తనకోసం
కొన్ని పదాలు చిగురిస్తే బాగుండు
కొత్తగా సుతి మెత్తగా
ఊహలన్నీ తన చుట్టూ
సీతాకోకచిలుకలై పొయ్యాయి
అందమైన భావాలు రెక్కలకు
పులుముకుని
పెదవుల వెనుక మౌనం
పెను తుఫానులో ఉంది
తలనిండా తలపుల సంత
కనురెప్పల ఉనికి
తెలియక పోవడం ఏమిటో
కనిపించే దృశ్యానికి
అంతు చిక్కడం లేదు
గుండెను చూద్దామా
అది మునిమాపటి
పిట్టలు వాలిన చెట్టయ్యింది
అంతరంగ రక్త గంగ
ఎగసి ఎగసి
ప్రవహిస్తున్నది
ఎంత విచిత్రం !
తన చేతివేలి గోటి రంగునైనా చూడలేదు
ఒక్క అక్షరాన్ని తాకినందుకే
ఇంత సందోహామా
నాకేదో సందేహంగా ఉంది
ఈ తుఫాను పేరు
ఇష్క్ కాదు గదా !
- తుమ్మూరి రామమోహనరావు
Advertisement