హిమాలయ పర్వత సానువుల్లో దేవదారు వృక్ష ఛ్ఛాయల్లో మత్తెక్కించే వింతైన పూల సుగంధాల్లో పట్టు కుచ్చుల్లాంటి పచ్చని మైదానాల్లో విలాసంగా విహంగాల్లా విహరిస్తున్నాం!
ఎత్తయిన మంచు పర్వత పంక్తుల్లో చేయి చేయి ఆప్యాయంగా పట్టుకొని శిఖరం నుంచి శిఖరాన్ని దాటుతూ నింగికి నిచ్చెనలు నిలబెడుతూ ఎక్కడెక్కడి రోదసీలోకో ఎగబడుతూ తనువున తనువై ఒకే మనసై అర్థనారీశ్వరత్వానికి అర్ధం చెబుతున్నాం
అందంగా అనుభవానికి వస్తున్న అనుక్షణం అణువణువునా పొంగుతున్న అత్యుత్సాహం మనసులో మధువు చిలకరిస్తున్న మధుర భావన! అద్భుత సమ్మేళన రాగాల సమన్వయం వేయి సుగంధాలు వెదజల్లుతూ పసిపాపలా అమాయకంగా నవ్వుతూ నన్ను అక్కున చేర్చుకుంటూనే ఉన్నావు!
హఠాత్తుగా ఆకాశంలో నిండిన చిమ్మ చీకటి అంతలోనే ఆ చీకటిని భగ్నం చేస్తూ మిణుకుమంటూ ఉదయించే తారల పంక్తులు. తిరిగి సూర్యోదయం సూర్యాస్తమయం సృష్టి లయ తప్పకుండా పరిభ్రమిస్తూనే ఉంది తన ధర్మాన్ని నిర్విఘ్నంగా నిర్వర్తిస్తూనే వుంది.
వెచ్చని ఆ స్పర్శలో ఇంకా తనివి తీరని ఆ క్షణాన తీయని ఊహల ఊయలలో ఊగుతున్న వేళ ఒక్కసారిగా భయంకర ఎడారిలోకి విసిరివేయబడి ఉలిక్కిపడిన క్షణం ఓహో… అదంతా ఒక భ్రమ!.. ఒక కల! కలయో.. భ్రమో.. అదొక అద్భుతమైన ఊహ అంతే ! ఔను.. ఇది ఒక కలే!!
స్వచ్ఛమైన ప్రేమను ఇప్పటికే వేలమంది నిర్వచించారు లక్షలమంది బాణీ కడితే, కోట్లమంది పలవరించారు. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క బాణి!
ఎవరి నిర్వచనం వారిది!! కానీ, నిత్య జీవితంలో నిక్కమైన ప్రేమకు చోటేది?! సంసారపు ఉక్కు సంకెళ్లు బిగుసుకుపోతూ ఉంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ తో సతతమయ్యే సగటు జీవికి ప్రేమించటమూ ఒక కథే! ఔను, నిజంగా ఓ కలే!!
ప్రకృతిలోని ప్రతి సృష్టిని ప్రేమించు అందరినీ ఆత్మ బంధువుల్లా ఆదరించు ప్రేమా దోమా అంటూ ప్రేయసి అంగాలు వర్ణిస్తూ కలం పట్టుకు కూర్చొని కాలం వృధా చేయకు వాస్తవంలోకి రా! జీవచ్ఛవాల్లా బ్రతుకు ఈడుస్తున్న నిర్భాగ్యులను చూడు కర్మ సిద్ధాంతాన్ని పక్కనపెట్టి వారిని కరుణతో ఆదరించు అందుకు నీ వంతు సాయం అహరహమూ అందించు అంతేగాని, కలల ప్రపంచంలో కలవరించడానికీ ఊహల ప్రపంచంలో ఊయలలూగడానికి ఇది సమయం కాదు! సందర్భం అసలే కాదు!!
-శ్రీమతి వై ఉషా కిరణ్