కుంచె ఆధారంగా భవితను నిర్మించే వాళ్ళు చిత్రకారులైతే… కలం ఆధారంగా చరిత్రను సృష్టించే వాళ్ళు కవులౌతారు. కలం కుంచె రెండు విభిన్నసాధనాలు. రెండు విభిన్నకళా ప్రక్రియలకు ఆధారాలు. కలం పట్టినవారు కుంచె పట్టలేరు, కుంచె పట్టినవారు కలాన్నీ పట్టలేరు . కలం పట్టిన వారంత కవులు కాలేరు, అలాగే కుంచె పట్టినవారంత చిత్రకారులూ కాలేరు. కొందరే అవుతారు కవులు కలం పట్టినవారిలో, అలాగే కొందరే అవుతారు చిత్రకారులు కుంచె పట్టినవారిలో .
కలం, కుంచె రెండింటినీ సమానంగా ఉపయోగించగల సమర్దులు కుడా లేకపోలేదు. కానీ బహుకొద్ది మంది మాత్రమే అలా వుంటారు . వీరు కుంచెతో కవితలను రాయగలరు, అలాగే కలంతో చిత్రాలనూ గీయగలరు. విభిన్నమైన ఈ రెండు కళా ప్రక్రియలను సమర్ధవంతంగా నిర్వహించ గల వ్యక్తులలో అలనాటి అడవి బాపిరాజు గారి తర్వాత మరలా ఉభయ తెలుగు రాష్ట్రాలలో కవిత్వం మరియు చిత్రలేఖనం రెండింటా సమస్థాయిలో ప్రసిద్ది గాంచిన వ్యక్తులలో శీలా వీర్రాజు గారు ప్రధమ స్థానంలో ఉంటారని చెప్పవచ్చు.
ఎపుడు చూశానో సరిగా గుర్తు లేదు, మొన్నటి మన సమైక్య తెలుగు రాష్ట్రము యొక్క అధికారిక మాసపత్రిక “ఆంధ్ర ప్రదేశ్ ” లో తొలిసారిగా చూసాను ఒక చిత్రం. దాని పేరు “ఏటికెదురు ”, దానిలో ఐదుగురు మగాళ్ళు ప్రవహించే ఏటికెదురుగా ఇసుక, సిమెంట్, ఇనుము తదితర సామాన్లతో వున్న పడవను భారంగా లాగుకుంటూ వస్తున్న దృశ్యం అది. ఆటోమొబైల్ రంగం బాగా అభివృద్ధి చెంది రవాణా సదుపాయాలు గణనీయంగా పెరిగిన నేటి రోజుల్లో కూడా సరుకులను నాటు పడవలలో వేసి నీటి మార్గాల గుండా వ్యక్తులు నడుచుకుంటూ లాక్కురావడం చూసిన నేటి తరానికి అది చాల వింతగాను, విచిత్రంగాను వుండోచ్చు, కానీ పై సంఘటన మాత్రం నూటికి నూటయాబై పాళ్ళు వాస్తవం. రాజమండ్రి కి 40 కిలో మీటర్ల దూరంలో గల గోదావరీ పరీవాహక ప్రాంతమైన మా వూరు కందులపాలెం వెంబడి సర్ ఆర్ధర్ కాటన్ మహాశయుడి పుణ్యమా అని ప్రవహించే రెండు కాల్వల వెంబడి ఇలాంటి, ఇసుక, సిమెంట్, ఇనుము తదితర సామాన్లను మనుషులు లాక్కుంటూ గమ్యానికి చేర్చే దృశ్యాలు. ఓ ముప్పై ఏళ్ళ క్రితం మాకు సర్వసాధారణ ద్రుశ్యాలే. బాల్యంలో మనసును పులకరింపుకు గురి చేసిన అలాంటి దృశ్యాన్ని ఆచ్చం ఒక చిత్రకారుడి కుంచె ద్వారా రూపుదిద్దుకొని నాడు ఆ పుస్తకంలో చూసిన నాకు నిజంగా ఓ గొప్ప అనుభూతిని కలిగించింది. అంతే కాదు శీలా వీర్రాజు గారి ఏ చిత్రాన్ని చూసినా అలాంటి అనుభూతులే కలుగుతాయి.
