైన వాటికోసం బోలెడు డబ్బు ఖర్చుపెట్టి, పెద్ద హోటళ్లకు కేటరింగ్ ఇచ్చేస్తున్నారు!
తనకి లలితకీ రోజు గడవడానికి పెద్దగా లోటు లేకపోయినా ,ప్రస్తుతం గిరాకీ తగ్గడంతో మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటోంది!
అదృష్టం కొద్దీ మొన్ననే రిటైర్డ్ ప్రిన్సిపాల్ మోహన్ రావు గారు కబురు పెట్టారు.
"పట్టాభీ !.. తరతరాలుగ మా ఇంట్లో ప్రతి శుభకార్యానికి మీ కుటుంబమే వంటలు చేస్తున్నారు. మొన్ననే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న మా శ్వేత కి పెళ్లి కుదిరింది. అమెరికాలోని పిజ్జాలకు బర్గర్ లకు మొహం మొత్తి పోయి , తన పెళ్లి విందు మాత్రం తెలుగింటి సాంప్రదాయ రుచులతో ఉండాలని పట్టుబడుతోంది. రేపు మే ఆరో తారీఖు రాత్రి పెళ్లి! అంటే ఇంకా నెల రోజులు ఉంది. పెళ్ళివారు ఆరు ఉదయాన్నే వచ్చి ఏడు ఉదయం తిరిగి వెళ్ళిపోతారు. నువ్వు మీ వాళ్ళని తీసుకుని వచ్చి వంటల వ్యవహారం చూసుకోవాలి. ఇదిగో ప్రస్తుతానికి ఈ ఐదు వేలూ ఉంచు! ఇవాళ మంచి రోజు కదా!" అంటూ అడ్వాన్సు చేతిలో పెట్టారు మోహన్ రావు గారు.
పట్టాభి కి చాలా ఆనందమైంది. ముహూర్తం ఇంకా పది రోజులు ఉందనగానే తన అసిస్టెంట్లు అందరికీ కబురు పంపాడు. కామేశం , రమణ, సూరిబాబు, వర్ధనమ్మ ,...ఇలా అందరూ కబురు అందగానే మహదానంద పడిపోయారు!
అయితే,ముహూర్తం రెండు రోజులుందనగా చిన్న తుంపర మొదలైంది! 'కాలం కాని కాలంలో ఈ వర్షం ఏమిటి?' అనుకున్నాడు .రాత్రి టీవీ లో తుఫాన్ హెచ్చరిక విని రాత్రంతా అస్తవ్యస్తమైన ఆలోచనలతో గడిపాడు! కలత నిద్రతో తల భారంగా అనిపించడానికి కారణం ఇదే!!
అంతలోనే మోహన్ రావు గారు నుండి ఫోను!
" పట్టాభి... తుఫాన్ హెచ్చరిక విన్నావు కదా... దైవం రక్షించి ఆ వేళకు అంతా సుఖంగానే ఉంటుందని అనుకుంటున్నాను! సోమవారం పొద్దుటికి పెళ్ళివారు అందరూ కళ్యాణమంటపానికి చేరుతారు. మీరంతా రెడీయేనా?" అని అడిగారు.
"మేమంతా రెడీ సార్ !సమయానికి వచ్చేస్తాం! మీరేం కంగారు పడకండి!" అన్నాడు పట్టాభి.
ఇక ' తెల్లవారుజామునే కల్యాణ మండపానికి బయలుదేరాలి' అనగా, సమస్య మొదలైంది!
అసిస్టెంట్ లు కామేశం, రమణ వేరే పెళ్లి కి వెళ్లి అక్కడ చిక్కుకు పోయారట! ఇక సూరిబాబు -వర్ధనమ్మ భార్యా భర్తలు! 'తాము చాలా లోతట్టు ప్రాంతంలో ఉంటున్నామని , తమ ఏరియా మునిగిపోయిందని బయటకు రాలేని పరిస్థితి అనీ' నిరుత్సాహంగా ఫోను లో చెప్పారు .
తాను, తన భార్య లలితమ్మ నడుం కట్టినా కూడా, కనీసం ఇంకొక్కరి సహాయం అయినా కావాలి! అతడు కూడా వడ్డన తెలిసిన బ్రాహ్మణుడు అయి ఉండాలి!
'ఏం చేయడం?' పట్టాభి వరండాలో నిలబడి ఆకాశం వంక తదేకంగా చూస్తున్నాడు. సన్నగా తెల్లవారిపోయింది.
అంతలో పెరట్లో మాటలు వినిపిస్తున్నాయి.
"...సముద్రంమీద వేటకి వెళ్ళి , నిన్న సాయంకాలం తిరిగి వచ్చానమ్మా! ఈ ముసురు బాగా తగ్గితే గాని మళ్ళీ సముద్రం మీదకి వెళ్ళం... రాజీని వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించేశాను... "అంటూ ఇంకా ఏదో చెబుతున్నాడు.
శీను మాటలు వినగానే పట్టాభి మెదడులో చటుక్కున ఏదో ఆలోచన వచ్చింది! గబగబా పెరట్లో కి వెళ్ళాడు!. ఏదో స్థిర నిశ్చయానికి వచ్చిన వాడిలా శీను దగ్గరకు వెళ్లి "శీను ! నువ్వు వెంటనే నూతి దగ్గర స్నానం చేసి రా!" అంటూ వాడికి తువ్వాలు అందించాడు.
