జనార్ధనా...
నీకు నాకు మధ్య అజ్ఞానమనే
అగాధం ఉంది .
రాతను మార్చే సద్గురువై
సద్భోధ చెయ్యి .
మన మధ్య మోహమనే
మాయ తెర ఉంది .
నెయ్యము తో తొలగించు.
నీ పాదపద్మాలు
శరణుజొచ్చిన వారు
మోక్ష స్థితిలో ఉన్నారు.
జగద్గురువుగా గుర్తించారు.
కృష్ణం వందే జగద్గురం అని
వేడుకుంటున్నా ...
సంసార సాగరాన్ని దాటడానికి
స్మరణమనే తలుపుని
నీ నామమనే తాళం చెవితో తొలగిస్తున్నాను .
అన్యమైన ఆలోచనలు కట్టి పెట్టి
నీ ఆశ్రయం కోరి వచ్చాను.
తెల్లని మనసు కలిగి
నల్ల కలువ వంటి
శరీరం కలవాడా ...
బాహ్య శత్రువులైన
మమకారాలు
అంతః శత్రువులైన
అసూయ ద్వేషాల
బారిన పడకుండా
ఇంతి కుంతికి తోడుగా ఉన్నట్లుగా
ప్రతి కష్టంలో వెన్నంటి ఉండు...
నీ పాదాలు మంకెన పువ్వుల్లా మెరుస్తూ
నీ చరణాలను ఆశ్రయించమంటున్నాయి
అలంకారప్రియా...
అహమనే మాయలో పడవేయక
ఆశ్రిత జనవత్సలుడవై ఆదుకో .
పరిమితి మించి
పరిణతి చెందని నా మదిని
గోపకాంతల వోలే అనుగ్రహించు
చిన్ని కృష్ణా....
నీ పాదాలని ఆశ్రయిస్తున్నా...
పారిజాత పుష్పాలతో పూజిస్తున్నా...
నీ చిత్తముతో చింతను
చెంతకు రానీయకు.
వింతగా ఉన్నా..
నన్నెన్నడూ వీడకు..
(రాజపూడి)