అంతరించిపోతున్న గత కాలపు గ్రామాల్లోని సాంప్రదాయ స్మృతులన్నీ మనసుపుటల్లో మెదిలి ఒకింత పులకిన్తను రేపుతాయి. హాయి గొలిపే ఆ కాలం నాటి సంఘటనలు మది స్మృతిలో మెదిలి ఒక ప్రశాంత వాతావరణం వొడిలోకి తీసుకు పోతాయి.
ఆయన రేఖా చిత్రాలలోని రేఖలు ఒకప్పటి మన భారతీయ శిల్పసౌందర్యానికి ప్రతీకలైన హంపి. రామప్ప, ఎల్లోరా, లేపాక్షి.తదితర శిల్పసంపద గొప్పతనాన్ని చాటితే, వర్ణ చిత్రాల లోని రేఖలు మన గ్రామీణ సంస్కృతీ సాంప్రదాయాలను, అచ్చమైన స్వచమైన పల్లె ప్రజల జీవన వైచిత్రికి ప్రతీకలుగా నిలుస్తాయి.
ఇక ఆయన కలం రాతలు సాహితీ సుగంధాలను వెదజల్లుతాయి. కథ, కవిత, వ్యాసం, ఇలా బహువిధ సాహితీ ప్రక్రియలలో ఆయన కలం ఆరితేరి సాహితీ చరిత్రలో కూడా ఆయనొక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు .
ఇలా బహువిధ కళా ప్రక్రియలలో నిష్ణాతులైన శీలా వీర్రాజు గారు కళల కాణాచి ఐన రాజమహేన్ద్రిలో కళా వారసత్వం ఏ మాత్రం లేని ఓ మధ్య తరగతి కుటుంబం లో శ్రీ మతి వీర భద్రమ్మ, శ్రీ శీలా సూర్యనారాయణ అనే దంపతులకు 1939 ఎప్రిల్ 22 వ తేదీన జన్మించారు. వూరికి నీటి అంచుగా వున్న జీవనది గోదావరి, దానిలో తూగుటుయ్యాలగ కదిలే పడవలు, రాజహంసల్లా సాగిపోయే లాంచీలు నదికి ఆవల వొడ్డున ఉదయ సంధ్యలలో ఆకాశంలో పరుచుకునే రంగులు బహుశా తనకు తెలియ కుండానే తనలో రస దృష్టిని కలిగించి వుండొచ్చని ఆయన చెప్పేవారు.
చిత్రాలు ఆధునిక, లేదా సంప్రదాయ ఏ శైలిలో వేసినా ఏదైనా సామాన్యుడి అవగాహన పరిధికి లోబడి ఉండాలనేది శీలావీర్రాజు గారి అభిప్రాయం . ప్రజా జీవన రీతులకు అద్దం పట్టడానికి , నేటి ఆధునిక సమాజంలో కనుమరుగౌతున్న సామాజిక కార్య కలాపాలను ప్రజల కళ్ళెదుట నిలపడానికి నేను ప్రయత్నం చేస్తూ వుంటాను. నా చిత్రాలకు ప్రధాన ఇతివ్రుతం ఇదేనంటారు శీలావీర్రాజు గారు .
అందుకే అనుకుంటాను చిత్రకళా గమనంలో వారి కుంచె నుండి జాలువారిన ప్రతీ చిత్రం సమాజానికి, సంస్కృతీ సంప్రదాయాలకి సామాన్యుడి జీవన విదానానికి అద్దం పట్టేవిదంగా వుంటాయి .. రంగుల్లో సప్త వర్ణాల్లా వీరి చిత్రాలను ప్రధానంగా 7 భాగాలుగా విభజించవచ్చు . అవి…
1) సాంప్రదాయ చిత్రాలు 2)శమైక జీవనాన్ని ప్రతిబింబించే చిత్రాలు 3)మనో దర్పణ చిత్రాలు 4)పౌరాణిక చిత్రాలు 5)ప్రకృతి చిత్రాలు 6)నిశ్చల చిత్రాలు 7)రేఖాచిత్రాలు
ఇంకా పుస్తక ముఖ చిత్రాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లయితే ఎనిమిదవ భాగం కూడా ఆయన చిత్రాల్లో చేర్చవచ్చు. కారణం ఆయన 1960 ల నాటి ప్రఖ్యాత” కళ “పత్రిక తో పాటు వెయ్యికి పైగా వివిధ ప్రముఖుల సాహితీ గ్రంధాలకు ముఖ పత్రాలను వేసియున్నారు.
