నా మాట ఘనం
నా చేత ఘనం
నా కార్యం ఘనం
నా కార్య దీక్షా దక్షత మరీ ఘనం
నా సేవ ఘనం
మీ లాంటి కోటాను కోట్ల
చిరు జీవుల కు నేనే
స్వయంగా సేవ చెయ్యటం ఘనం
నా సేవ పొందే మీ అదృష్టం ఘనం
అసలు నేనే ఘనాతి ఘనం ...
ఆంగ్లేయులు శత్రువులనే
రణన్ననినాదం
ఏడు దశాబ్దాల స్వాతంత్ర్యం లో
మూడొంతుల కాలం పాటు ఏలిన
మూలవిరాట్టుల
మంత్ర సూత్రం
శ్రవణానందం గా విని
కాలం వెళ్ళబుచ్చడం ఘనం ...
ఆబగా ఆవేశ పడి అరడజనేళ్ళు
అంతకు ముందు ...
కసి తో కావేశ పడి
రెండేళ్ళుగా ఇప్పుడూ ...
మన తలలమీద నర్తిస్తూ
చేసిందానికంటే
చెప్పుకునేదే
ఘనం ...
తోడుబోయిన వాళ్ళూ ఘనం
తోక ముడిచిన వాళ్ళూ ఘనం
తోకలు జాడించే వాళ్ళూ ఘనం
ఘనం ... ఘనం ...ఘనం
నీటిమూటలు ద్రవం
గడ్డ కడితే ఘనం
సమస్యలు ఘనం
అదెవరోకాదు జనం
అందుకే మనం ... ఘనం
క్యూబ్ అంటే ఘనం
నిరాకారమైన
సుతిమెత్తని మన
మనసులూ ఘనం
నిర్వికారమైన మన
రియాక్షనూ ఘనం
మన సేవ ఘనం
వారి యావ ఘనం
అంతేవాసులు చేసిన
ఆడంబరం ఘనం
ఇండియాగేట్
ముందు ఆడించిన
తోలుబొమ్మలాట ఘనం
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని
పాదాల సన్నిధి లొ
ఉదయాస్తమానం గుక్క తిప్పకుండా
చెప్పిందే పదే పదే
చెప్పడం ఘనం
విన్నదే మళ్ళీ మళ్ళీ విని
వ్యక్తం చేసిన హర్షం ఘనం
ఎండ ఘనం
వాన ఘనం
పండని పంట ఘనం
కూలిన చెట్టు ఘనం
పగిలిన గుండె ఘనం
ఆకలి కడుపు ఘనం
అయినా ఎవరికీ పట్టని మనం
వాళ్ళకి వార్షికోత్సవాలూ
మనకి సంవత్సరీకాలూ
వారికి సంబరాలూ
మనకి కంపరాలూ
దుర్దినాలూ ... తద్దినాలూ
మనం వారి నించి ఆశించేది శూన్యం
వారు లాక్కునేది మనుషుల మాన్యం
అది అతి సామాన్యం...
మనబతుకుల దైన్యం ...
కాళిదాసు చెప్పినట్టు
శరత్కాలం లో నీరులేని మేఘం
శూన్య గర్భం నుంచీ చాతక పక్షి
కూడా చుక్క నీటిని ఆశించదు
మనం నేతల నుంచీ ఎప్పుడూ
ఏమీ ఆశించనట్టు
నిర్జలితాంబు గర్భం
శరద్ఘనం నార్ధతి చాతకోపి ...
- సాయి శేఖర్