అందాల పూదోటలో వెల్లి విరిసిన
సుగంధ సువాసనల
సిరిమల్లెవు నువ్వు
పుప్పొడి వత్తిడులకే కందిపోయే గులాబీవి నువ్వు
నలుగురు అన్నలకి
ముద్దుల చెల్లివైనావు
మనసిచ్చి ప్రేమించిన భర్తకు
ముద్దులొలికే ముద్దబంతివైనావు
రెండు వసంతాలు అయినా
చవిచూడ కుండానే
నీ నుదుటి కుంకుమ
ఆకాశాన్ని హత్తుకు పోయిందా!
ఎంత చిత్రమైనది ఈ విధి అన్నది!
మత మౌడ్యాలకీ
మూఢ ఆచారాలకీ
బానిసలైన ఈ జనం
నిన్ను అగ్నికి ఆహుతి చేశారా?
ఆ క్షణాన
నీ సున్నితమైన హృదయం
ఎంతటి ఆవేదనకు గురయ్యిందో
నేను ఊహించ లేను తల్లీ!
అతి గారాబంగా పెంచిన
అన్నల హస్తాలే నీకు
అగ్ని పరుపులు పరిచి
మంట పెట్టాయా తల్లీ!
నీ ప్రాణాల్ని కాపాడలేని
ఈ మూర్ఖపు జనం
నీకు కోవెల కట్టి అనునిత్యం
కాపలా కాస్తారట!
పూజలు చేస్తారట
ఎంతటి వెర్రి ప్రేమో నీ మీద
నీ పేరుని
సువర్ణాక్షరాలతో వ్రాస్తారట
ఎంతటి
దయార్ద్ర హృదయులో కదా!
చూసావా
నా బంగారు చిట్టి చెల్లీ!
ఈ ఘోర కృత్యాన్ని ఆపడానికి
రాజా రామమోహనరాయలు
లాంటి వాళ్ళు ఇప్పుడు
ఎక్కడా లేరు!
కందుకూరి వీరేశలింగం కానీ గురజాడ కానీ లేరు తల్లీ!
వారి తరం వేరు
అలాంటి వారు మళ్లీ దొరకరు!
వాళ్ళా ఇక తిరిగి రాలేరు మళ్లీ!
______
(స్త్రీ వకీలు ఫాతిమాని భర్త చనిపోయినప్పుడు ఫిబ్రవరి 24, 2022 న సోదరులు నలుగురు కలిసి ఆమె సతీ సహగమనం చేసుకున్నట్లు గా సృష్టిoచి ఆస్తికోసం హత్య చేసినట్లు టీవీలో వార్తవిని వ్రాసిన కవిత)
-శ్రీమతి Ch .వెంకట రమణ