చిత్రాలు ఎన్ని విధాలుగా వేసినప్పటికి వాటన్నింటికి గ్రామీణ జీవనం మరియు సాంప్రదాయ నేపధ్యమే ప్రధాన భూమికను కలిగి వుంటాయి కారణం అవి వారి ఆలోచనలకు ప్రతి రూపాలు. మిగిలినవి ఆయా సందర్భానుసారం వేసినటువంటివి మాత్రమే .
సాంప్రదాయ చిత్రాలలో ప్రధానంగా మన తెలుగు ప్రజల సాంప్రదాయ వేడుకలు ,పండుగలు, పబ్బాలు, సామూహిక దృశ్యాలు, సంతలు, అమ్మలక్కలముచట్లు, పంచాయితీలు, పేరంటాళ్ళు, ఆట పాటలు,అలంకారాలు ఇలా గ్రామీణ జీవన విధానంతో పెనవేసుకు పోయిన ప్రతి సంఘటనను ఆయన తనదైన శైలిలో చిత్రించారు.
పరిమితమైన అంశాలతో కూర్చిన చిత్రాల కంటే బహువిధమైన అంశాల కూర్పుతో చిత్రించడ మన్నది. ఏ చిత్రకారుడికైన కొంచెం కష్టతరమైన విషయం. కానీ శీలావి గారి చిత్రాల విషయాని కొచ్చినట్లయితే క్లిష్టతరమైన బహువిధమైన మూర్తుల కూర్పుతో వేసిన చిత్రాలే అధికంగా వుంటాయి.
ఒకరిద్దరు వ్యక్తుల కూర్పుతో వేసిన చిత్రాలు చాల తక్కువనే చెప్పొచ్చు.
సామూహిక సంవిధానంలో వేసిన వీరి చిత్రాలలో “ పేరంటం “అన్న చిత్రాన్నిపరిశీలించినప్పుడు దానిలో తెలుగింటి ముతైదువలు పొరిగింటి అమ్మలక్కల నుదిట తిలకందిద్ది పేరంటానికి రమ్మని ఆహ్వానిస్తున్న మహిళా మూర్తుల రూప చిత్రణ అత్యంత సహజంగా వుంటుంది.
ఫ్రూట్ మార్కెట్ అన్నమరోచిత్రంలో పెద్ద మార్కెట్లో పండ్లను కొనుగోలు చేసుకొని పక్క పల్లెల్లో ని చిన్నచిన్న సంతలకి తొందరగ వాటిని తీసు కెళ్ళి అమ్మి నాలుగు డబ్బులు
సంపాదించుకోవాలనుకునే చిన్న చిన్న వ్యాపారుల యొక్క తపనను, వేగాన్ని ఆ చిత్రంలోని మహిళా మూర్తుల భంగిమలలో ఎంతోచక్కగా చూపించారు.
అలాగే నాగుల చవితి, చంటాడికి తలంటు స్నానం, కబుర్లు, తదితర చిత్రాల్లోని భిన్న వయస్సు గల మహిళా మూర్తుల చిత్రాల్లో అచ్చ మైన స్వచ్ఛమైన గ్రామీణ మహిళలు మనకు కనిపించడం తో పాటు “నాగుల చవితి” అన్న చిత్రంలో మంచి దృష్టి క్రమాన్ని (perspective) మనం చూస్తాము .
బోరుబావి అన్న చిత్రంలో నీటికోసం నేటి మహిళల పాట్లు మనకు కనిపిస్తాయి. ఇంకా గొబ్బెమ్మలు, మంగళ సూత్రధారణ, సంతనుంచి ,చలి మంట, మేదరి జీవితం, వర్షంలో వరినాట్లు, చెమ్మచెక్క, ఒప్పులకుప్ప, తదితర చితాలన్ని సామూహిక సంవిధా నంలో వేసినవే .