వాడు ఆశ్చర్యంగా తువ్వాలు అందుకొని ఏదో మాట్లాడబోతూ ఉంటే," వెంటనే తల మీద స్నానం చేసి రా... చెప్తాను!" అన్నాడు పట్టాభి.
స్నానం ముగించి వచ్చిన శీనుకి ఓ పట్టు పంచె అందించి, దాన్ని కట్టుకోవడం నేర్పాడు!
"బాబు! ఏమిటిదంతా?" అంటూ విస్తుపోతూ అడిగాడు శీను.
"ఏం మాట్లాడకు... నేను చెప్పినట్టు చెయ్యి !లోపలికి పద!" అంటూ పూజ గదిలో వత్తుల పెట్టి తెరిచి కొత్త యజ్ఞోపవీతం బయటికి తీశాడు. ఏ మాత్రం సంకోచించకుండా దానికి కుంకుమ పసుపు బొట్లు పెట్టి , గది బయట నిలబడి ఉన్న శీనుగాడి తల నుంచి భుజం మీదుగా యజ్ఞోపవీతాన్ని మెడలో వేశాడు.నుదుట విభూతి రాశాడు !కుంకుమ బొట్టు పెట్టాడు!
అసలే అందగాడైన శ్రీను ఈ వేషంలో మెరిసిపోతున్నాడు! అప్పుడే జ్ఞానం సిద్ధించిన యోగీశ్వరునిలా ఉన్నాడు!
ఓ రెండు నిమిషాల తర్వాత,
"అయ్యగారు.. ఏమిటిదంతా?" అంటూ అడిగాడు సీనుగాడు,భయంతో పట్టాభి వంక చూస్తూ!
"ఇంకేం మాట్లాడకు... నావెంట రా! నేను చెప్పిన పని చెయ్యి! అంతే!" అంటూ వాడినింక మాట్లాడనివ్వలేదు. ఇదంతా దూరం నుండి స్థాణువులా నిలబడి పోయి చూస్తున్న లలితమ్మ ఏదో అనబోయింది! ఆమెకు ఆ అవకాశం ఇవ్వలేదు పట్టాభి!
అంతలోనే మోహన్ రావు గారి ఇంటి నుండి కారు వచ్చింది. ముగ్గురూ కారులో బయలుదేరి కల్యాణ మండపానికి ఐదు నిమిషాల్లో చేరుకున్నారు.
శీనుగాడు కాస్తా, శ్రీనివాసరావు అయ్యాడు!
ఉదయం నుండి రాత్రి వరకు పట్టాభి ఏ పని చెప్తే ఆ పని క్షణాలలో ఉత్సాహంగా చేస్తూ, ఏనాడూ అలవాటులేని వడ్డన కూడా బ్రహ్మాండంగా జరిపించి, అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.అతడు వంటలో తనకు అందించిన సాయానికి, వడ్డనలో చూపించిన చతురతకు పట్టాభి మంత్రముగ్ధుడై పోయాడు !
మర్నాడు పొద్దుట పెళ్ళివారు వెళ్ళిపోయిన తర్వాత కాఫీ పలహారాలు ముగించి పది గంటలకుఇంటికి తిరిగి వచ్చారు. పట్టాభి శ్రీనుకు మూడు వేల రూపాయలు ముట్టచెప్పాడు. శ్రీను ఎంతో ఆనందంతో, మరెంతో ఆశ్చర్యంతో ఆ డబ్బు తీసుకున్నాడు!!
అంతలోనే అప్పటిదాకా భుజం మీద అసౌకర్యంగా ఉన్న జంధ్యం అతడికి గుర్తుకు వచ్చింది.
"దీన్ని ఏం చేయమంటారు?" అంటూ జంథ్యాన్ని బయటకు తీసిచూపించాడు .
పట్టాభి తన రెండు చేతులతో ఆ యజ్ఞోపవీతాన్ని తీసి కళ్ళకద్దుకుని "ఈ జంధ్యమేరా... నా పరువు కాపాడింది ! ఈ జంధ్యమేరా నిన్ను బ్రహ్మ గా చేసింది.... నీ శుచి శుభ్రతలతో, సంస్కారంతో, నువ్వు చక్కగా ప్రవర్తించి నా గౌరవం దక్కించావు రా.... ఇది అవసరానికి మళ్లీ ఉపయోగ పడుతుంది!" అంటూ దాన్ని శీను మెడలో నుంచి తీసి, భద్రంగా దాచాడు.
శీనుగాడిని సాగనంపి, స్నానం చేసి, యధావిధిగా పూజామందిరంలో కూర్చున్నాడు.దీపం వెలిగించాడు .ఆ దీపం వెలుగులో అమ్మవారి స్వరూపం దివ్యమంగళ విగ్రహంలా విరాజిల్లుతున్నదని గ్రహించాడు!
"తల్లీ! నన్ను ఆశీర్వదించు! అనుగ్రహించు!సాటి మనిషిని మనిషిగా చూశాను! నాకు అండగా నిలబడు!" అంటూ అమ్మవారిని వేడుకున్నాడు.
చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం మనస్సులో ప్రశాంతతగా రూపాంతరం చెంది, పెదవులపై చిరు దరహాసంగా మారింది.
- వై.ఉషా కిరణ్