త్వరలో నాలుగో జాబితా - ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడి
ఇప్పటికే మూడు జాబితాల్లో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు కలిపి మొత్తం 59 మంది ఇన్‌చార్జిలను ప్రకటించిన వైసీపీ.. ఇక నాలుగో జాబితాపై కసరత్తు చేస్తున్నట్టు ఆయన ప్రకటనను బట్టి అర్థమవుతోంది.
రానున్న ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వివిధ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిల నియామకంలో భాగంగా 3 జాబితాలను విడుదల చేసిన వైసీపీ.. త్వరలో నాలుగో జాబితా కూడా విడుదల చేయనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా వెల్లడించారు. ఇప్పటికే మూడు జాబితాల్లో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు కలిపి మొత్తం 59 మంది ఇన్‌చార్జిలను ప్రకటించిన వైసీపీ.. ఇక నాలుగో జాబితాపై కసరత్తు చేస్తున్నట్టు ఆయన ప్రకటనను బట్టి అర్థమవుతోంది.
శుక్రవారం ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఎంపీ విజయసాయిరెడ్డి.. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలో అత్యంత విలువైన నాయకుడని ఆయన చెప్పారు. పార్టీలో ఆయన ప్రాధాన్యం ఏమాత్రం తగ్గదని తెలిపారు. పార్టీలో బాలినేని ఎలాంటి సమస్యా లేదని ఆయన స్పష్టం చేశారు.
చంద్రబాబు దొంగ ఓట్లను ఎలా చేర్చుకున్నది.. ఎలా మేనేజ్ చేస్తున్నది ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్‌కు వివరించామని విజయసాయిరెడ్డి చెప్పారు. రాజకీయ పార్టీలలో విమర్శలు–ప్రతి విమర్శలు సహజమని, కానీ, పార్టీ అధినేతను ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే పార్టీలో ఉన్న ఏ వ్యక్తి అయినా స్పందించవలసిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. కానీ తిట్టమని చెప్పడం తప్పన్నారు. మీడియాతో పాటు తెలుగుదేశం పార్టీ ఆ పదాన్ని ఎందుకు వాడుతుందో తెలియదని ఆయన చెప్పారు. కావాలనే వాళ్లంతా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.