ఓ పులకింతకై…..(కవిత)

Advertisement
Update:2023-02-20 23:20 IST

ఆ జ్ఞాపకాలు వర్షించినప్పుడల్లా

నేను తడిచి ముద్దవుతుంటాను

చిల్లులు పడ్డ గొడుగు నుండి

జారిపడే చుక్కల్ని చప్పరిస్తూ

ఒక అనిర్వచనీయ అనుభూతికి

లోనయిన మధుర క్షణాలు

నా బాల్యంతో అనేకం మమేకమే...

చెప్పులు లేని కాళ్ళు

చెప్పని కథలెన్నో

బురదలో సరదాగా పారి-పోయాయి

మట్టివాసన పూసుకున్న చిరుజల్లు

నేలకు తాయిలాలు పంచే

విశాల హృదయవతి రూపమై

ఓ సన్నని నీరెండకు

యవనికను దించే మనోహర దృశ్యం...

నాతో గుడ్డలు తడుపుకున్నవారు

ఏ గడ్డపై కాళ్ళ కీళ్ళు నొక్కించుకుంటున్నారో...

గెడ్డాలు నెరసి ఎక్కడ సేదతీర్చుకుంటున్నారో...

వీలుచేసుకుని

ఒకసారి పలకరించవచ్చుకదా

ఒకసారి పులకించి

పులకింపజేయచ్చు కదా నేస్తం ?!

( మా జిగురు లోకేశ్ కి ప్రేమతో...)

- గుండాన జోగారావు

Tags:    
Advertisement

Similar News