చమ్కీ (కవిత)

Advertisement
Update:2023-04-13 12:28 IST

కలల కుచ్చుముడివీడి

దారాలు దారాలుగా జీవితం

నాలుగ్గోడలకు రోజులను బిగించి

పట్టి పట్టి చేస్తున్న కలల కార్చోప్

రాత్రి చిక్కటి చీకటి మీద

మెరుపులుగా మెరుస్తున్న

కట్ దానా కుందన్లను

ఆలోచనల జరీతో కలబోసి చేస్తున్న కార్చోప్

సాదా చమ్కీ… దేవదాసి చమ్కీ

రకరకాల రంగుల మెరుపు కలలు

సాదా జీవితానికి

అరబ్ దీనార్ల రంగుల కలలు

రాకుమారుడి రాకకోసం

ఆకాశం తానులో నేసిన నక్షత్రాల స్వాగతం

అన్ని చమ్కీలు చీరమీదకు చేరవు

దారితప్పి కింద పడి

ఊడ్పులో మాసి

బజారులో ఎండకు మెరిసి

ఏ గాలి వేగానికో

బురదగుంటల్లో ఆత్మహత్యించుకుంటాయి

బతుకు చీరకు వేసిన కట్ దానాలానో

బజారున పడ్డ చమ్కీలానో

ఏ ఎగుమతిలో ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు

ఏ బురద గుంట వడిలో మునుగుతుందో తెలియదు

కానీ మెరవడం దాని జీవలక్షణం

పాతబస్తీ నిండా మెరుస్తున్న చమ్కీలే..!

 - షాజహానా

Tags:    
Advertisement

Similar News