మునిపల్లె రాజు గారు పుట్టింది మార్చి 16, 1925న గుంటూరు జిల్లాలోని తెనాలి సమీప గ్రామమైనగరికపాడులో, తండ్రి హనుమంతరావు, తల్లి శారదాంబ.
పదవులతో పోటీ పడకుండా తృప్తిగా ఏపనైనా చేసుకుంటూ సంతృప్తిపడటం తెలిసినవారు మునిపల్లె రాజు గారు. 1941-42 లోనే వారి తొలి సంపాదన విశాఖపట్నంలోని ఒక కంపెనీకి ఎకౌంట్స్ రాసిపెట్టటంతో ప్రారంభమైంది. ఆ తర్వాత బ్రిటిష్ రైల్వే కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజనీరింగ్ విభాగంలో సర్వే పనులు నేర్చుకున్నారు. పిదప మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ లో ఉద్యోగం..1943 నుంచి 1983 వరకు నాలుగుదశాబ్దాల పాటు భారత రక్షణ శాఖలో వివిధ హోదాలలో పనిచేశారు. పదవీ విరమణ తర్వాత సికింద్రాబాద్ లోని సైనిక్ పురి లో స్థిరపడ్డారు.
ఇంటి పేరు మునిపల్లె. ఇంట పెట్టిన పేరు బక్కరాజు.ఒంట బట్టించుకున్న పేరు మునిపల్లె రాజు. కలం మాత్రం తొంభై శాతం 'మునిపల్లె రాజు'గానే కదిలినప్పటికీఅప్పుడప్పుడూ 'మునీంద్ర'గానూ కదిలేది.
'రాజుగారు హృదయమున్న మార్క్సిస్టు,జీవితం తెలిసిన సైంటిస్టు, అన్నింటినీ రంగరించగల ఆల్కెమిస్టు'గా కథకుల కథకుడు. ఊహతెలిసే మూడేళ్ల ప్రాయం నుండి మరో తొమ్మిది దశకాల సుదీర్ఘ జీవితంలో అనేక వ్యూహాల్ని,వ్యవహారాల్ని, వ్యక్తిత్వాల్ని అనుశీలించి భౌతికయానాన్ని పరిపూర్తి చేసుకుంది 2018 ఫిబ్రవరి24న - సైనిక్ పురి లోని స్వగృహంలో.
మునిపల్లె రాజు కథలు', 'పుష్పాలు-ప్రేమికులు-పశువులు', 'దివోస్వప్నాలతో ముఖాముఖి','అస్తిత్వనదం ఆవలితీరాన' ఆయన కథాసంపుటాలు. 'అలసిపోయినవాడి అరణ్యకాలు', 'వేరొకఆకాశం వేరెన్నో నక్షత్రాలు' వారి కవితా సంపుటాలు. "జర్నలిజంలో సృజనరాగాలు”, “సాహితీ మంత్రనగరిలో సుస్వరాలు" వారు ప్రచురించిన వ్యాస సంపుటాలు. రాసిన 'పూజారి' నవల పూజాఫలంగా సినిమాగా వెండితెర వెలుగయింది.
ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక వేదనల నుండి పుట్టుకొచ్చిన సామాజిక స్పృహ, జీవన స్పృహల కథన చమత్కృతే మునిపల్లె కథల కాన్వాస్. అవి సుదీర్ఘ స్వప్న జీవిత నిశిలో అంతర వ్యోమయానం చేసిన బ్రతుకు కథలు. "ఆ పరిభ్రమణల రహస్య ప్రకంపనలను" బహు చక్కగా అభివ్యక్తీకరించే మాధ్యమం మునిపల్లె మాజికల్ రియలిజం.
అందుకే వారి కథలు స్థలాతీతమైనవి, కాలాతీతమైనవిఅయ్యాయి. ఏ సంక్షుభిత మేథోవాదం నీడకో, అరాచకవాదం నీడకో, నిహిలిజం నీడకో చేర్చదగ్గవికావు. అవి భౌతిక వాస్తవాలతో అంతర్లీనమైన అతిలోకవాస్తవాల వెలికితీత. అవి అద్భుత వాస్తవికాలు కాబట్టి మాజికల్ రియలిజం పీఠాన్ని అధిష్టించాయి.
అందుకే తమ కథలు "అదృశ్య పృచ్ఛకుడి ప్రశ్నలకు సమాధానాలుగా వెలువడ్డా" యంటారు మునిపల్లె రాజు. పైగా వాటిని అద్భుత మాయావాద రసాలుగా పరిగణిస్తారు. "ఆధునిక సంక్లిష్ట జీవన సమస్యల పరిధిలో ఇమిడిస్తూ" తమ కథల రచన సాగిందంటారు.
కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని కథలకు అందుకున్నప్పటికీ సాహిత్యరంగప్రవేశం కవిత్వంతోనే. తొలి పద్యం "ఎంత దయో దాసులపై, పంతంబున మకిరిబట్టి బంధింపగా
శ్రీకాంతుడు చక్రం బంపెను, దంతావళి రాజుగాయ దత్తాత్రేయా". మలి పద్యం "చిన్న చెంబుతోనీళ్లు, శీకాయ ఉదకంబు". ముచ్చటగా మూడో పద్యం "తేరా పలకా బలపము / ఇయరా
అయవారి చేతికి / ఇంపులరంగా". ఇలా ప్రారంభమైన మునిపల్లె వారి కవితా ప్రస్థానంవిప్లవగీతాలవైపూ మళ్లింది. అటుపిమ్మట వారి కలం అధివాస్తవిక పద్యాలవైపూ తిరిగింది. నిజానికి
ఇప్పటివరకు జీవితమంతా స్వప్నయుగమే. బాల్యం తర్వాత అన్నీ ఎదురు దెబ్బలే. ఎన్నెన్నోవిషాదాలే.
"కవిత్వం మానవుడికి సాంస్కృతిక చైతన్యంతో సంక్రమించే మాతృభాష - జీవుని ఆత్మ ఘోషనుఅభివ్యక్తీకరించ గలిగిన హృదయ భాష. మానవాళి పురాస్మృతులకు, సమకాలీన కల్లోల జగతీస్పందనలకు అనువైన వాహిక కవిత్వమే. అది స్వేచ్చాజీవి. మూసబోసిన ఆకృతిలో అదిఇమడలేదు." కవిత్వానికి మునిపల్లె రాజు ఇచ్చిన నిర్వచనం ఇది.
నిజానికి వారి కవితాపంక్తులు
అనుభవాలతో వంగిన విల్లు నుండి ఎక్కుపెట్టిన అస్త్రాలే.మునిపల్లె రాజు తమ "జర్నలిజంలో సృజనరాగాలు" అన్న వ్యాససంపుటంలో 2005 వ సంవత్సరంలో రాసిన మూడు కవితలను "సాహితీ పుటలకు పనికిరాని మూడు పద్యాలు" అంటూ ప్రచురించారు.
ఈ మూడింటిలో "వీచిన కవితలు" అన్న కవితలో –
"ద్వేషంతో చెప్పేవన్నీ 'దోహాలు కాలేవు
ద్వైదీభావంతో రాసేవన్నీ ద్విపదలు కాలేవు"
"ఆక్రోశంతో ఆలపించింది అరణ్యక మెట్లా అవుతుంది."
"ఉక్రోషంతో ఉటంకించేదంతా ఉపనిషత్తవుతుందా?"
"రెచ్చగొట్టేదంతా రేషనలిజం కాదు కాదు
రచ్చబండ రగడంతా రాజ్యాంగపు రచనౌతుందా?”
అని అంటూనే-
"విప్లవ పదకోశంలో
విషాదం కూడా ఒక అశ్వాసం
వట్టి చిలుకపలుకుల్తోనే
నిలుస్తుందా ఆ విశ్వాసం?"
అని ప్రశ్నిస్తాడు.
పనిలో పనిగా
"కుకవి కవితలకు కుటిలుడే కితాబు నిస్తాడు"అంటారు .సమీక్షకులు కొందరికి చెంపపెట్టులా !
మరో కవితలో -
"అందరికీ హీరో నేనే !
బాల్యానికి బంగరు మేనా !
బతుకంతా పర్వదినంబని
భ్రమ చెందిన బాల్యం అది !"
అని అంటూ
"ఆ పిమ్మట బ్రతుకేమన్నది ?" అని ప్రశ్నిస్తూ -
"అంతా శూన్యం!
అంతటా ప్రశ్నరణ్యం !
ఎటు తిరిగినా ఎదురు దెబ్బ !
అడుగడుగునా అపార విషాదం".
అంటూ మనల్ని అంతర్ముఖుల్ని చేస్తారు మునిపల్లెవారు.
మానవ వేదనలు, మానవతత్వ సంఘర్షణలు, మానవాత్మ ఘర్షణలు అస్తిత్వానికిపునాదులు,నేపథ్యాలు .
అవే అస్తిత్వాన్ని నిలుపుకునే దశలో, దిశలో మార్గదర్శులు. ఈ తీరాన
అస్తిత్వ వేదనను అనుభవించారు, అనుభూతించారు కాబట్టే తమ పాత్రలను మాజికల్ రియలిజం
నీడన నిలిపి అస్తిత్వ నదం ఆవలి తీరానికి చేర్చగలిగారు, చేరగలిగారు మునిపల్లె రాజుగారు.ఇవాళ వారి 99 వ జయంతి దినం.ఆ కథా ఋషికి స్మరణీయ నమస్సులు.
- 'విశ్వర్షి '
వాసిలి వసంత కుమార్