ఒకప్పుడు మన పూర్వీకులు ఇళ్లల్లో సాంప్రదాయకంగా ఆడుకునే క్రీడలను “వామన గుంటలు “అన్న చిత్రం ద్వారా గుర్తు చేస్తే, ముచ్చ ట్లు, తల్లీ బిడ్డ, తారంగంతారంగం, తదితర చిత్రాల్లో పిల్లల పట్ల అమ్మ లాలన ఎలా వుంటుందో చూపిస్తారు. ముచట్లు అన్న చిత్రం మన గ్రామీణ ప్రాంతాలలోని అమ్మలక్కల కబుర్లకు ప్రతి రూపమైతే, తిలకం, మల్లెపూల మాల, శిరోజాలంకరణ, ముంగిట ముగ్గు, కట్టెల పొయ్యి తదితర చిత్రాలలో మన గ్రామీణ ప్రాంతాల లో ఒక నాటి సాంప్రదాయం, ఆచారారాలు, అలవాట్లు ప్రేమ, ఆప్యాయత తదిరమైన భావాలు మనకు కనిపిస్తాయి .
ఇక శ్రమైక జీవనసౌందర్యాన్ని ప్రతిబింబించే చిత్రాల లో నర్సరీలలో పనిచేసే కూలీలు , కమ్మరి కొలిమిలలో పనిచేసే కార్మికులు, పంటపొలాల్లో పనిచేసే పనివాళ్ళు, ఇంకా మంగలి , కమ్మరి, కుమ్మరి, నేత, గీత, కార్మికులు, పశువుల కాపరులు, చర్మ కారులు, భవన నిర్మాణ కార్మికులు, చర్మకారులు, మత్స్య కారులు వ్యవసాయ క్షేత్రాలలో పండించిన పంటను అమ్ముకునేందుకు పట్నంలో సంతకేగుతున్న రైతులు… ఇలా శ్రామిక వర్గానికి చెందిన సకల వృత్తులవారు వీరి చిత్రాలలో మనకు కనిపిస్తారు.
నీటి పంపులు, మోటారు బావులు లేని నాటి కాలంలో మేదర్లు తయారు చేసిన వెదురు గూడలే నీటిని తరలించే సాధనాలు . వాటిని వుపయోగించి స్వయంగా రైతు దంపతులు లేదా కూలీలు రేయింబవళ్ళు నీటిని చేదుతూ మెరక పొలాలలోని క్షేత్రాలకు నీరందించే విధానాన్ని చూపే “మెరక పొలానికి గూడకట్టునీరు ” అన్న చిత్రం ఇప్పటికి నలబైఏల్ల నాటి మన గ్రామీణ వ్యవసాయ తీరుకు దర్పణంగా నిలుస్తుంది.
గోదావరి పరీవాహక ప్రాంతానికి వరదలనేవి ప్రతీ ఏటా సర్వ సాధా రణం . అలాంటి వరదల సమయంలో నేటి కాలంలోలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు లేని సమయాలలో తీర ప్రాంత వాసుల ఇళ్ళను కాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం అన్నది అక్కడ సర్వసాధారణ విషయం . ఈ చిత్రకారుడు జన్మతహా గోదావరి తీర ప్రాంతవాసి కావడంతో బాల్యంలో ఎన్నో మార్లు ఇలాంటి సంఘటనలను కనులారా చూసినవారే, అందుచేతనే అలనాటి జ్ఞాపకాలను మరల “వరదనుండి సురక్షిత ప్రాంతానికి “ అన్న చిత్రం ద్వారా మనకు చూపించారు.
కరువు కాటకాల సమయాలలో గ్రామాలలోని కూలీలు పనులకోసం తట్ట, బుట్ట, పలుగు, పార వంటి పని ముట్లతో జీవనాధారమైన రోజు కూలి కోసం వేరొక ప్రాంతాలకు గుంపులుగుంపులుగా తరలి వెళ్తున్న దృశ్యాలు అభివృద్దిలో దూసుకుపోతున్నమనుకుంటున్న నేటి కాలంలోనూ మనకు కనిపిస్తూనే వున్నాయి . అలాంటి నిరుపేదల బ్రతుకులకు ప్రతి రూపమే “కూలికోసం “అన్న వీరి తైల వర్ణ చిత్రం.
