తలపుల తరగల
తక్కువచూడకు
తనువును పట్టుకు
ఊగిసలాడు
రెక్కలనూపి
తలపుల ఈగలు
ఝుమ్మని రేగి
ఝల్లున కుదిపి
జరిగినవన్నీ జారినవన్నీ
దక్కినవన్నీ దక్కనివన్నీ
ఉన్నవారినీ పోయిన వారిని
ఎవరెవరినొ ఎదురుగ నిలిపి
కుదుళ్ళ పొదళ్ళు
కుదుపుల వెతుకుల
రహస్య పాతర తవ్వులాటలు
వెలికితీసి వెదజల్లింపులు
మోదము కొన్నీ వినోదము కొన్నీ
ఖేదము కొన్నీ గేలులు కొన్నీ
అవమానాలు ఆవేదనలు
ఈసులు ఎన్నో ఇక్కట్లెన్నో!
గుండెల లోతుల గుప్తములెన్నో!
అన్నీ దాగిన అఖాతములెన్నో!
ఇన్ని దాగిన కర్ణుని కవచం
చినిగిపోవును చివరకు చిట్లి
ఇలమీదకు వాలిన
ఈ జిలుగుల చిలుక
తలుపులు తెరచి తలపులతోనూ
ఎగిరిపోవును అపుడో ఎపుడో!
- క్రొవ్విడి వెంకట బలరామమూర్తి
Advertisement