ఆలోచనంటే..?
రెపరెపలాడే
గాలికి అటూ ఇటూగా
ఊగే కొమ్మ ఆకుల్లా ఉండకూడదు.
సుడిగాలికి సైతం
ఉక్కపోయించే ఉప్పెనలా ఉండాలి.
చప్పగా
రుచి లేని కప్పు కాఫీలా ఉండకూడదు.
ఘాటుగా,చురుక్కుమనే
మిరియాల రసంలా ఉండాలి.
కొన్ని ఆలోచనలు
రగులుతాయి.
కొన్ని రగిలిస్తాయి.
కొన్ని నడుస్తాయి
కొన్ని నడిపిస్తాయి.
కొన్ని టేబుల్ మీద నుంచి జారిన గ్లాసుల్లాగా పగుల్తాయి.
కొన్ని పగుళ్లు వారిన
మెదడు నేలను చదును చేసి
నాగళ్ళై దున్నేస్తాయి.
కొన్ని ఆవిరౌతాయి.కొన్ని మనల్ని ఆవిరిచేస్తాయి.
కొన్ని గాలి వీపెక్కి షికార్లు చేస్తాయి.
మరికొన్ని మనసును కుదిపేస్తూ
నిశ్చలమైన లోకంలో విహరింపజేస్తాయి.
కొన్ని అలల్లా ఎగిసిపడతాయి.
కొన్ని మాటల్లో చేరి
మంతనాలాడేస్తాయి.
కొన్ని కాగితాలపై
అక్షరాలకోటలు కడతాయి.
రేపటి స్వప్నాలకు ఈరోజే రెక్కలు తొడిగించి ఆకృతినిస్తాయి.
కొన్ని ఎత్తైన శిఖరాలను
నెత్తికెక్కించుకుని తిరుగుతాయి.
కొన్ని లోయల్ని
తమలో దింపుకుని
వంపులు తిరిగేస్తాయి.
ఆలోచనలకు ఎన్నెన్ని పార్శ్వాలో...
ఆలోచన....
ఎప్పుడూ..
వెలుగుతూ ఉండాలి
వెలిగిస్తూ ఉండాలి.
ఆచరణ మార్గంలో అడుగులేస్తూ ఉండాలి
అడుగులేయిస్తూ ఉండాలి.
దూరం నుంచి
దూసుకొచ్చే నిస్ప్రహలకు
చివాట్లు పెడుతూ ఉండాలి.
రసహీనమైన దృశ్యానికి
రక్తాన్నెక్కించేలా ఉండాలి.
నింగి కొమ్మల్లో నిప్పుల పూలు
పూయించేలా ఉండాలి.
- తిరునగరి శరత్ చంద్ర