అలాగే కొండ ప్రాంతపు అడవుల్లో దొరికే వనసంపదే గిరిజనులకు జీవనాధారం . అక్కడ వారు సేకరించే చింతపండు, జిగురు, కొండచీపుల్లు , వనమూలికలు, పండ్లు, రకరకాల గింజలు , విత నాలు తదితరమైన వాటిని బుట్టల్లో నెత్తిన పెట్టుకుని మైళ్ల తరబడి నడిచి కొండ దిగువ మైదాన ప్రాంతాల్లో జరిగే వారాంతపు సంతల్లో అమ్ముకుంటూ జీవనాన్ని సాగించే ఏజెన్సీ లోని కొండ వాసుల జీవనానికి ప్రతిబింబాలుగా నిలుస్తాయి వీరు చిత్రించిన “కొండనుండి క్రిందకు” “పట్నంలో అమ్మకానికి” తదితర చిత్రాలు.
అలాగే భవన నిర్మాణ కార్మికులు, గ్రామీణ వర్క్ షాప్,ఫుట్పాత్ క్షురకుడు, చేపల వలకు చిన్నరిపేరు ,పసువులకాపరి, బెస్తవనిత, చర్మకారుడు, నర్సరీ,”అద్దరికి ” లాంటి వన్నీ శ్రమైక జీవనాన్ని ప్రతిబింబించే చిత్రాలే.
ప్రఖ్యాత కళా విమర్శకుడు డాక్టర్ సంజీవదేవ్ అంటాడు.మనిషి రెండు రకాల పరిస్థితులలో జీవిస్తాడని . వీటిలో ఒకటి ఏకాతం, రెండు జనాంతం. జనాంతం లో జీవించేవాళ్ళు సాంఘిక జీవులైతే, ఏకాంతంలో జీవించే వాళ్ళు అంతర్ముఖులౌతారు . అలాగని ఏ మనిషీ పూర్తి సాంఘీక జీవి కాదు , అలాగే ఏ మనిషీ పూర్తి
అంతర్ముఖుడూ కాదు . ఒక్కోసమయాలలో ఒక్కో రీతీగ వుండడం సహజం . అది మనిషి యొక్క స్థితి,వాతావరణం, సమయానికనుగుణంగా వుండడం జరుగుతుంది . మనిషిని ఒకవిధ మైన భావనా లోకానికి తీసుకు పోయేది ఏకాంతస్థితి. అలాంటి స్థితిలోనే వ్యక్తి జీవితంలోని ఆశలు, ఆశయాలు, ఆలోచనలు, అనుభవాలు, గతస్మ్రుతులు అన్నిటినీ నెమరు వేసుకుంటూ ఆనందిస్తూనో విచారిస్తూనో లేదా ఎదురుచూస్తూనో మనిషి కాలాన్ని వెళ్ళదీస్తూ ఉంటాడు. అలాంటి భిన్న విభిన్న భావాలకు ప్రతిరూపాలే వీరు చిత్రించిన “గత స్మృతులు, ఎదురుచూపు, నిరాశ, ఆశ లేని భవిత, యోచానాలోచన. దుఖిత దీనభాన్దవి , చితికిన రైతు ,వలపు తలపులు, సుఖనిద్ర, మధురస్మృతులు లాంటి చిత్రాలు .
అలాగే 1973 లో జలవర్ణాల్లో వేసిన ఆయన సెల్ఫ్ పోర్ట్రైట్, నర్తకి, “ముదుసలి” మరియు బిచ్చగాడు తదితర చిత్రాలన్నీ మూర్తి చిత్రణ పరిధి లోకోస్తాయి . 1959 లో
జలవర్ణాల్లో వేసిన రాజమండ్రిలోని నీటి పంపింగ్ నిర్మాణం , వర్ష ప్రకృతి, పుష్ప విలాపం, వర్ణమయ ప్రకృతి,కొండ వాగు, వర్షనగరి, తదితరమైన ఎన్నో ప్రకృతి చిత్రాలను మరియు కొన్ని నిశ్చల చిత్రాలను కూడా వీరు వేసారు.
