( ప్రముఖ కవి,రచయిత,విశ్రాంత తెలుగు
ఆచార్యులు, తెలుగు విశ్వవిద్యాలయం కవిత్వ ప్రతిభా పురస్కార గ్రహీత , సాహితీ వేత్త )
సప్తపది తెలుగు సాహిత్య ప్రపంచంలో ఆవిర్భవించిన మరొక
లఘు కవిత్వప్రక్రియ.
ఈ వినూత్న ప్రక్రియ రూపశిల్పి మన సుధామ. లక్షణ నిర్దేశం చేసి , కొన్ని
మెచ్చుతునకల వంటి సప్తపదులను రచించి మార్గదర్శనం చేశాడు
పుట్టిన రోజునే అనూహ్యమైన, అద్భుతమైన
స్పందన లభించడం గొప్పప్రోత్సాహం, ఆదరణ అనక తప్పదు.
త్ర్యనుప్రాస సుందరమైన సప్తపదులు పరంపరగా వెల్లువెత్తాయి. జాతీయ,
అంతర్జాతీయంగా ఈ సరికొత్త లఘుకవితా ప్రక్రియ అంతలోనే అల్లుకు పోయింది. ఔత్సాహికులు, వర్థిష్ణువులే గాక లబ్ధప్రతిష్టు లైన కవులు, కవయిత్రులు కూడా ఎంతో వస్తువైవిధ్యంతో కలాలు కదిలించారు.
జీవిత చిత్రణం ,రాజకీయం, వ్యంగ్యం, హాస్యం,వాస్తవికత,ప్రణయం,శృంగారం..అన్ని భావాలతో సప్తపదిని శతాధికంగా అడుగులు వేయించారు మన
సాహిత్యకారులు.
'సప్తపది' -అవధానాల్లో దత్తపది ఛాయలు కలిగిన ప్రక్రియ.అవధానాలలో
పృచ్ఛకులు పదాలనిచ్చి అంశం కూడా నిర్దేశిస్తారు.
మన సప్తపది లో సమప్రాస గల మూడు పదాలను కవులే సృష్టించుకొని
భావాన్ని ఏడడుగుల మేర మీరకుండా కవితాత్మకంగా అన్వయించాలి.
సప్తపదులు రాసేవారిలో కొందరికి ఒక్క మనవి ఏమిటంటే, పదానికీ, సమాసానికీ గల తేడాను గుర్తించమని.
సమాసమంటే అర్థవంతమైన పదాలతో ఏర్పడే ఒకేపదం. ఎలాగంటే
రాముడు ఒక పదం ,బాణం మరొకపదం . ఇవి 'రామబాణం'అనే సమాసంగా ఏర్పడితే అది ఒకే పదమవుతుంది. అంటే రామబాణం రెండుపదాలుగా పరిగణిoపబడదు.
"ఇప్పుడు మమ్మల్ని వ్యాకరణం నేర్చుకొమ్మంటారా ఏమిటి?"
అని అనుకోకండి .పద్యకవిత్వం రాయాలంటే ఛందోనియమాలు తెలిసి కోవాలి గదా !అలాగే ఇదీను!
ఈ సూచన దృష్టిలో ఉంచుకొని సృజనాత్మకంగా మీ కలాన్ని కదలించండి.రాజకీయాలు, మతం వంటి సున్నితమైన, ఇతర వివాదాస్పద అంశాల జోలికి పోకుండా హాయిగా, చక్కగా, చిక్కగా సప్తపదించండి.
-డా.వై.రామకృష్ణరావు