సమీక్ష ఒక చానల్లో యాంకర్ గా పని చేస్తోంది.
ఆ రూపం, ఆ మాటతీరు ఎదుటి వాళ్ళని ఇట్టే ఆకర్షింప చేస్తాయి..
నిప్పు లాంటి నిజం అనే ప్రోగ్రాం ద్వారా విజయం సాధించింది.
నిప్పు లాంటి నిజం.
ఒకప్పుడు కుప్పలు కుప్పలుగా సంపద కలిగిన హీరోయిన్ అప్పుల పాలై పప్పు అన్నం తినే అదృష్టం కూడా లేకుండా ఏ విధంగా తిప్పలపాలయిందో ఈనాటి నిప్పులాంటి నిజం లో చూడండి అని చెప్తూ ఉంటే చెవులు అప్పగించి వింటారు జనాలు
పవన్ అలాగే ఆకర్షితుడయ్యాడు. పాతకాలపు సినిమా హీరో లాగా అందంగా ఉంటాడు.
ఒక రోజు అనుకోకుండా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తొందరగానే ప్రేమగా మారింది..
ఇద్దరూ సినిమాలకి షికార్లకి తిరిగారు.
పెళ్లి చేసుకుందాం అనుకున్నారు.
అతనికి పెద్దగా చదువు లేదు.
కానీ బోలెడంత ఆస్తి ఉంది. స్వంత ఊర్లో ఉన్న పొలాలు తోటలు అమ్మి నగరంలో కొంత కమర్షియల్ స్పేస్ కొనుగోలు చేశారు. నెలకి రెండు మూడు లక్షలు అద్దె రూపంలో వస్తుంది.
ఇక సమీక్ష విషయానికి వస్తే సరదాకి ఉద్యోగం చేస్తోంది తప్ప అవసరం లేదు వాళ్ల ఇంట్లో అందరూ కలెక్టర్లు పెద్ద పోలీసు ఆఫీసర్లు.
"మన పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకోరు. కనీసం నెలకి పది పదిహేను లక్షలు అద్దె రూపంలో వచ్చే వాళ్ల ఇంటి అమ్మాయితో నా వివాహం జరిపించాలని వాళ్ళ కోరిక" అన్నాడు పవన్.
నాదీ అదే పరిస్థితి. జిల్లా కలెక్టర్,లేదా కనీసం యస్ .పి హోదా లేకపోతే నన్ను ఇచ్చి పెళ్లి చేయను అని మా నాన్న పట్టుదల. అన్నది సమీక్ష.
ఇళ్లలో చెప్పకుండా పెళ్లి చేసుకుందాం అని నిర్ణయానికి వచ్చి స్నేహితుల సమక్షంలో గుడిలో పెళ్లి చేసుకున్నారు ఇద్దరూ.
తాత్కాలికంగా ఇద్దరు ఒక ఫ్రెండ్ రూములో ఉన్నారు. చాలా ఆనందంగా కొద్ది రోజులు గడిపారు.
"సమీ !నీతో ఒక విషయం చెప్పాలి.
నాకు ఆస్తులు అవి ఏమీ లేవు. సినిమాలకి సీరియల్స్ కి షూటింగ్ సమయంలో కావాల్సిన తులసి కోట,నవారు మంచాలు ,ఇత్తడి పాత్ర సామాగ్రి ,అద్దెకు ఇచ్చే అతని దగ్గర పని చేస్తున్నాను. జీతం యెనిమిది వేలు. నీ మీద కలిగిన ప్రేమతో అబద్ధం చెప్పి నిన్ను పెళ్లి చేసుకున్నాను. నన్ను క్షమించు మీ వాళ్లంతా పెద్ద పోస్టుల్లో ఉన్నారు కాబట్టి నాకు ఏదైనా మంచి ఉద్యోగం ఇప్పిస్తే బుద్ధిగా చేసుకుని నిన్ను సుఖ పెడతాను అని చెప్పాడు పవన్. సమీక్ష మొహం పెంకులా మాడి పోయింది.
"ఎంత పని జరిగింది.. నీ మీద ప్రేమతో నేను కూడా ఉన్నవి లేనివి కల్పించి చెప్పాను. మా నాన్నగారుఒక మాల్ లో సెక్యూరిటీ గార్డు గా పని చేస్తున్నారు. ఇద్దరు అన్నయ్యలు ఒక బావ స్విగ్గి జొమాటో లో పనిచేస్తున్నారు. మాకు ఆస్తులు లేవు గాని అప్పులు ఉన్నాయి. నేను పని చేస్తున్న ఛానల్ వాళ్ళు సరిగా జీతాలు ఇవ్వరు. రేటింగ్ బాగా వస్తే ఇస్తాము అంటారు. రోజువారీ ఖర్చులకు ఇంత అని ఇస్తారు. అంటూ నిప్పులాంటి నిజాన్ని చెప్పేసింది సమీక్ష.
- పొత్తూరి విజయలక్ష్మి