1975 లో ప్రపంచ తొలి తెలుగు మహాసభల సందర్భంగా వీరు వేసిన “వీర శైవ ప్రవక్త శ్రీపతి పండితుడు “శకుంతల “రాదా కృష్ణులు లాంటి ఎన్నోపౌరాణిక చిత్రాలు కూడా వీరి కుంచె నుండి రూపుదిద్దుకున్నాయి. వీటిల్లో వీర శైవ ప్రవక్త శ్రీపండితుడు” చిత్రాన్ని ప్రస్తుతం హైదరాబాదు లోని తెలుగు విశ్వవిధ్యాలయంలో మనం చూడవచ్చు .
ఇక వీరి చిత్రకళా గమనాన్ని పరిశీలించినట్లయితే ఒక విచిత్రమైన వైఖరి మనకు కనపడుతుంది. చిత్రకళా ఆరంభ దశలో వీరు వేసిన కొన్ని చిత్రాలు చాలా ఆధునికంగానూ నేటి ఆధునిక కాలంలో వేసిన చిత్రాలన్నీ చాలా పాతకాలం నాటివిగాను కనిపించడం మనం గమనిస్తాము.
Seelaavi art books
1959 లో వేసిన కష్టేఫలి, 1960 లొ వేసిన “వరినాట్లు”, 1969 లో చిత్రించిన “రంగుల రాగాలు” , 1993 లో వేసిన “అలసిన వేల”, వర్ష నగరి”, తదితర చిత్రాలలో ఆధునిక పోకడతో పాటూ రంగులపై ఆయనకు గల సాధికారతను మనం గమనిస్తాము . ఇటీవల ఒక సిరీస్ గా వేస్తున్న ఆయన చిత్రాలైన మమకారం, కేశాలంకరణ, వంటచెరకు, శ్రమజీవులు, బతుకు దెరువు, చేనేత కుటుంభం, చెరువు కాడ, సువ్వీ సువ్వీ , చలిమంట, మేదరి జీవితం , చెమ్మ చెక్క, ఒప్పుల కుప్ప, వేట పడవలు ఇంకా రాలేదు, పల్లె పడుచు సింగారం, పిండి తయారు, సంతనుండి, నిరీక్షణ, తదితర చిత్రాలన్నీ చూసి నపుడు కనుమరుగైపోతున్న ఒకప్పటి మన సామాజిక కార్యకలాపాలు ప్రజా జీవన రీతులు మన కళ్ళెదుట ప్రత్యక్షమౌతాయి.
స్వచ్ఛమైన పల్లె వాసుల జీవన
విధానంలో నేటి యాంత్రిక యుగంలో కనిపించే హంగు, ఆర్భాటాలు కనబడవు. అందుకే ఆ కోవలో వీరు వేసిన చిత్రాలలో కూడా ఎలాంటి కృత్రిమత్వం కనబడకుండా స్వచ్చంగా పల్లె జీవనంలో కనిపించే ప్రశాంతత మనకు కనిపిస్తుంది.
కళలు మానసిక ఉద్ధీపనను కలిగించాలని, ఏ కళారూపమైన సామాజిక ప్రయోజన కారిగా వుండాలని అభిలషిన్చే వీరు సహజంగానే తన కళా కృషిని ఆర్ధిక లేదా మరే ఇతర ప్రయోజనాలతో ముడి పెట్ట కుండా తన భావజాల సంత్రుప్తి కోసమే పని చేసే గొప్ప కళాకారులు శ్రీ శీలా వీర్రాజు గారు, అందుచేతనే మన రాష్ట్రంలోనూ, మరియు మన పొరుగు రాస్ట్రాల్లోనూ గల శిల్ప వైభవ కేంద్రాలను తరచూ సందర్శించి కనుమరుగౌతున్న అక్కడి శిల్ప సంపదను ఓపికగా తన స్కెచ్ బూక్లో రేఖా చిత్రాలుగా మలిచి వాటిని “ శిల్పరేఖ” పేరుతో ముద్రించి పాట కలోకానికి అందించడం వెనుక వున్నది అలాంటి సామాజిక ప్రయోజనమే. అంతే గాక ఈ శిల్పాలకు ఆయన వేసిన స్కేచ్ లతో 1970 లో హైదరాబాద్, బెంగుళూరు తదితార చోట్ల వ్యక్తిగత ప్రదర్సనలు కూడా చేయడం కూడా జరిగింది. అలాగే శ్రీధర్ అనే phd చేస్తున్న విద్యార్ధి సహాయంతో జర్మని లోని గోజింతిన్ విశ్వవిద్యాలయంలో కూడా తన లేపాక్షి చిత్ర ప్రదర్సన చేసి అక్కడ మన చిత్ర, శిల్ప వైశిస్త్యాన్ని చాటి చెప్పారు .
