పద్యమంటే హృద్యంగా
విప్పి చెప్పకుండానే
గొప్పగా ఆలోచింపజేయాలి.
పద్యమంటే సాధారణ పదాలతో
అసాధారణంగా ఉండాలి
అందర్నీ అలరింపజేయాలి.
పద్యం సమకాలీనం కావాలి
దైనందిన పరిస్థితుల
దర్పణమవ్వాలి
పద్యమంటే
లోతుగా ఆలోచించాలి
నీతికై పరితపించాలి
నాతి దయనీయ జీవనాన్నీ
ఈతి బాధల్నీ
దృశ్యమానం చెయ్యాలి
పద్యం మద్యంలా
మత్తుగా కాకుండా
గమ్మత్తుగా మస్తిష్కంలో
విత్తుకోవాలి హత్తుకోవాలి
సమయ సందర్భాలలో
ఉదాహరిస్తే
సభల్లో నిండుగా మెండుగా పండాలి.
అటువంటి పదాల పొందిక
లౌక్య వాక్య చాతుర్యం
అణువునా పాదాల్లో అద్ది
శతక సంపదగా తీర్చిదిద్దిన
జన ప్రయోజక వైజ్ఞానికుడు
సామాజిక క్రాంతదర్శి
వ్యవహారిక మహర్షి
హిత కవీంద్రుడు శ్రీ వేమన.
ఈ వేదికపై శిరసా ప్రణామంతో
అతనిలా జన బాహుళ్య
కవన రచనే నా కామన.
- గుండాన జోగారావు
Advertisement