కలలు లేని కాలంలో
ప్రేమలు వుండవు,
యుద్ధాలూ వుండవు.
నది గర్భాన్ని చీల్చుకొంటూ
మంద్రంగా ముందుకు సాగే
యేకాడి నావ తెరచాప మీద వేలాడే
నక్షత్రమూ వుండదు.
లోయల మర్మాన్ని పెగుల్చుకొంటూ
పైకి సాగి వచ్చే ఆదిమ గానాల వెంట
శిఖరాల్ని మైమరిపింప చేసే
పరిమళపు పెనుగులాటా వండదు.
నాకిప్పుడు మార్గశిరపు గాలులు
సుడులు చెప్పే రహస్యం కావాలి!
**
కన్నీళ్ళు లేని కాలంలో
ప్రేమలేఖలూ వుండవు, యుద్ధగీతాలు పండవు.
సమాధుల మీద తల వాల్చిన
యెండు పూలగుత్తులు మీద
వసంతం వదిలి వెళ్ళిన గుర్తులలో
వికసించే మార్మిక రంగులువుండవు.
నిశ్శబ్దమైపోయిన సముద్రం మీద
చెదిరిపోయిన వెన్నెల మరకలు
తీరానికి నెట్టేసిన
తడి మిలమిలల మీద
ప్రకాశించే రహస్యపు రాత్రులు వుండవు.
నాకిప్పుడు శిశిరపు వేళ
ఆకురాలే చప్పుళ్ళు విప్పి చెప్పే నిగూఢాలు కావాలి:
రుతువులు లేని కాలంలో
ప్రేమికులు వుండరు, యుద్ధగాయాలూ వుండవు.
గృహోన్ముఖ సాయంకాలాల మీద
చిలకరించే చినుకుల చప్పుళ్ళ మధ్య
మౌనంగా విరబూసే యింద్రధనస్సు
గుచ్చుకున్న బిరుదరహాసాలూ వుండవు.
విచ్చుకోని ప్రభాతాలలో
చిగురించే పక్షుల గానాల మీదుగా
తేలివచ్చే తొలకరుల
తొణికిసలాడే తొలి చెమ్మలూ వుండవు.
నాకిప్పుడు క్షతగాత్ర చరిత్రలు చెప్పే
రోదనామయ స్వప్నమాలికలు కావాలి!
అలా తూలిపోతూనైనా సరే
అలా సోలిపోతూనైనా సరే
ఓ అద్భుత పదచిత్రమై
విస్ఫోటిస్తూ నైనా సరే
పూపిరి పోసుకుంటున్న గండపువ్వు వునికి మీద బెంగపడుతూనైనా సరే
కరిగి పరుగులెడుతూ తన అద్భుత రాగాల్ని రాత్రికి వినిపించే
సెలయేరుగానైనా సరే
అడివి నుంచి మహోగ్రంగా
యెక్కు పెట్టే విల్లంబుగానైనా సరే
నాకిప్పుడు ప్రేమ కావాలి
అవును. నాకిప్పుడు
ప్రేమలు మాత్రమే నిండిన దేశదేహాలు కావాలి.
నేనిప్పుడు దాని కోసం
నిగూఢంగా నిశ్శబ్దంగా నిర్భీతిగా నిర్విరామంగా సాగుతూనే వున్న
యుద్ధాల మీద ప్రేమలకి పదును పెడుతున్నాను.*
- కుప్పిలి పద్మ