చిత్రకళా పోటీలు, మరియు
ప్రదర్శన లపట్ల అంతగా ఆసక్తి చూపని శీలా వీర్రాజు గారు తన చిత్రాల ప్రదర్శనను 1975 లో కళాభవన్ హైదరాబాద్ లో చేసిన తదుపరి మరల హైదరాబాదులోనే జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంలో నూ ఆపై 2013 లోరవీంద్ర భారతి నందలి ICICR ఆర్ట్ గేలరీ నందు, తదుపరి నెల్లూరు జిల్లా కావలి నందలి మిత్రులకోరికపై తన వ్యక్తిగత ప్రదర్శనలు చేసారు. కళాశాలలో విద్యార్ధిగా ఉన్నప్పుడే ఒక ఏడాది గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వీరి చిత్రాల ప్రధర్సనను ఆ నాటి ప్రముఖ సినీ హీరో పద్మశ్రీ N.T. రామారావు ప్రారంభోత్సవం చేయడం గొప్పవిశేషం.
వీరు చిత్రకళలో ఆధునిక పోకడలను ఆస్వాదిస్తారు, అభిలషిస్తారు. అవసరమైన సందర్భాలలో ఆచరణలో చూపిస్తారు , అయితే ఆధునికత పేరుతో చేసే వెర్రివెర్రి ధోరణులను హర్శించననేవారు. పోస్ట్ మోడరన్ పేరుతో సామాన్యుడి అవగాహనా పరిధికి అందనిది ఏదీ తనకు సమ్మతంకాదు .ఇటీవల కాలంలో ఈ ధోరణి లలితకళలలో మరీ ముఖ్యంగా చిత్రకళలో మరీ ఎక్కువగా చోటుచేసుకుంటున్నదనీ ఇది పెట్టిబడి దారీల లక్షణమని సామ్రాజ్యవాద పెట్టుబడి దారీ దేశాలలో పుట్టిన ఈ ధోరణి కళ ను సామాన్యుడికి దూరంగా జరిగిపోయేలా చేసి, కళ అనేది నేడు సంపన్నుల యొక్క అలంకార వస్తువు స్థాయికి దిగజార్చేలా చేసిందని వాపోయే వారు
సౌందర్యాన్ని ఆరాదిస్తూ , ప్రకృతిని ప్రేమించే వీరు కుటుంబ సభ్యుల సహకారంతో ఎల్లప్పుడూ ఇంటిని ఒక కళా కేంద్రంగా తీర్చిదిద్దుతుండేవారు .తన చిత్రాలనన్నింటిని రాజమండ్రి లోని దామెర్ల ఆర్ట్ గ్యాలరీకి ఇచ్చేసారాయన .ఆ కృషిలో ప్రముఖ రచయిత్రి ఐన వారి శ్రీమతి శీలా సుభద్రాదేవి గారి వదాన్యత కూడా గొప్పది .2022 జూన్ ఒకటిన అశేష చిత్రకళా ప్రేమికులను కూడా విషాదంలో ముంచుతూ ఆయన అస్తమించారు . వీరి ఏకైక కుమార్తె పల్లవి వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తూ తన తండ్రి వలె జలవర్ణ చిత్రాలు కూడా వేస్తూ ఆ కళావారసత్వాన్ని కొంతైనా కొన సాగించే ప్రయత్నంచేయడం గొప్ప విశేషం .
శీలావి గారికి ప్రథమ వర్థంతి సందర్భంగా నివాళులు
-వెంటపల్లి సత్యనారాయణ