నా చెట్టు

Advertisement
Update:2023-02-08 14:04 IST

చిన్నప్పటినుండి చూస్తున్నాను

భూస్థాపితమై పోయిన నా చెట్టు

ప్రతి రాత్రీ

ప్రపంచం నిద్రలో ఉన్నవేళ

ఎక్కడికో

పారిపోదామని ప్రయత్నిస్తుంది.

మనుషుల్లో మూఢభావాల్లా

పాతుకుపోయిన వేళ్ళు

మట్టిని కౌగలించుకుని నిద్రలేవవు.

చెట్టు మాత్రం

పటువదలని విక్రమార్కుడిలా

గాలిభుజంమీద చెయ్యివేసి

భూమిపట్టు వదిలించుకోవాలని

విశ్వప్రయత్నం చేస్తుంది.

ఊపిరి బిగపట్టి

నిశ్శబ్దంగా గింజుకుంటుంది.

ఆకాశంవైపు ఆశగా చూస్తుంది

గాలిలో ఎగిరిపోవాలని కలలు కంటుంది.

ఒళ్లంతా వెన్నెల ముద్దులతో నిండినవేళ

చంద్రుడికేసి చూస్తూ

విరహంతో నిట్టూరుస్తుంది.

రాత్రంతా కన్న కల్లల్ని

మంచుబిందువులుగా మార్చి

ఆకుల చివర ముత్యాలతోరణంలా వ్రేలాడతీసి

తూర్పువైపు తిరిగి

ఆశలకి నీళ్ళొదిలేస్తుంది.

సూర్యుడి ముందు

పట్టుబడిన దొంగలా

తలొంచుకు నిలబడుతుంది.

పారిపోయిన గాలిని తిట్టుకుంటూ

సాయంకాలంకోసం ఎదురుచూస్తూ…

- కె గోదావరి శర్మ

Tags:    
Advertisement

Similar News