దరహాస చాలనం (కవిత)

Advertisement
Update:2023-03-13 13:50 IST

ఎక్కడైనా రైతులు కనిపిస్తే

క్రాప్ హాలిడే ప్రకటించి

అత్యవసర పంటగా

నవ్వుల పంట

వేయమని చెప్పండి

కల్తీలేనివి .. నాసిరకం కానివి

తాలు రానివి ..

పుచ్చులు పట్టని

నవ్వుల విత్తులు విత్తమని

వేడండి

నవ ధాన్యాలు పండే భూముల్లో

నవ్వుల్ని ఎందుకు పండించలేమో ఆలోచించమనండి

అన్నం పెట్టి మనిషిని బతికించినట్టే

నవ్వుల్ని పంచి జగతిని వెలిగించమని వేడండి

అప్పుడు మనం ఎంచక్కా

ఎక్కడికి వెళ్లినా

జేబుల్లోనూ .. బ్యాగుల్లోనూ

కాసిన్ని నవ్వుల్ని పోసుకు వెళ్లొచ్చు

నవ్వు లేని నిరుద్యోగులు

నవ్వే రాని నిర్భాగ్యులు

ప్రపంచమంతా ఉన్నారుగా

వారికి కొన్ని నవ్వుల్ని దానం చెయ్యొచ్చు

కృత్రిమంగా నవ్వుల్ని పులుముకుని పెదాలు సాగిన జబ్బున్న వారికి

నికార్సైన నవ్వుని లేపనంగా అద్దొచ్చు

నవ్వుదానం -మహాదానం

నవ్వు ప్రసాదం -

పంచినకొద్దీ పెరిగే అక్షయం

నవ్వగలిగినంత కాలం

మనిషికి లేమి

నవ్వున్నంత కాలం జగతికి కరువూ ఉండదు

ఏ డబ్బు తెగులు మనసుకు పట్టిందో

నవ్వులు మృగ్యమయ్యాయి

ఆరోగ్య భాగ్యానికి తూట్లు పడ్డాయి

నచ్చినవి కడుపునిండా తినగలగటం

దిగుళ్ళు లేకుండా మనసారా నవ్వగలగటం చెయ్యలేనిమనిషి

జీవగర్ర లేని పంట పొలం కదా !

పదండి !

నవ్వుల బస్తాల్ని

ఎడ్ల బండ్ల మీద వేసి

లోక ప్రయాణం మొదలెడదాం

చేతి సంచులే తెచ్చుకుంటారో

హృదయ కవాటాలనే తెరిచి పట్టుకుంటారో వారి ఇష్టం

మనం నవ్వుల్ని పంచేస్తూ పోదాం

వారిచ్చే ప్రతి ఫల నవ్వులతో

మన బస్తాలు మళ్ళీ

నిండుతూ వస్తాయి

అవును మిత్రమా !

డబ్బు ఇస్తే వెనక్కి రాదు

నవ్వుల్ని ఇచ్చి చూడు

ఎన్నెన్ని నవ్వుల సీతాకోక చిలుకలు నీకూడా వస్తాయో

కరచాలనాలు మానేసి

దరహాస చాలనాలు మెదలెట్టు

ప్రతి మనసూ నిన్న మనసారా ఆలింగనం చేసుకుంటుంది

ప్రతి ప్రాంతం నీకు పాద క్రాంతం అవుతుంది

హరివిల్లులు

ఆకాశంలో కాదు

చిరునవ్వుల్లో కూడా పూస్తాయన్న కొత్త సత్యం

అనుభవంలోకి వస్తుంది

-అయినంపూడి శ్రీలక్ష్మి

Tags:    
Advertisement

Similar News